Crime-Panchangam: సంస్కృతంలో గ్రహం మాటకు ముందు ఉపసర్గలు చేరి, మాట కొంచెం మారి-
ఉపగ్రహం
అనుగ్రహం
నిగ్రహం
విగ్రహం
సంగ్రహం
గ్రహణం
గ్రాహ్యం
గ్రహీత
లాంటి ఎన్నెన్నో మాటలు పుడతాయి. పట్టుకోవడం అన్నదే ఇందులో మూల ధాతు రూపానికి ఉన్న అర్థం.
అందుకే గ్రహాలను సవాలు చేస్తూ అంతరిక్షంలో వాటికి దగ్గరగా (ఉప) పంపే ఉపగ్రహాలకు కూడా ముందు శ్రీహరికోట పక్కనున్న చెంగాళమ్మ అనుగ్రహం, ఆపై తిరుమల ఏడుకొండలవాడి ప్రత్యేక అనుగ్రహం కోరుతున్నారు శాస్త్రవేత్తలు భక్తి ప్రపత్తులతో.
వ్యాకరణం ప్రకారం అధికారి చేసే పని ఆధికారికం అయినట్లు- వస్తు సంబంధమయినది వాస్తు అవుతుంది. మాటకు ఆది వృద్ధి రావడం అని ఈ మార్పును వ్యాకరణం సూత్రీకరించింది. అంటే వస్తువుల కూర్పు లేదా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో చెప్పడం అని అర్థం. వాస్తు శాస్త్రం అయి…మూఢ నమ్మకమై…వేలం వెర్రి అయి…చివరకు వాస్తు వేదం కంటే సంక్లిష్టం, గంభీరమై…వాస్తు జ్ఞాన దాడికి అష్ట దిక్కులు దిక్కులేనివై దీనంగా నిలుచున్నాయి.
Ads
ఏడు వారాల్లో మంగళకరమయిన ‘మంగళ’ నామాన్ని కడుపులో దాచుకున్న ఒకే ఒక మంగళవారం లోకానికి ఎందుకో అమంగళవారం అయ్యింది. పేరులో నిలువెల్లా శనిని నింపుకున్న శనివారం పరమ మంగళమయ్యింది.
సెక్యులర్ దేశంలో ఎవరి నమ్మకాలు వారివి కాబట్టి కందకు లేని దురద కత్తికెందుకన్నట్లు…ఉపగ్రహాలకు లేని బాధ ఉపవాసులకు ఎందుకు?
ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఒక కాషాయాంబరధారి అయిన యోగి. ఆయనకు తోడుబోయిన ఆ రాష్ట్ర పోలీసు అత్యున్నతాధికారి డి జి పి విజయ్ కుమార్ పోలీసు అధికారులకు లిఖితపూర్వక ఉత్తర్వులో కొన్ని సూచనలు చేశారు. హిందూ పంచాంగం ఆధారంగా చంద్రుడి వృద్ధి- క్షయాలను, గమనాన్ని అంచనా వేస్తూ…అందుకు అనుగుణంగా రాత్రిళ్లు నిఘా, పెట్రోలింగ్ భద్రతా చర్యలను చేపట్టాలన్నది ఆయన సూచనల్లో ప్రధానమయింది. పంచాంగాన్ని ముందు పెట్టుకుంటే బాగా చీకటి రాత్రిళ్లు ముందుగానే తెలిసిపోతాయని ఆయన ఆ ఉత్తర్వులో సెలవిచ్చారు.
ఇరవై మూడున్నర కోట్ల జనాభాతో భూగోళంలో చాలా దేశాల కంటే పెద్దదయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భద్రత బహుశా ఇక పంచాంగానికి అనుసంధానమై ఉండవచ్చు. ప్రతి పోలీసు స్టేషన్లో పంచాంగం రూల్ బుక్ కావచ్చు. స్టేషన్ ఆఫీసర్- ఎస్ ఓ స్థానంలో పంచాంగ పురోహితుడు రావచ్చు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం- పంచ అంగాలు సరి చూసుకుని పోలీసులు డ్యూటీలు చేయవచ్చు. దొంగ కట్టెదుటే ఉన్నా …రాహుకాలం కావడం వల్ల పోలీసులు పట్టుకోవడానికి అనువైన ముహూర్తం కాదని వెనుకాడవచ్చు.
దుండగుడు పోలీసుపై తుపాకీ గుండ్ల వర్షం కురిపిస్తున్నా…యమగండం కావడం వల్ల సాయుధ పోలీసు ఆయుధం వాడడానికి వీలుకాకపోవచ్చు. బ్యాంకును కొల్లగొట్టిన దోపిడీ దొంగలు ఎదురుపడ్డా…వసంత పంచమి మంచి శుక్రవారం శుభ ముహూర్తం కావడం వల్ల దొంగలకు పోలీసులు కుంకుమ బొట్లు పెట్టి…హారతులు ఇవ్వాల్సి రావచ్చు. దేశద్రోహులు దాక్కున్న చోటు తెలిసినా…చాతుర్మాస్య దీక్ష తొలిరోజు గంగా తీరంలో ఎలాంటి అలజడికి ఆస్కారమివ్వకూడదన్న సనాతన పంచాంగ ధర్మ పరిరక్షణకు కట్టుబడి పోలీసులు చేతులు కట్టేసుకుని కూర్చోవాల్సి రావచ్చు.
మనలో మన మాట-
1 . దొంగలు కూడా ఉత్తరప్రదేశ్ లో పరమ ప్రామాణికమయిన పంచాంగాన్ని ఫాలో అయితే?
2 . దొంగలు పంచాంగాన్ని అసలు నమ్మకపోతే?
3 . దొంగలు కూడా దొంగతనాలకు సుముహుర్తాలు చూసుకుని బయలుదేరితే?
…అయినా ఇవన్నీ మనకెందుకు? ఆ రాష్ట్రం. వారి పంచాంగం. వారిష్టం. ఆ రాష్ట్ర పురోహిత డి జి పి చూసుకుంటారు. మనమిప్పుడు ఆలోచించాల్సిందల్లా-
ఐ పి ఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే హైదరాబాద్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడెమీ సిలబస్ లో పంచాంగాన్ని ఒక సమగ్ర కోర్సుగా ఎలా, ఎప్పుడు ప్రవేశ పెట్టాలి? అని!
ఇక ఉత్తర ప్రదేశ్ పోలీస్ స్టేషన్ల ముందు వెళ్లే వారికి వినిపించే మంత్రాలు:-
“సుముహూర్తే సావధాన…”
“సులగ్నే సావధాన…”
“జంబూ ద్వీపే భరత వర్షే…భరత ఖండే…నైమిశారణ్య నైరుతి దిగ్భాగే…వర్ష ఋతౌ…మాసర యుక్తాయాం…శుక్ల పక్షే…శుభ తిథౌ…సరయూ తీరే…అయోధ్యా రక్షక భట కార్యాలయస్య…అస్మాకం…ప్రజా రక్షణార్థం…ఆయుధాన్ ధారయామి…”
“…పంచాంగం పూజయామి…
…సుముహూర్తం దర్శయామి…”
కొసమెరుపు:-
ఉత్తరభారతం హిందీ పల్లెసీమలో ఒక కోడలికి పిల్లలు పుట్టాలంటే 11 రోజులు అన్న పానీయాలు మాని…పొలం గట్లవెంట మేలిమి బురద నీళ్లల్లో పడుకుంటే చాలు…అని ఒక బాబా చెబితే…ఒక అత్త కోడలికి కాళ్లు చేతులు కట్టేసి…బాబా వాక్కును తు. చ. తప్పకుండా పాటించింది. ఊళ్లో మెదడున్న ఇద్దరు యువకులు వెళ్లి…ఆ కోడలి కట్లు విప్పి…బయటికి తీసుకురాబోతే…ఆ అత్త, ఆ అత్త కన్న కొడుకు అంటే భార్యను బురదలోకి తోసిన భర్త ఆ యువకుల మీద చేయి చేసుకోబోయిన నమ్మితీరాల్సిన బురదలో కూరుకుపోయిన “నమ్మకాల” దృశ్యాన్ని యూట్యూబ్‌లో చూసి తరించండి!
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article