ఈరోజు ఎక్కడో తెలంగాణ బ్రాహ్మణ సంఘం సమావేశం జరుగుతున్నట్టు వాట్సప్‌లో వార్త కనిపించింది… వీళ్ల మీటింగులో ఇలాంటి ప్రస్తావనలు వస్తాయో రావో తెలియదు గానీ… మరోవైపు బ్రాహ్మణుల మీద విద్వేషాన్ని చిమ్ముతూ సాక్షి దినపత్రికలో ఓ వ్యాసం కనిపించింది… ఇది రాసింది డా.దేవరాజు మహారాజు… ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ప్లస్ జీవశాస్త్రవేత్త అని సదరు వ్యాస రచయితకు పరిచయం రాశారు వ్యాసం చివరలో…
ఈమధ్య ఎవరో కాపీ రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ ప్రకటించాక దాని విలువ మరింత దిగజారిపోయింది, అది వేరే సంగతి… జీవ శాస్త్రవేత్తలు మతాలపై ఇష్టానుసారం వ్యాసాలు రాయకూడదనీ ఏమీ లేదు… పబ్లిష్ చేసే వాళ్లున్నారుగా… పైగా బ్రాహ్మలు అంటే అందరికీ అలుసే కదా… ఏం రాసినా పెద్దగా ప్రతిఘటన కూడా ఏమీ ఉండదు… ఇదుగో ఇదీ ఆ వ్యాసం… మొత్తం వ్యాస సారంలోకి ఇక్కడ వెళ్లడం లేదు గానీ…
Ads
ఇండిపెండెంట్ జర్నలిస్టు దంపతులు కేవీఎస్ సుబ్రహ్మణ్యం, పురాణపండ వైజయంతి విమర్శ ఏమిటంటే…? (వైజయంతి సాక్షి మాజీ ఉద్యోగి)… ‘‘సాక్షి పత్రిక ఇప్పుడు తన నైజాన్ని బయట పెట్టుకుంది. ఒక వ్యాసంలో బ్రాహ్మణులను దూషించే అంశాన్ని ప్రచురించింది. అవును, ఆ వర్గం ఎవరికీ అవసరం లేదు కదా. ఇప్పుడు బ్రాహ్మణుల్ని దూషిస్తారు. రేపు మరొక సామాజిక వర్గం వంతు వస్తుంది. ఎడిటర్ ప్రమేయం లేకుండా ఇలాంటి వ్యాసాలు ప్రచురిస్తారని అనుకోను…
కులం పేరుతో దూషణ…. ‘ఈ వ్యాసంలో రచయిత దేవరాజు మహారాజు బ్రాహ్మణుల్ని కులం పేరుతో అవమానించాడు… ఇవాళ సాక్షి దినపత్రిక (పేజ్ 4)లో ‘బౌద్ధాన్ని కలిపేసుకున్నారు’ పేరుతో బౌద్ధంపై చదువు, విజ్ఞతలు లేకుండా ఒక వ్యాసం రాసిన దేవరాజు మహారాజు అన్న వ్యక్తి కుల నిందగా బ్రాహ్మణుల్ని అవమానించాడు. అతడు తన వ్యాసంలో ఒక చోట రాసింది:
“బ్రాహ్మణార్యులు బౌద్ధ సాహిత్యాన్ని మార్చి తమ బౌద్ధ హైబ్రీడ్ సంస్కృత భాషలో అమోఘంగా తిరగరాసుకున్నారు. పాలి, ప్రాకృతాలు ముడి భాషలైతే అందులోంచి సంస్కరించబడిందే సంస్కృతమని భారతీయ పరిశోధకులు తేల్చి చెప్పారు. ‘తమ పొట్ట కూటి కోసం బోధిసత్వుడి పేర్లు మార్చి, హిందూ దేవీ దేవతలకు ఆపాదించుకుని, తమకు లెక్కలేనంత మంది దేవతలున్నారని ఒక భ్రమ కల్పించారు”.
దేవరాజు మహారాజు రాసిన ఈ మాటలు పూర్తిగా అసత్యం. ఈ మాటలకు ఏ చారిత్రిక ఆధారాలూ లేవు. పైగా ‘తమ పొట్ట కూటి కోసం…” అంటూ వికృతంగా రాసి బ్రాహ్మణుల్ని అవమానించడం గర్హనీయం. ఇది అతడి అసంస్కారం…’’
నిన్నో మొన్నో ఒక కోర్టు సాక్షికి 5 లక్షల జరిమానా విధించింది… అది ఒకరకంగా పత్రికను అభిశంసించడమే… ఆధారాలు లేకుండా గీతం యూనివర్శిటీ మీద ఆరోపణలను పబ్లిష్ చేశారనేది కేసు… అప్పటి ఎడిటోరియల్ డైరెక్టర్, ప్రస్తుత ఏపీ సీఎం ప్రధాన రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎడిటర్ వర్దెల్లి మురళి, రిపోర్టర్ చింతకింది శ్రీనివాస్‌లను కోర్టు ఈ వార్తలకు బాధ్యులుగా పేర్కొంది…
రిపోర్టర్ రాశాడు, మాకేమీ బాధ్యత లేదు అంటే కుదరదు… పత్రికలో పబ్లిషయ్యే ప్రతి అక్షరానికీ (ఎవరైనా ఆరోపణలు చేసినా సరే) పబ్లిషర్, ఎడిటర్, సదరు కంటెంట్ ప్రొవైడర్ బాధ్యులవుతారు… ఆధారాలుంటే సరే, ఐనా సదరు యూనివర్శిటీ వివరణ, వెర్షన్ పబ్లిష్ చేసి ఉండాల్సింది… సరే, ఇప్పుడు ఆ పాత్రికేయ ప్రమాణాలేమీ ట్రెండ్ కాదు కాబట్టి, ఎవరు ఏమైనా రాసుకుంటున్నారు కాబట్టి చల్తా అనుకుందాం…
సేమ్, సాక్షి ఎడిట్ పేజీలో వ్యాస రచయిత అభిప్రాయాలు, పత్రికకు వాటితో సంబంధం లేదు అని తప్పించుకోవడానికి కోర్టులు అంగీకరించవు… మరి ఈ వ్యాసరచయిత బ్రాహ్మణులపై రాసిన వాక్యాలు సాక్షి పత్రిక అభిప్రాయంగానే భావించవచ్చా..? ఈనాడు, ఆంధ్రజ్యోతి రాతల మీద కస్సుమనే సాక్షి, వైసీపీ తాము శుద్ధంగా ఉండాలని ఎందుకు భావించవు..?
Share this Article