(ఎస్. రాము)……………. క్రూరత్వానికి, పైశాచికత్వానికి, టక్కుటమార గజకర్ణ గోకర్ణ జిత్తులకు ఆలవాలమైన ఆధునిక రాజకీయాల్లో కొన్ని సంఘటనలు అనుకోకుండా శాశ్వతత్వాన్ని సాధిస్తాయి. అలాంటిదే… కింగ్ మేకర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డిసెంబర్ 21, 2020 లో చేసిన ఒక ట్వీట్. ఒక పక్క, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎలాగైనా పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ను కూల్చి పాగా వేయాలని కత్తులు కటార్లు నూరుతుంటే, వంగ దేశంలో కమల వికాసం తథ్యమని అనుకూల మీడియా కోడై కూస్తుంటే… పీకే చేసిన ట్వీట్ మొత్తం బీజేపీ నాయకత్వానికి పెను సవాలుగా నిలిచింది. బీజేపీ ఎంత హడావుడి చేసినా వచ్చేవి వంద లోపేననీ, అంతకు మించి వస్తే తానుచేసే ఈ పని (స్పేస్) నుంచి వైదొలుగుతానంటూ పీకే చేసిన ఈ ట్వీట్ నిజానికి ఆయన గుండె ధైర్యం, ధీమా, జోస్యం, పొగరు.
డంబాలు, గప్పాలు పలికే రాజకీయ నాయకులు గెలుపు మాదే… అని పదేపదే అంటారు గానీ పీకే లాగా ఇంతోటి ధీమాతో ట్వీట్ చేసి మరిచిపోకుండా ఉండడానికి దీన్ని దాచుకోండహే… అని సవాలు విసరరు. సమకాలీన భారతీయ ఎన్నికల చరిత్రలో ఇది ఒక మరిచిపోలేని అంశంగా ఇది నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. కమలనాథుల కనుసన్నల్లో ఉన్న నేషనల్ మీడియా గిల్లినా గిచ్చినా తను ఈ విషయంలో ఆయన వెనక్కుపోలేదు. మొత్తానికి తన అంచనా నిజమై 292 స్థానాల బెంగాల్ అసెంబ్లీలో 200 ప్లస్ స్థానాలు తృణమూల్ కైవసం చేసుకుని హ్యాట్రిక్ చేసింది. అధినేత్రి మమత నందిగ్రామ్ లో ఓడిపోవడం పీకే అంచనాకు అందలేదేమో గానీ… అయన చేసిన పకడ్బందీ వ్యూహరచన, శాస్త్రీయ సాంకేతిక ప్రచార భేరి ఆమెను మరోసారి అందలం ఎక్కిస్తున్నది.
Ads
చేతిలో యావత్ కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం, జేబులో దండిగా వనరులు, పుష్కలంగా రాజకీయ రచనా దురంధరులు, క్రమశిక్షణ కలిగిన క్యాడర్ ఉన్నా… కమలనాథులు దెబ్బతిన్నారు. దాదాపు ఒక ఏడాది నుంచీ వందల మంది సైనికుల లాంటి యువతీ యువకులతో కూడిన ఐ-పాక్ బృందం పీకే నేతృత్వంలో బీజేపీని ఆఫ్ లైన్, ఆన్ లైన్ దీటుగా ఎదుర్కొని నిలబడి విజయహాసం చేసింది. మోదీ, షా తో పాటు కేంద్ర మంత్రులు పెద్ద సంఖ్యలో ర్యాలీల్లో, సభల్లో పాల్గొని మమత ఖేల్ ఖతం అని చెప్పినా… బీజేపీకి రెండంకెలను మించి సీట్లు రాబోవని పీకే ధీమాగా చెబుతూ వచ్చారు. ఆయన ట్వీట్స్ గానీ, టీవీ ఇంటర్వ్యూలు గానీ అర్థవంతంగా, ఆకట్టుకొనేవిగా ఉన్నాయి.
అయినా… పీకే తప్పని నిరూపించకపోయిన నాయకమణ్యులు లోలోపల కుళ్లిపోవడం ఖాయం. ఒక ఐదేళ్లు ఈ పరాభవం వారిని వెంటాడడం తథ్యం. తృణమూల్ సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకుని, మమతను ఒక్కదాన్ని ఒంటరి చేసి ఆమెనే లక్ష్యంగా చేసుకుని పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు విమర్శలు సంధించడం, ఎన్నికల సంఘం వీరికి అనుకూలంగా ఎనిమిది దఫాలుగా ఎన్నికలు నిర్వహించడం, తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరో ప్రకటించకపోవడం, నందిగ్రామ్ లో మమతపై దాడి జరగడం, రెండు రోజుల పాటు ఆమె ప్రచారం చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇప్పించడం… వంటి తప్పులకు కమలనాథులు మూల్యం చెల్లించాల్సివచ్చింది. బెంగాల్ లో ముఖ్యమైన విజయాన్ని సాధించలేక మోదీ-షా బృందం చతికిల పడింది. అయినా… అలనాటి కమ్యూనిస్టుల కోటలో, మేథావులు గడ్డపైన బీజేపీ ఇప్పుడు సాధించిన ప్రతిపక్ష హోదా తక్కువేమీ కాదు. కాకపోతే…. దశాబ్దాల తరబడి బెంగాల్ ను ఏలిన కామ్రేడ్లు పూర్తిగా జీరోలు కావడం ఒక విషాదం!
అనుకున్నట్లు తృణమూల్ ను గెలిపించినా… తాను ఈ స్పేస్ నుంచివైదొలుగుతున్నానని, ఐ ప్యాక్ నాయకత్వం ఇకపై ఈ బాధ్యతలు చూసుకుంటుందని పీకే తృణమూల్ విజయోత్సవాల మధ్యన ప్రకటించడం కొసమెరుపు. కొద్దికాలంపాటు భార్యా బిడ్డలతో గడిపి… తర్వాత సంగతి తర్వాత చూస్తానన్న అభిప్రాయం ఆయన మాటల్లో ధ్వనించింది. పదవీభాగ్యం కలిగించే ఇలాంటి రాజకీయ మాంత్రికుడిని వదులుకోవడానికి మన భారత నాయకులు అమాయకులు కాదు, పేదలూ కాదు…
Share this Article