AAMIS (మాంసం ప్రేమ కథ)… సినిమా అంటే ఇలాగే ఎందుకు ఉండాలి.. ఇలా ఎందుకుండకూడదు అనిపించే సినిమా ఆమిస్.. అస్సామి సినిమా.. కాస్త ఓపికగా చూస్తే సినిమాలో విచిత్రాలు, విడ్డూరాలు, విన్యాసాలు, దరిద్రాలు, భాగోతాలు అన్నీ కనిపిస్తాయి.. సినిమా చూశాక మానసికపరమైన మార్పులేవైనా సంభవిస్తే మాత్రం కచ్చితంగా సైక్రియాట్రిస్టును సంప్రదించండి.. ఇది అదో టైపుప్రేమ కథ.. ప్రేమ కథలంటే ఎంతసేపూ అప్పుడెప్పుడో వచ్చిన మణిరత్నం గీతాంజలి.. ఈమధ్యే వచ్చిన ఉప్పెన మాత్రమేనా.. లేకపోతే ప్రేమ కథలంటే దేవదాసు, మరోచరిత్రలాంటివేనా.. ప్రేమ అంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరి కోసం ఒకరు చావడం, ఒకరి కోసం ఇంకొకరు కిడ్నీలు దానం చేసుకోవడం ఇలాంటివేనా.. కాదు, ఆమిస్ చూడండి, మీ అభిప్రాయం మారిపోతుంది.. ఈ సినిమా స్టోరీ గురించి చర్చించే కంటే ఉపోద్ఘాతమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సినిమా చూసేప్పుడు మీకు విద్యాదాఘాతం తగిలినట్టు ఉంటుంది. ఛీఛీ, యాక్ ధూ…లాంటి పదాలు మీ నోటి వెంట వస్తాయి.. ఒకవేళ వాంతులు కలిగితే అది మీ శరీర సహజ లక్షణమే అయి ఉంటుంది. అలాగని ఈ సినిమాలో ఎక్కడా బూతు సన్నివేశాలు, వెగటు దృశ్యాలు ఏవీ ఉండవ్.. క్లుప్తంగా ఇదో మాంస ప్రేమకథ..
ప్రేమిస్తే అమ్మాయికి ఏమిస్తావ్..అంటే ఇందులో హీరో నా శరీరంలో మాంసాన్ని ఇస్తా అంటాడు.. అనడం కాదు తన తొడ కోసి.. నూనెలో ఫ్రై చేసి హీరోయిన్ కి తినిపిస్తాడు.. వినడానికి చెత్తగా… రోతగా ఉన్నప్పటికీ సినిమాలో అసలు పాయింట్ ఇదే.. సినిమా తీసిన దర్శక మహానుభావుడికి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో గానీ అందరిచేతా తిట్టించుకుంటాడు.. సుమన్ phd student / నిర్మల అనే డాక్టర్ చుట్టూ కథ అంతా తిరుగుతుంది.. సుమన్ ఫ్రెండ్ కి బాగోకపోతే డాక్టర్ నిర్మల దగ్గరకి తీసుకెళ్తాడు. అక్కడే ఇద్దరికి పరిచయం మొదలవుతుంది. అక్కడే కనెక్ట్ అయిపోతారు.. ఇద్దరూ ఫుడ్ లవర్స్… సుమన్ కి రకరకాల మాంసాలు వండడం ఇష్టం.. నిర్మలకు అనేక రకాల మాంసాలు తినడం ఇష్టం.. రెండోసారి డాక్టర్ ని కలవడానికి వచ్చిన సుమన్ ఎలుక మాంసం వండి తెస్తాడు.. ఎలుక మాంసాన్ని అంత బాగా ఫ్రై చేసి తెచ్చిన సుమన్ ని మనసారా ప్రేమిస్తుంది… అయితే తనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయి, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మనిద్దరి మధ్యా శారీరక సంబంధం లాంటిదేమీ లేకుండా కేవలం మానసిక సంబంధం మాత్రమే ఉండాలని కండిషన్ పెడుతుంది.. అదోటైపు మానసిక రోగిలా కనిపించే హీరో సుమన్ కూడా అందుకు ఓకే అంటాడు.. ఆ తర్వాత ఆమెకి భూమ్మీద పాకేవి, ఎగిరేవి, ఈదేవి, గెంతేవి.. ఇలా భూమ్మీద ప్రాణమున్న ప్రతి ప్రాణిని కోసి మాంసం వండి ప్రియురాలికి తెచ్చిపెడితే ఆవిడ అతగాడి ప్రేమను ఆ రుచిలో కలుపుకుని తింటూ ఉంటుంది..
Ads
అయితే అన్నిప్రాణుల్ని తిన్న ఆ డాక్టరమ్మకి బోర్ కొడుతుంది.. ఆమె నాలుక కొత్త రుచుల కోసం తహతహలాడుతుంది.. అందుకే ఈసారి వెరైటీగా తన తొడమాంసం కోసి ఫ్రై చేసి తెచ్చి ఆమెకు పెడతాడు.. మనిషి మాంసం రుచి చూసిన ఆ తల్లి వావ్ అంటుంది.. అంతేగాదు తాను కూడా తన శరీరంలో ఒక పార్ట్ నుంచి మాంసం కోసి వండి ప్రియుడికి తెచ్చిపెడుతుంది.. అక్కడితో వారి ప్రేమ మరింత ముదిరిపోతుంది.. అయితే తనకు ఇంకా మనిషి మాంసం కావాలని మారాం చేస్తుంది ప్రియురాలు నిర్మల.. ప్రేమానురాగంలో మునిగి తేలుతూ గిలగిలా కొట్టుకుంటున్న ప్రియుడు తన స్నేహితుడైన ఇంకో డాక్టర్ ను బతిమలాడి మరీ తొడ భాగం మళ్లీ కట్ చేసి మాంసం తీయించి సర్జరీ చేయించుకుని ఆ మాంసం వండి మళ్లీ ఆమెకు పెడతాడు..ఈసారి ఆ రుచికి మైమరచిపోయిన డాక్టర్ నిర్మలమ్మ … ప్రియుడి ప్రేమను చూసి ఆశ్చర్యపోయి ఆనందపడిపోయి మైమరచిపోయి ఇంకా మాంసం కావాలంటుంది..
ఇంకోసారి తొడలోంచి మాంసం కోస్తే నువ్వు పోతావని హెచ్చరిస్తాడు హీరో స్నేహితుడు.. ఆ వార్నింగ్ తో మనసు మార్చుకుంటాడు.. కానీ తన ప్రియురాలి కోరిక తీర్చాలి ఎలా ఎలా అని ఆలోచిస్తాడు.. ఇలా తొడభాగం కోసి కొద్దికొద్దిగా మాంసం పెట్టడం కాకుండా.. ఒకేసారి ఎక్కువ మొత్తంలో మనిషి మాంసం వండిపెట్టి ఆమెను సంతృప్తి పర్చాలనుకుంటాడు.. అలా ఆలోచిస్తూ రోడ్లమీద తిరుగుతూ ఒక రిక్షా నడిపే వ్యక్తిని చంపి అతని మాంసం వండడానికి తీసుకెళ్తుంటాడు.. ఈలోపు పోలీసులకు దొరికిపోతాడు.. అదే క్రమంలో ఇన్నాళ్లు మనిషి మాంసం రుచిమరిగిన డాక్టరమ్మ పోలీసులకు పట్టుబడిపోతుంది.. ఇద్దర్నీ ప్రెస్ మీట్ పెట్టి మరీ పోలీసులు ప్రపంచానికి చూపిస్తారు.. ఇదీ ఆమిస్ సినిమా… కథ.. సినిమా ముగింపులో చూస్తున్న జనమంతా బిత్తరపోవడం మాత్రం ఖాయం.. ఇక్కడ మూడు పాత్రలు ఆశ్చర్యం కలిగిస్తాయి.. ఒక పీహెచ్ డీ స్టూడెంట్ తన తొడ మాంసాన్ని కోసి ఇచ్చేంత దరిద్రపు, నీచ నికృష్ట, ఛండాల ఆలోచన ఎందుకు వచ్చిందీ అనిపిస్తుంది. అలాగే రెండో పాత్రధారి, అదే మన హీరోయిన్ డాక్టరమ్మ ఇలా.. మనిషి మాంసం తింటూ అద్బుతం అంటూ హావబావాలు ప్రదర్శిస్తుంటే చూసే ప్రేక్షకుడు ప్రతి ఒక్కరూ చేతికి ఏది దొరికితే దానితో ఆ తల్లిని చితకబాదాలనుకుంటాడు.. ఇక మూడో పాత్రధారి హీరో స్నేహితుడు .. డాక్టర్ అయి ఉండి కూడా హీరో వచ్చి తొడ కోసి మాంసం తీయమంటే ఎలా తీస్తాడో అర్థం కాదు.. అనురాగ్ కశ్యప్ లాంటి ప్రముఖ దర్శకులు ఈ సినిమాను చూసి అద్భుతమంటూ ప్రశంసించారు.. అంతేగాదు అస్సామీలో ఈ సినిమాకు అవార్డులు కూడా వచ్చినట్టున్నాయి… అయితే ఈ సినిమా ఏ ప్లాట్ ఫాం మీద దొరుకుతుంది అని నన్ను అడగొద్దు.. నేను చెప్పను కూడా.. ఒకవేళ పొరబాటున మీకు దొరికినా సరే… ఈ తొడమాంస సంబంధ ప్రేమ కథ అదే.. ఆమిస్ ను దయచేసి చూడొద్దని నా విజ్ఞప్తి……… అశోక్ వేములపల్లి
Share this Article