అల్లూరి సినిమాలో తూటాల్లాంటి డైలాగులు … రాజకీయాల్లో అమాయకత్వం …
కొద్దిసేపు వారితో మాట్లాడిన తరువాత … మీరు మహారథి గారే కదా ? అల్లూరి సీతారామరాజు సినిమాకు మాటలు రాసిన మహారథి గారే కదా ? అని మరో సారి అడిగితే .. ఔను అని చెప్పినా నాకెందుకో నమ్మడం ఇష్టం అనిపించలేదు .
ఆంధ్ర మాత పేరుతో పార్టీ పెడుతున్నాం . పార్టీ విధానాలు , సిద్ధాంతాలు అన్నీ సిద్ధం అయ్యాయి . కాంగ్రెస్ , టీడీపీ ల్లో ఎవరూ ఉండరు , అధికారంలోకి వచ్చేది ఆంధ్ర మాత పార్టీనే … ఇదీ సంక్షిప్తంగా మహారథి చెప్పిన మాటలు .
ఆంధ్రభూమిలో ఫోకస్ అని ఓ పేజీ ఉండేది . ఒక అంశంపై పలువురు ప్రముఖుల అభిప్రాయాలు ఆ పేజీలో వచ్చేవి . ఏదో రాజకీయ పరిణామంపై మహారథితో మాట్లాడమని బ్యూరో చీఫ్ చారి మహారథి ఫోన్ నంబర్ ఇస్తే ఫోన్ చేశాను .
చదువుకొనే రోజుల్లో అల్లూరి సీతా రామరాజు సినిమా ప్రభావం తీవ్రంగా ఉంది . అందులో ఈటెల్లాంటి డైలాగులు ఇంకా గుర్తున్నాయి . ఆ డైలాగులను షూటింగ్ లోనే ఏ రోజుకు ఆ రోజు రాసింది మహారథి . అల్లూరి సీతారామరాజుగా కృష్ణ రూపం , దుస్తులు ఎలా ఉండాలో నిర్ణయించింది మహారథి . ఒక యజ్ఞంలా ఈ సినిమాకు ఆయన నిష్ఠతో పని చేశారు .
అల్లూరి సీతారామరాజు సినిమాకు అలాంటి డైలాగులు రాసిన వారు అంటే , దానికి తగ్గట్టు ఉహించుకుంటాం .. కానీ మహారథి రాజకీయాల గురించి మాట్లాడితే , ఆ సినిమాకు డైలాగులు రాసిన మహారథి , ఫోన్ లో మాట్లాడిన మహారథి ఒకరేనా ? అనే అనుమానం వచ్చింది . ఆ నేనే , ఈ నేను అని అయన చెప్పినప్పటికీ , చారిని మరోసారి అడిగాను . ఏంటీ ఈయన ఆయనేనా ? అని …
Ads
ఆయనే ఏంటీ మేం పార్టీ పెడుతున్నాం , అధికారంలోకి వచ్చేస్తున్నాం అని చెప్పాడా ? అని చారి అడిగితే ఔను అన్నాను . మహారథి పార్టీ పెడుతున్నాం , అధికారంలోకి వచ్చేస్తున్నాం అని నాతోనే కాకుండా అందరికీ సీరియస్ గానే చెప్పేస్తున్నాడని అర్థమైంది .
ఎప్పుడో అల్లూరి సీతారామరాజు సినిమాకు మాటలు రాసి , పార్టీ పెడితే అధికారంలోకి వచ్చేస్తాం అని ఎలా ఉహించుకుంటారో అర్థం కాలేదు .
అప్పుడు కాంగ్రెస్ , టీడీపీ రెండు ప్రధాన పక్షాలు ఉన్నాయి . ఈ రెండు పార్టీలను కాదని అడ్రెస్ లేని ఆంధ్ర మాత పార్టీ ఏ విధంగా అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారో , అంత భ్రమల్లో ఎలా ఉంటారో అర్థం కాలేదు . అధికారంలోకి రావడం మాట దేవుడెరుగు ఆ రెండు పార్టీలను వదిలి నాయకులంతా ఆంధ్ర మాత లోకి చేరిపోతారని మహారథి ఎలా కలలు కంటున్నారో అర్థం కాలేదు . ఒక రంగంలో మేధావులుగా గుర్తింపు పొందిన వారు మరో రంగం గురించి ఇంత అమాయకత్వంతో ఎలా ఉంటారో అనిపించింది మహారథి రాజకీయ జోస్యాలు విన్న తరువాత . చివరకు మహారథి పార్టీ పుట్టిందో లేదో తెలియకుండానే అదృశ్యం అయింది .
———————————————————————–
పార్టీ కరపత్రాలు పంచిన నూకల చిన సత్యనారాయణ… సికింద్రాబాద్ లోని ఆంధ్రభూమి ఆఫీస్ నుంచి వారాసిగూడలోని ఇంటికి వెళుతుంటే చిలకలగూడ వద్ద కొంతమంది ఒక రాజకీయ పార్టీ కరపత్రాలు పంచుతూ కనిపించారు . అలా పంచుతున్న వారిలో ఒకరు ప్రఖ్యాత కళాకారుడిలా అనిపించి అలానే చూస్తుండి పోయాను .
ఆయన దారిలో కనిపించిన వారందరికీ కరపత్రాలు పంచుతున్నా సరే తీసుకున్న వారిలో పెద్దగా స్పందన లేదు . వారికి ఆయన ఎవరో కూడా తెలియదు . ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత మహా మహోపాధ్యాయ నూకల చిన సత్యనారాయణ . అంతటి వారు రోడ్డు మీద రాజకీయ పార్టీ కరపత్రాలు పంచడం వింతగా అనిపించి , ఓ కరపత్రం తీసుకొని మాట్లాడాను ఇదేంటి అని …
పత్రీజీ అని ధ్యానంను ఒక ఉద్యమంగా మారుమూల గ్రామాల్లో సైతం వ్యాపించేట్టు చేశారు . పత్రీజీ పిరమిడ్ పార్టీ అని ఒక రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేశారు . రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికల్లో గెలవాలి అని కాకుండా ధాన్యం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో పిరమిడ్ పార్టీ తరపున ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసేవారు . దానిలో భాగంగా పత్రీజీ సికింద్రాబాద్ అభ్యర్థిగా నూకల చిన సత్యనారాయణను నిలబెట్టారు . దానితో మహా మహోపాధ్యాయుడు కరపత్రాలు పట్టుకొని కనిపించిన వారికల్లా ఇచ్చారు .
గత ఎన్నికల సమయంలో ఓ జడ్జీ గారు తొందరపడి ఇతర పార్టీల టికెట్ల కోసం ప్రయత్నించకండి , ఢిల్లీ వెళుతున్నాను , పార్టీ రిజిస్టర్ చేసుకొని వస్తాను అని వెళ్లారు . పార్టీ రిజిస్టర్ ఐతే చేశారు కానీ పట్టించుకున్న వారు లేరు .. ఈసారి చివరకు ఆయన కూడా తన పార్టీ గురించి మరిచిపోయారు .
చాలా మంది కళాకారులు , మేధావులు రాజకీయ పార్టీలు పెట్టి , చివరకు పార్టీ పెట్టిన విషయం కూడా వాళ్ళు మరిచిపోతారు . రాజకీయాలు టివిలో కూర్చొని విశ్లేషణ చేసినంత ఈజీ కాదు . పత్రికల్లో రాసినంత సులభం కాదు .. అంత ఈజీ అయి ఉంటే మీడియాధిపతులే అధికారంలో ఉండేవారు … – బుద్దా మురళి
Share this Article