Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ అద్దాలమేడలో ఒక్క గులాబీ పూయలేదు మళ్లీ… పొలమారిన జ్ఞాపకం…

February 9, 2024 by M S R

Abdul Rajahussain …. ప్రియురాలి కోసం కట్టిన అద్దాల మేడ…! ప్రవరాఖ్యుడి పోలికల్లో వున్న ఆ శాస్త్రినే చూస్తోంది అందాల ఆ జగదాంబ….!

నిగనిగలాడే చంద్రుడు నల్లటి మబ్బుల్లోకెళ్ళి పోయేటప్పటికి ఆ వనమంతా చీకటి ఆవరించింది. అడుగులో అడుగేసుకుంటూ శాస్త్రి దగ్గరకొచ్చిన ఆ జగదాంబ అతన్లో కలిసిపోతోంది.! శృంగారంలో వాళ్ళు స్వరాల్ని పలుకుతుంటే మరి భరించలేని ఆడ నెమలి తన గూడు తలుపులు తెరుచుకొని తమకంలో బయటకొచ్చింది.!
కలగలిసి పోతున్నా తనకేసి చూడ్డం సబబు కాదనిపించి విప్పుకుని తన పురిలో తన ముఖం దాచుకుంటా పచ్చగడ్డి మీద పడుకున్నా ఆ పట్టుచీరా పట్టుపంచెల్ని తొక్కుకుంటా ఆకు సంపంగి చెట్టు సంపంగి కిందకెళ్ళిపోతుంటే నవ్వుతా.. విరబూస్తున్న ఆ గులాబీలు చప్పుడు రాని నవ్వులు నవ్వుతున్నాయి.!
కట్ చేస్తే…..!
ఆ వూళ్ళో అగ్రహారికుడైన ఆణివిళ్ళ చిన వెంకట శాస్త్రి మహా అందగాడు. ఆయనలా వీధిలో నడిచి వెళ్తుంటే‌.. జనం రెప్పార్పకుండా చూసేవారు. చిన్నప్పుడే చాలా విద్యలు నేర్చుకున్నాడు‌, సంస్కృతాంధ్రపండితుడు.  ‘చెంపు రామాయణం’ రాశాడు. బొబ్బిలి వీణ మీద కూర్చుంటే 72 మేళ కీర్తిరాగాల ఆరోహణ, ఆవరోహణలు అవలీలగా వాయించేస్తాడు.
రవిచంద్రిక, మలయమారుతం రాగాలంటే శాస్త్రికి చాలా ఇష్టం. ఆయన అద్దాల మేడ ముందూ వెనుక గులాబీ తోట. ఇంటివెనుక ఓ అందమైన పర్ణశాల… పండిత కవి సమయాలన్నీ అందులోనే మేడ నిండా … దాసదాసీజనం..!
ఏ బంధువు వొస్తున్నాడో? ఎవరు ఏది పట్టుకు పోతున్నారో తెలీదు. తండ్రి ద్వారా 500 ఎకరాలొచ్చాయి శాస్త్రికి. కూతురు జానకీ దేవికి ఆడుకునే బొమ్మలు రంగూన్నుంచి తెప్పించాడు శాస్త్రి. భార్య సూరమ్మ చనిపోతే బుల్లెమ్మాయిని రెండో పెళ్ళి చేసుకున్నాడు.పైలా పచ్చీసు జీవితం.
వందరూపాయల నోటుకు చుట్టుకున్న చుట్ట కాలుస్తూ… ఊరి బాగోగుల కోసం ఎంత ఖర్చయినా వెనుకాడకుండా పనులు చేయించేవాడు.  ఖర్చు తడిసి మోపెడు కావడంతో బొదుగుల్ల అగ్రహారం భూమి కాస్తా అమ్మేశాడు. ఓరోజు పెదనాన్న కొడుకు ఆణివిళ్ళ వీర వెంకటసత్యనారాయణ పెళ్ళికి వెళ్ళాడు.
చిలకలూరిపేట, వేల్పూరు, పెద్దాపురం, మురమండ, మండపేటలో నుంచి మేళాల్ని తెప్పించి అయిదు రోజుల పెళ్ళిలో రాత్రిళ్ళు ఆట ఏర్పాటు చేశారు.. వాళ్ళలో మండపేట నుంచి వచ్చిన అందాల రాశి జగదాంబ చూడగానే నచ్చేసింది శాస్త్రికి. అసలు… ఇలాంటి అందెగత్తెలు కూడా వుంటారా అనిపించింది. గొప్పగా నృత్యం అభినయిస్తోంది.
అన్నమాచార్య కీర్తన “చూడగలేను రాముని అందాల రూపం” తెలుసా? అని శాస్త్రి అడిగాడో లేదో.. వెంటనే కీర్తన అందుకొని అభినయించింది. అలా శాస్త్రి చెప్పడం జగదాంబ ఆడిపాడటం జరుగుతూనే వుంది. ఆ రాత్రంతా ఇదే వరస. శాస్త్రి ఇంటికెళ్ళి నా నిద్ర రావడంలేదు.. కళ్ళనిండా జగదాంబ రూపం. మనసంతా ఆమె కాలి మువ్వల సవ్వడే…
మర్నాడు వెళిపోతా జగదాంబ కళ్ళతో రమ్మన్నట్టు గమ్మత్తుగా చేసిన సైగ శాస్త్రి కి అర్థమైంది. ఇంకేం.? తెలవారిందో లేదో జట్కా బండెక్కి శాస్త్రి మండపేటకు బయల్దేరి మండపేటలో జగదాంబ ఇంటి ముందు దిగాడు.. శాస్త్రి కోసమే ఎదురుచూస్తున్న జగదాంబ లోపలికి పట్టుకెళ్ళి పరిచర్యలు చేసింది. పన్నీరు కలిపిన వేడినీళ్ళతో స్నానంచేయించి, లుంగీలా చుట్టుకోడానికి ఖద్దరు పంచె, లాల్చీ, దాని మీద కునేగా మరికుళందు సెంటు రాసింది.
శాస్త్రిని నెమ్మదిగా పందిరి మంచం మీదకు తీసుకువెళ్ళి పరుపు మీద జారేసి, పక్కనే తను చేరి శృంగారం వొలకబోస్తుంటే…. దానికే పేరు పెట్టాలో కూడా శాస్త్రి కి తెలీలేదు. అలా అలసిసొలసిన శాస్త్రి బాగా నిద్రపోయి లేచేసరికి రాత్రయింది. ఆయన ముందు అరిటాకు పరిచి, రుచికరమైన కొత్తపల్లి కొబ్బరి ఆవకాయ వేసింది జగదాంబ..
ఆవ పెట్టిన పనస పొట్టుకూర, ములక్కాడల పులుసు, సన్నబియ్యంతో వండిన అన్నంలో కలుపుకుంటూ ఎంత తిన్నాడో శాస్త్రి కే తెలీ
లేదు‌. రాత్రి తీగమల్లి పందిటికిందేసిన మంచం మీద తెల్లటి పరుపు. పరిమళాల్ని చిందిస్తున్న జగదాంబను గుండెకు హత్తుకొని, మల్లెపందిరి తీగలు సందుల్లోంచి తొంగి చూస్తున్న చంద్రుణ్ణి అదేపనిగా చూస్తుంటే రాత్రి గడిచిందే తెలీలేదు.‌
వాత్సాయన కామసూత్రాలు తెలిసిన జగదాంబ ఆ వారం రోజులూ స్వర్గం ఎక్కడో లేదు… ఇక్కడే వుందనిపించింది. అప్పటి నుండి రాకపోకలు మొదలయ్యాయి. జగదాంబ కూడా కొకరపర్రులోని శాస్త్రి ఇంటికొచ్చి, వుండి వెళ్ళటం మామూలైపోయింది. శాస్త్రి రెండో పెళ్ళాం జగదాంబ అందాన్ని చూస్తూ అలా వుండిపోయేది..!
మండపేటలో జగదాంబ కోసం అచ్చం తనలాంటి అద్దాలమేడ కట్టడం మొదలెట్టాడు శాస్త్రి. గుమ్మాలకు నగిషీలు, బెల్జియం నుంచి అద్దాలు తెప్పించాడు. ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. చివరకు కలప కొనేందుకు డబ్బుల్లేకపోతే. తన ఇంటెనుక వున్న కలపను పీకి మండపేటకు పంపాడు. ఇంటి ముందు గేటును ఊడ బీకి మండపేట అద్దాలమేడ ముందు పెట్టించాడు.

చూస్తూ చూస్తూ 600 ఎకరాలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. ఆఖరికి ఎంతో మోజుపడి తెప్పించుకున్న తన పడగ్గదిలో పందిరిమంచం , బిళ్ళారీ అద్దాలు, చిమ్నీదీపాలు కూడా అమ్మకానికి పెట్టేశాడు. గుర్రాలకు దాణా పెట్టడానికి డబ్బుల్లేక చివరికి మండపేటకు కూడా వెళ్ళలేక పోతున్నాడు శాస్త్రి.

జగదాంబ బ్రతిమాలుతోంది.. “నువ్వు నా దగ్గరికొచ్చేయ్! ఏ లోటూ లేకుండా చూసుకుంటానంటూ బతిమాలింది.. శాస్త్రి ఒప్పుకోలేదు. ” ఏ లోటూ రాకుండా నువ్వు సుఖంగా వుండు” అంటూ జగదాంబ కేసి చూసి నవ్వేశాడు శాస్త్రి.

Ads

ఆ తర్వాత…

వంశీ

తణుకు జమీందార్ల మేడలో జగదాంబ మేళం ఆడ్తుందని తెలిసి, కాలినడకన బయల్దేరి, తనెవరో తెలీకుండా ముఖం మీద కండువా వేసుకొని తలుపు వెనుక నిలబడి చూస్తున్నాడు. ఆ జమీందార్లలో ఒకరైన రఘురామరావు “మొల్ల లేని నాకు తన్నే ముడుచుకొమ్మననే ” అన్న అన్నమయ్య శృంగార కీర్తన ఆలపిస్తా నాట్యం చెయ్యమన్నాడు.
“అది భర్త ముందు మాత్రమే ఆలపిస్తా ఆడ్డం మా సాంప్రదాయం” అంది జగదాంబ. ఆ కండువా ముసుగులోవున్న శాస్త్రి దగ్గరకెళ్ళి జగదాంబ ఆ అన్నమాచార్య శృంగార కీర్తన ఆలపిస్తా ఆడటం మొదలు పెట్టింది.. అది చూసిన జమీందారు నిర్ఘాంత పోయాడు.. అందగాడు, మహాపండితుడు, మహాదానం, గులాబీ రేకులాంటి జగదాంబ ప్రేమికుడు అయిన ఆణివిళ్ళ చిన వెంకటశాస్త్రి చివరిదాకా ఆ జగదాంబనే జపిస్తా చనిపోయాడు…
మీకు తెలుసో లేదు కానీ…. కాకరపర్రులో వున్న శాస్త్రి గారి బంగళాలోని తోటలో నాటి నుంచి నేటి వరకు ఒక్కటంటే ఒక్క గులాబీ పూవు కూడా పూయలేదంటే ఆశ్చర్యంగా వున్నా… ఇదినిజం. మీకు నమ్మకం లేకుంటే..ఇ ప్పుడైనా మీరు కాకరపర్రులోని శాస్త్రి అద్దాల మేడలో కెళ్ళి చూడొచ్చు అంటున్నాడు వంశీ.‌.!

సానివాళ్ళకూ మనసుంటుంది. వాళ్ళకూ బంధాలు, అనుబంధాలు, ప్రేమ, పాతివ్రత్యం, కట్టుబాట్లు, విశ్వాసం వుంటాయనడానికి ఈ కథే సాక్ష్యం. వంశీ తన పొలమారిన ఓ జ్ఞాపకంలో ఇలా శాస్త్రి,  జగదాంబల పవిత్ర ప్రేమను ఇలా బంధించాడు…!!… ఎ.రజాహుస్సేన్..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions