.
‘బంగారం లాంటి మలయాళ సినిమా – ‘పొన్మన్’ ____ // కోడూరి విజయకుమార్ //
1
‘పిల్ల మెడలో బంగారం బంగారం పెట్టకుండా ఎవరు పెళ్లి చేసుకుంటారు?’
పెళ్లి సంబంధం కోసం వచ్చే అతిథులను తలచుకుని, సినిమా ఆరంభంలో ఒక తల్లి ఆవేదన!
‘నా మెడలో ఈ బంగారం లేకపోతే ఇక్కడ నాకు బతుకు లేదు’
సినిమా మధ్యలో బంగారం వెనక్కు ఇవ్వవలసిన పరిస్థితులు తలెత్తినపుడు కొత్తగా పెళ్లయి అత్తగారింటికి వచ్చిన ఒక అమ్మాయి బాధ!
Ads
ఈ సన్నివేశాలు ఉటంకిస్తున్నానంటే, ఈ మలయాళ సినిమా ‘పొన్మన్’ ఒక సీరియస్ కథా చిత్రమని పొరబడే ప్రమాదం వుంది.
ఇప్పటికీ, అమ్మాయి పెళ్లి అంటే వరకట్నం కింద అబ్బాయి వాళ్లకు బంగారం కూడా పెట్టడం అనే ఒక దిక్కుమాలిన వ్యవస్థ మీద వేసిన వ్యంగ్యాస్త్రం ఈ ‘పొన్మన్’ సినిమా.
పోల్చడం సరికాదు గానీ, ఒకప్పటి ‘కన్యాశుల్కం’ మీద మన గురజాడ అప్పారావు రచించిన ‘కన్యాశుల్కం’ నాటకం వినోదభరితంగా సాగుతూనే, ఆనాటి వ్యవస్థ మీద, వ్యక్తుల మీద పెట్టిన పదునైన విమర్శ వంటి దానినే ఈ ‘పొన్మన్’ సినిమా వరకట్న సమస్య మీద పెట్టింది.
2
స్థూలంగా ఈ సినిమా కథ చెప్పాలంటే (‘స్పాయిలర్స్ ఎహెడ్’ అనే మాట ఈ సినిమా మీద పోస్ట్ కు అవసరం లేదు అనుకుంటున్నా – బహుశా, సినిమా చూసిన తరువాత మీకూ అదే అనిపిస్తుంది)-
అనగనగా కేరళలోని కొల్లం పట్టణంలో నివసించే ఒక పేద బెస్తవాళ్ల కుటుంబం.
ఇంటి యజమాని బతికి వున్న రోజులలో పడవల్లో చేపలు పట్టి తెచ్చి, ఆ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసి లోకం విడిచి వెళ్ళిపోయాడు తప్ప, తన తదనంతరం లోకం లోనే బతకవలసిన కొడుకు కూతురు కోసం ఏమీ మిగల్చలేదు. ముఖ్యంగా కూతురి పెళ్లి కోసం.
ఇక ఇంటి బాధ్యత తీసుకోకుండా తిరిగే కొడుకు సంగతి – ‘పార్టీ కోసం, పార్టీ నాయకుల కోసం ప్రాణం పెడితే, జీవితంలో ఏ కష్టం వచ్చినా పార్టీ చూసుకుంటుంది’ అన్న ధీమా! సందర్భం వస్తే పార్టీ కోసం చర్చితో కూడా గొడవ పెట్టుకునే మనిషి!
‘అంతా ఆ దేవుడే చూసుకుంటాడు’ అని విశ్వసించే ఆ యింటి తల్లి ‘సందర్భం వస్తే చర్చి సాయం చేస్తుంది’ అని నమ్ముతుంది. ఆ నమ్మకంతోనే 32 ఏళ్ళ వయసున్న కూతురికి ఇంకా ఆలస్యమైతే కష్టమని 25 సవర్ల బంగారం కట్నానికి పెళ్లి సంబంధం ఖాయం చేస్తుంది. ఇంతా చేసి, ఆ సంబంధం నుండి ఆ తల్లి ఆశించింది – ‘ఆ అబ్బాయికి పూటకు ఇన్ని చేపలు రొయ్యలు దొరికితే కుటుంబం గడిచిపోతుంది కదా’
కానీ, 25 సవర్ల బంగారం సమకూరేది ఎట్లా ?
పెళ్లి సవ్యంగా జరిగిపోతే, ఆ 25 సవర్ల బంగారానికి అవసరమైన సొమ్ములు అమ్మాయి కుటుంబానికి బంధువులు స్నేహితులు చదివించే కట్నాల డబ్బులతో సమకూరిపోతాయి.
కానీ, పెళ్లి సమయంలో అమ్మాయి ఒంటి మీద ఆ 25 సవర్ల బంగారం వుండి తీరాలి కదా !
సరిగ్గా ఇక్కడే ఆ ఇంటి కొడుకు పార్టీ స్నేహితుల ద్వారా ఒక బంగారు నగల బ్రోకర్ పాత్ర ప్రవేశిస్తుంది. పేరు అజీశ్.
పెళ్ళికి కొంచెం ముందర పెళ్లి కూతురు ఎంచుకున్న 25 సవర్ల నగలను ఈ అజీశ్ అందజేస్తాడు.
పెళ్లి పూర్తయిన రోజు సాయంత్రం లోగా వచ్చిన కట్నాల డబ్బులు లెక్కగట్టి ఆ 25 సవర్ల బంగారం డబ్బులు అతడికి చెల్లించాలి.
లెక్క తక్కువైతే ఆ మేరకు బంగారం తిరిగి ఇచ్చేయాలి.
ఉత్తి మాటలు కాదు – ఒప్పంద పత్రం మీద పెళ్లికూతురు సంతకం చేయాలి.
‘తేడా వస్తే తగ్గేదిలేదు – నా బంగారం ఎట్లా వెనక్కు తీసుకోవాలో నాకు బాగా తెలుసు’
మామూలు ఎత్తు వున్న మామూలు మనిషిలా కనిపించే అజీశ్ చెయ్యెత్తు మనుషులకు చేసే హెచ్చరిక !
‘ఛీ! ఏమి దయలేని మనిషి వీడు’ అని ఒకవైపు అనిపిస్తూ వున్నా, మరొకవైపు ‘అది వాడి జీవనాధారం కదా మరి’ అని మరొకవైపు అనిపిస్తే, ఆ గొప్పదనం కథ రాసిన వాళ్ళది, కథని సినిమా తీసిన వాళ్ళది, ఆ పాత్రను ఆవాహన చేసుకున్న నటుడిది.
ఇంతా చేసి, ఈ అజీశ్, బిల్లులు రశీదులు లేకుండా బ్లాక్ మనీ సంపాదించే బంగారు నగల దుకాణాల యజమానుల కోసం పనిచేసే కమిషన్ ఏజెంట్. జీవితంలో పెద్ద కలలున్న వాడు. చూసుకోవలసిన తల్లి, చెల్లి వున్న పేదవాడు.
3
మామూలుగా చూస్తే ఈ సినిమా పెళ్లి నగల బ్రోకర్ కథ (పొన్ – అంటే బంగారం; పొన్మన్ – బంగారు మనిషి)
వరకట్నం సమస్య మీద సినిమా అంటే, సాధారణంగా ఏ ట్రాజెడీ కథనో, లేక ఏ క్రైమ్ థ్రిల్లర్ కథనో, అదీ ఇదీ కాదంటే మన తెలుగు ‘రాఖీ’ కథ వంటి భీభత్స రివెంజ్ స్టోరీని అల్లుకుంటారు.
కానీ, ఇది మలయాళం వాళ్ళు తీసిన సినిమా కాబట్టి, మన ఊహలకు భిన్నమైన కథను అల్లుకున్నారు.
అట్లా అని, థ్రిల్లర్ సినిమా తరహా స్క్రీన్ ప్లే కూడా ఈ సినిమాలో కనిపించదు.
చాలా సన్నివేశాలు మన ఊహకు అందే విధంగా సాగుతూ వున్నా ప్రతి సన్నివేశంలో ఒక తెలియని ఆసక్తి ప్రేక్షకులను వెంటాడుతుంది.
బహుశా, ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా హాయిగా సాగిపోయిన ఇటువంటి స్క్రీన్ ప్లే రాసుకున్న సినిమాని ఈ మధ్యకాలంలో చూడలేదు నేను
ఈ సినిమాలోని మరొక గొప్ప విషయం – పాత్రలను కృతకత్వం లేకుండా మలిచిన తీరు. అవి జీవితంలోంచి సరాసరి వెండి తెర మీదకు నడిచి వచ్చినట్టుగా అనిపించిన తీరు
ముఖ్యంగా – సినిమా ప్రారంభం నుంచి చివరకు వచ్చేసరికి, ముఖ్యమైన పాత్రలలో వచ్చే అనూహ్యమైన మార్పులను అత్యంత సహజంగా చిత్రించిన తీరు.
మరీ ముఖ్యంగా, కథలోని అత్యంత బలవంతుడు, కఠినాత్ముడు, ‘కథలో వీడే విలన్’ అనిపించే పెళ్ళికొడుకు మీద కూడా సినిమా చివరకు వచ్చేసరికి కొంత జాలి కలుగుతుంది. ఎందుకంటే, జీవితంలో వాడు ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా పరిష్కారం ఆ 25 సవర్ల బంగారం లోనే వుంది మరి.
4
ఈ సినిమాలో నటులు మాత్రమే పాత్రలు పోషించలేదు
‘కొల్లం’ ఊరు, ఆ ఊరి పరిసరాలు, దుకాణాలు, లాడ్జీలు, చర్చి, పార్టీ ఆఫీసు, ఆ ఊరి సంస్కృతీ అన్నీ సినిమాలోని పాత్రలుగా మనల్ని పలకరిస్తాయి.
‘ఎక్కడి కథ చెబుతున్నారో, ఎవరి కథ చెబుతున్నారో, ఏ కాలం కథ చెబుతున్నారో’ స్పష్టత లేకుండా సాగే తెలుగు సినిమాకు ఇటువంటివి అంతగా జీర్ణం కాకపోవొచ్చు.
నటీనటులందరూ గొప్పగా నటించినా, సినిమా పూర్తి అయ్యాక పెళ్లి నగల బ్రోకర్ అజీశ్, పెళ్లి కూతురు స్టెఫీ మనల్ని వెంటాడుతారు
ముఖ్యంగా, అజీశ్ పాత్ర పోషించిన ‘బాసిల్ జోసెఫ్’ కు ఈ మధ్యకాలంలో నేను అభిమానిగా మారిపోయాను.
‘సూక్ష్మ దర్శిని’ సినిమాలో విలన్ గా వేసిన వాడు, ‘నూనక్కుజి’ రోలర్ కోస్టర్ కామెడీ చిత్రంలో హాస్యం పంచినవాడు, ‘మిన్నల్ మురళి’ వంటి ఇండియన్ సూపర్ హీరో సినిమా తీసిన దర్శకుడు ఈ కుర్రవాడే అంటే నమ్మడం కష్టం!
5
ఇంతకీ, ఈ సినిమా ఎవరి కథ ?
ఈ సినిమాలో తారసపడే పాత్రలు ఎవరు ?
‘డబ్బులు లెక్క ప్రకారం ఇవ్వలేకుంటే, నా నగలు వెనక్కు తిరిగి ఇవ్వవలసిందే’ అని హెచ్చరించే పెళ్లి నగల బ్రోకర్ విలన్ అనుకోవాలా ?
అగ్రిమెంట్ మీద సంతకం సంగతి తెలిసి కూడా ‘ఇప్పుడు నా ఒంటి మీద ఈ నగలు లేకుంటే నా బతుకు లేదు’ అని తెగేసి చెప్పే పెళ్లికూతురు విలన్ అనుకోవాలా?
అగ్రిమెంట్ మీద సంతకం చేసి కూడా ‘నీకు మాత్రం తల్లి లేదా? తల్లి బాధ అర్థం చేసుకోవా?’ అని దబాయించే పెళ్లి కూతురి తల్లి విలన్ అనుకోవాలా ?
‘చెల్లి పెళ్లి బాధ్యత తీసుకోలేని అన్నవు- నువ్వు వుండి ఉపయోగం ఏమిటి?’ అని తల్లి, చెల్లెలితో మాటలు పడే అన్న విలన్ అనుకోవాలా ?
‘పెళ్లి చేసి అత్తగారింటికి పంపిన పిల్లకు బంగారం బాకీ వున్నాం – పెళ్లి కావలసిన పిల్లకి కొంత బంగారం పెట్టాలి’ అని ఏకరువు పెట్టే అత్త విలన్ అనుకోవాలా ?
సినిమా చివరికి వచ్చేసరికి, ‘వీళ్లు ఎవరూ విలన్లు కాదు- అసలు విలన్, ఈ వ్యవస్థ’ అని మీకు అనిపిస్తే, ఆ గొప్పదనం ఈ సినిమాది.
సినిమా మొదట్లో ప్రస్తావించిన పార్టీ, చర్చి (లేక, మతం- అది ఏ మతం అయినా) కూడా పెళ్లి, వరకట్నం సమస్యల పట్ల ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి/ పెంచి పోషిస్తున్నాయి అని మీకు ఏవగింపు కలిగితే, ఆ గొప్పదనం ఈ సినిమాది
సినిమా చూస్తున్నపుడు-
‘ఇంట్లో నలుగురు ఆడపిల్లలున్నరు. ఒక్కరి మెడలో కూడ ఇంత బంగారం లేకపాయె’ అని మా నాయనమ్మ పదే పదే బాధపడిన సందర్భాలు జ్ఞాపకం వొచ్చి దిగులుగా అనిపించింది
ఇల్లు గడవడం కోసం, నాన్నకు తెలియకుండా మా అమ్మ తన ఒంటి మీది తాళి బొట్టు కూడా తాకట్టు పెట్టినపుడు, ఇంట్లో జరిగిన గొడవలు గుర్తుకొచ్చి కాస్త భయం వేసింది
నేను ఉద్యోగంలో చేరిన తరువాత, మా అమ్మ తాను పోగొట్టుకున్న ఆ బంగారాన్ని తిరిగి కొని పెట్టడం లక్ష్యంగా పెట్టుకున్న రోజులు గుర్తుకొచ్చి, రెండేళ్ల క్రితం అమ్మ చనిపోయిన తరువాత, తన ఒంటి మీద మిగిలిన కొంచెం బంగారం ‘ఇద్దరు మనవరాళ్లకు ఏదైనా చేయించి ఇస్తే మంచిది’ అని అయ్యగారు చెప్పిన సంగతి గుర్తుకొచ్చి, దుఃఖంగా అనిపించింది.
మీ జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు ఉంటే, ఈ సినిమా చూసినపుడు మీకూ అవి గుర్తుకు రావొచ్చు !
6
సినిమా చివరిలో ఒక మాట ఉంటుంది –
‘ఆడపిల్ల అసలైన అందం ఈ బంగారు నగలు లేకుండా వున్నపుడే చూడాలి – ముఖం లోని వెలుగు సహజమైన అందం’
తులం బంగారం ధర 80 వేలు దాటినా, బంగారం పెట్టకుండా పెళ్లి చేయలేని ప్రస్తుత స్థితిలో ఇది క్రూడ్ జోక్ గా అనిపిస్తే ఆ తప్పు ఎవరిది?
(“పొన్మన్” మలయాళ సినిమా – తెలుగు డబ్బింగ్ తో – డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో వుంది)
Share this Article