రైతుబంధు… సరిగ్గా బీఆర్ఎస్ ఆశించిన ఫలితం నెరవేరింది… తను వేసిన ప్లాన్ పారింది… కేంద్ర ఎన్నికల సంఘం తప్పులో రెండుసార్లు కాలేసింది… ఇజ్జత్ పోయింది… బీఆర్ఎస్ పెద్దల మొహాల్లో చిరునవ్వులు మొలిచాయి…
రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు వేయడం అనేది కేసీయార్ పొలిటికల్ లబ్ధి ఆలోచన… నిజంగా రైతుల కోసమే అయితే పదెకరాలు దాటిన వాళ్లకు అంది ఉండకూడదు, నిజంగా వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే అందాలి… అది ఉపయుక్తం… కానీ బలిసిన రైతులకూ డబ్బులు వేయసాగారు… బాగా రిస్క్ తీసుకుని సాగు చేసే కౌలు రైతులకు గుండు సున్నా… అందుకే రైతుకు చేసే సాయం నిజంగా సాగుచేసేవాడికే అందాలంటే ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల మీద సబ్సిడీలు ఇవ్వాలి, లేదంటే పండిన పంటకు అదనపు మద్దతు ధర ఇవ్వాలి… ప్రభుత్వమే ఆ ధరలకు కొనాలి…
ఇవేమీ చేయకుండా… ఖాతాల్లోకి డబ్బులు వేయడం అనేది జనాకర్షక పథకమే అయిపోయింది… సరే, చిన్న రైతులకు ఉపయోగకరమే కాబట్టి లోతు విమర్శలు అనవసరం… కానీ సరిగ్గా పోలింగ్ ముందు ఈ డబ్బు ఖాతాల్లోకి వేయడం వల్ల ఎన్నికల లబ్ధి కూడా వస్తుందని బీఆర్ఎస్ ప్లాన్… అందుకే లేట్ చేసింది… ఒకవేళ కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే, ఎన్నికల సంఘం గనుక ఆపేస్తే కాంగ్రెస్ ఫుల్లు డిఫెన్స్‌లోకి నెట్టేయవచ్చు… రైతుల నోటి కాడ బుక్క ఎత్తగొట్టారని బదనాం చేయవచ్చు… సో, ఏది జరిగినా ఫాయిదాయే..,.
Ads
సరిగ్గా పోలింగ్ ముందు రోజుల్లో ఇలా ఖాతాల్లోకి వేల కోట్లు వేయడం ప్రలోభం కిందకు రాదా..? రూల్స్ ప్రకారం రాదు… ఎందుకంటే అది ఆల్‌రెడీ అమల్లో ఉన్న పథకం… కొత్త పథకం కాదు, సో, దాని అమలును ఎన్నికల సంఘం అడ్డుకోలేదు… పోలింగ్ ముందు ప్రలోభం అవుతుందనీ, అది అధికార పార్టీకి ఫాయిదా తీసుకొస్తుందని భావించి ఉన్నట్టయితే ముందుగానే ఎన్నికల సంఘం అడ్డుకుని, పోలింగ్ అయ్యాక పంపిణీ చేయండి అని చెప్పి ఉండాల్సింది… కానీ చెప్పలేదు…
పోనీ, అదే స్టాండ్ మీద అలాగే ఉండాలి కదా… లేదు, ఎవరో ఫిర్యాదు చేశారని కూడా కాదు, హరీష్ చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో… తను పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది… ఇది మరో తప్పు… కేసీయార్ ఆలోచన తెలుసు కాబట్టే… కాంగ్రెస్ జాగ్రత్తగా తిప్పికొట్టింది… రైతుబంధు ఆగినా బాధపడకండి, మేం రాగానే 15 వేలు వేస్తాం, ఒకవేళ పంపిణీ జరిగినా సరే, మేం హామీ ఇచ్చిన మేరకు అదనపు సొమ్ము ఇస్తాం అని ప్రకటించింది… కానీ పొలిటికల్ ఫాయిదా కోసం హరీష్ చేసిన వ్యాఖ్యలతో ఎన్నికల సంఘం హఠాత్తుగా కళ్లు తెరుచుకున్నట్టు నటించి, ఠాట్, ఈ పంపిణీ వీల్లేదు అనేసింది…
(ఒక అభ్యర్థి ఏదో మాట్లాడితే అది ఓవరాల్ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా..? వస్తుంది, ఎందుకంటే, హరీష్ బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కాబట్టి… తను చేసే వ్యాఖ్యలు పార్టీ చేసినట్టే కాబట్టి…) కాంగ్రెస్ ఫిర్యాదుతోనే ఎన్నికల సంఘం రైతుబంధు ఆపేసిందని హరీష్ చెబుతున్నాడు… కానీ తను చేసిన వ్యాఖ్యలతోనే ఆపేసినట్టు ఎన్నికల సంఘం చెబుతోంది… ఇలా…
ఇప్పుడు ఎన్నికల సంఘం పంపిణీ అనుమతిని ఉపసంహరించుకోగానే బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘం వద్దకు వెళ్లారు… హరీష్ తదితరులు ఆల్‌రెడీ స్టార్ట్ చేశారు… కాంగ్రెస్ రైతుల నోటి కాడ బుక్కను ఎత్తగొట్టింది, దుర్మార్గం అని పాట మొదలెట్టారు… ఇలా కూడా ఎన్నికల సంఘం చర్య బీఆర్ఎస్‌కు ఉపయోగపడుతోంది… ఒకసారి వోటర్లు ఎవరికి వోటేయాలో డిసైడ్ చేసుకున్నాక ఇలాంటివన్నీ పెద్దగా ప్రభావం చూపవు…
ఐతేనేం, ఈ మొత్తం ప్లాన్ బీఆర్ఎస్ అనుకున్నట్టుగానే సాగుతూ… కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేయడానికి, బీఆర్ఎస్‌కు ఎంతోకొంత పొలిటికల్ ఫాయిదా పొందడానికి ఉపయోగపడుతోంది… మొత్తానికి ఎన్నికల సంఘం ఆచితూచి, సమర్థ నిర్ణయాలు తీసుకుంటుందని ఎవరైనా భ్రమపడితే అది శుద్ధ అబద్ధం అని మరోసారి రుజువైంది…
Share this Article