నిజానికి కేరళలో ఓ ఆనవాయితీ ఉండేది… ఓసారి ఎల్డీఎఫ్, మరోసారి యూడీఎఫ్… ఇలాగే అధికారం మారుతూ ఉంటుంది… పార్టీలు, జనం అలా అలవాటుపడిపోయారు… కానీ మొన్నటి ఎన్నికల్లో దాన్ని బ్రేక్ చేసి ఎల్డీఎఫ్ మళ్లీ విజయకేతనం ఎగరేసింది… అధికారం నిలుపుకుంది… దేశమంతా ఆ జెండా చిరిగిపోతున్నా కేరళలో మాత్రం లెఫ్ట్ జెండాకు మరింత మెరుపును అద్దుకుంది… ఆ విజయానికి కారణాల్లో ఒకటి ప్రభుత్వ పనితీరు… అందులో ఆరోగ్యశాఖ పనితీరు… నిపా వైరస్ విషయంలో గానీ, మొన్నటి కరోనా విషయంలో గానీ కేరళ ప్రభుత్వం బాగా పనిచేసిందని లాన్సెట్ వంటి పత్రికలు సైతం మెచ్చుకున్నయ్… ఆ శాఖకు మంత్రిగా పనిచేసింది శైలజ టీచర్… సో, ఆమె మళ్లీ అదే పదవిలో కొనసాగవచ్చని అందరూ భావించారు… సీపీఎం క్యాంపు నుంచి కూడా అవే సంకేతాలు వెలువడ్డాయ్..,. కానీ..?
మనం చెప్పుకునే లెక్కలు వేరు… సీపీఎం లెక్కలు వేరు… కాదు, పాలిటిక్సులోనే లెక్కలు వేరు ఉంటయ్… రెండురెళ్లు ఎప్పుడూ నాలుగు కాదు పాలిటిక్సులో…! ఆ లెక్క ఫిజిక్స్ టీచర్‌గా పనిచేసిన శైలజా మేడమ్‌కు కూడా బాగా తెలుసు… పొలిటికల్ లెక్కల్లో ఇప్పుడు సమీకరణం మారిందట… ఆరోగ్య మంత్రిత్వ శాఖ కాదు కదా… కొలువు దీరబోయే పినరై విజయన్ కొత్త మంత్రివర్గంలోనే ఆమెకు చోటు లేకుండా పోతోందని కేరళ, ఢిల్లీ మీడియా కోడై కూస్తోంది ఇప్పుడు… పార్టీ విప్‌గా సేవలు అందించాలని ఆమెకు కొత్త బాధ్యత ఇవ్వబోతున్నారట… అంతే మరి… జనం మెచ్చుకునేలా ఎప్పుడూ పనిచేయకూడదు… ప్రత్యేకించి రాజకీయ నాయకులు అస్సలు పనిచేయకూడదు… చేస్తే, ఇదుగో ఇలాగే అనుకోని బహుమానాలు ఉంటయ్…
Ads
ఐక్యరాజ్యసమితి ఆమెను పిలిచి ఉపన్యాసాలు ఏర్పాటు చేయించవచ్చుగాక… కరోనాపై వర్కులో ఆమెకు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కవచ్చుగాక… పలు టీవీలు, పత్రికలు ఆమెకు కితాబులు ఇచ్చిఉండవచ్చుగాక… కేరళ ప్రజానీకం కూడా ఆమె పనితీరుకు ముగ్గులై 60 వేల రికార్డు మెజారిటీతో గెలిపించవచ్చుగాక… ఇంకా ఆమెకు చాలా చప్పట్లు దక్కిఉండవచ్చుగాక…. కానీ సీపీఎం లెక్కల్లో అవన్నీ కొట్టుకుపోయినట్టేనా..? ఆమెను మళ్లీ అదే ఆరోగ్య మంత్రిగా కొనసాగిస్తే అది ఓ మంచి సంకేతం ఇచ్చినట్టయ్యేది… ఐనా ఇంకా ప్రమాణాలు, స్వీకారాలు గట్రా జరగలేదుగా… చూద్దాం, విజయన్ ఏం చేయబోతున్నాడో… ఆమెకు మంచి పేరు దక్కి, బంగారం స్మగ్లింగులో తను బాగా బదనాం అయినందుకు కొంపదీసి ఫీలయిపోవడం లేదు కదా..!! అవునూ, పాతవాళ్లను అందరినీ పీకేసి, కొత్తవాళ్లను మంత్రివర్గంలో తీసుకుంటారనీ, యువరక్తానికి ప్రాధాన్యం ఇస్తారనీ ఓ వార్త వినిపిస్తోంది… భేష్, సూపర్… సో, సీఎం కూడా కొత్తవాడే రావచ్చుగా మరి… అసలే 75 ఏళ్లు…!!
Share this Article