ఈనాడు న్యూస్ వెబ్‌సైట్‌లో ఓ వార్త ప్రముఖంగా కనిపించింది… దాని శీర్షిక… రాష్ట్ర పరిస్థితి చూసి సిగ్గుపడాలా, జాలిపడాలా…? నిజానికి ఈ శీర్షిక సరిగ్గా వర్తించేది ఈనాడుకు… తెలుగుదేశం పార్టీకి…! ఇంతకీ ఈ వార్త సారాంశం ఏమిటో తెలుసా..? ఈనాడు భాషలోనే ఓసారి చదువుకుందాం…
‘‘చూడటానికి వాళ్లు బుడతలే… కానీ వాళ్ల ప్రతి పలుకు ఆలోచింపజేసింది… చంద్రబాబు అక్రమ అరెస్టు, తను చేసిన అభివృద్ధి, జగన్ అరాచక పాలనపై నాయకులకు దీటుగా మాట్లాడారు… వాళ్లు ప్రత్యేక ఆకర్షణ ఆ దీక్ష కార్యక్రమానికి… తమ వాగ్దాటితో ఆకట్టుకున్నారు… ధర్మం తప్పని రాముడికి అరణ్యవాసం, అవినీతి తెలియని చంద్రుడికి జైలువాసం… ఏపీలో పరిస్థితి చూసి జాలిపడాలా, బాధపడాలా, సిగ్గుపడాలా అని రాజమండ్రికి చెందిన ఆరో తరగతి విద్యార్థి పార్థు ప్రశ్నించాడు…
ఐదు కోట్ల ఆంధ్రులకు భరోసాగా ఉన్న చంద్రుడిని సైకో జగన్ అరెస్టు చేయించాడు… నేను చంద్ర తాతయ్యతో కలిసి ప్రజలకు సేవచేస్తా..,.’’ అని గూడూరుకు చెందిన బాలుడు అనిత్ ప్రసంగించాడు’’…. ఇలా సాగిపోయింది వాార్త… సదరు బుడతల మాటల్ని యథాతథంగా రాసేశారు… సరే…
Ads
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ… తనకు సంఘీభావంగా రాష్ట్రమంతా… ఎవరో ఆ ఘన పాత్రికేయుడి భాషలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో నిరసనలు జరుగుతున్నాయి కదా… ఈ నిరసనల్లో భాగంగానే రాజమండ్రిలో చంద్రబాబు భార్య భువనేశ్వరి కూడా దీక్ష చేసింది… దాన్ని తప్పు పట్టొద్దు… తమ పార్టీ లీడర్ అరెస్టుకు నిరసన వ్యక్తీకరించే అవకాశం, అవసరం, హక్కు, బాధ్యత ఆ పార్టీ కేడర్‌కు ఉన్నాయి… సరే, మరీ వైసీపీ వాళ్లు విమర్శిస్తున్నట్టు ఒక కులం లీడ్ చేస్తోందనే వాదనను కాసేపు పక్కనపెడదాం…
ఇలాంటి ప్రదర్శనలతో కోర్టులను ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించడం, జడ్జిలను దూషించడం కరెక్టేనా అనే ప్రశ్నలనూ కాసేపు వదిలేద్దాం… కానీ భువనేశ్వరి దీక్ష వేదిక మీద జరిగింది ఏమిటి..? లోకం పోకడ ఎరుగని చిన్న పిల్లలతో స్క్రిప్టులు చదివించారు… దీంతో ఫాయిదా ఏమిటి..? పైగా అవన్నీ పంచ్ డైలాగులట… ఇప్పటికే సమాజంలో రాజకీయ కాలుష్యం వల్ల సంభవిస్తున్న నష్టాలు అన్నీ ఇన్నీ కావు…
ఇక ఇప్పుడు చిన్న పిల్లల బుర్రల్లో కూడా రాజకీయ కాలుష్యాన్ని నింపాలా..? అసలు ఐదో తరగతి, ఆరో తరగతి పిల్లల అవగాహన స్థాయి ఏమిటి..? వాళ్లకు పాలన రీతులను విశ్లేషించేంత తెలివి ఉంటుందా..? అసలు అన్నీ మాకు తెలుసు అనుకునే ఐటీ ఉద్యోగులతో కామన్ సెన్స్ లేకుండా పోతోంటే ఇక ఈ పిల్లల రేంజ్ ఎంత..? సేమ్, ఆ అలిపిరి దాడి తరువాత చంద్రబాబుకు సానుభూతి ప్రకటించడానికి ఎవరూ రాకపోతే బడి పిల్లలను రప్పించి, వరుసలు కట్టించి, సంతాప ప్రదర్శనలు చేయించారు… ఇప్పుడూ అదే గుర్తొస్తోంది…!!
సత్యమేవ దీక్షలో ఆ పిల్లలకు రంగురంగుల కళ్లద్దాలను కూడా పెట్టారు… వినాయక చవితి పందిళ్లలో నిర్వహించే పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు గుర్తొస్తే తప్పు లేదు… ఈ తెలుగుదేశం క్యాంపు నిర్వాకాలను ఈనాడు వంటి పత్రిక నెత్తిన మోస్తూ, ఆ పిల్లల్ని ఆహా ఓహో అని కీర్తించడం… దేనికి సంకేతం… ఈనాడు ప్రమాణ పతనానికా…? తెలుగుదేశం అనుచిత ధోరణులకా..? యాణ్నుంచి వచ్చిండ్ర భయ్…!! ‘‘సత్యమేవ జయతే దీక్షలో చిచ్చర పిడుగుల గర్జన’’ అట థంబ్ నెయిల్… అసలు సత్యం అనగానేమి..? మళ్లీ ఇదొక చిక్కు ప్రశ్న… పదం బరువుగా ఉందని దీక్షకు వాడేసినట్టున్నారు…!!
Share this Article