.
కమలా హారిస్ గెలవాలని ఆమె పూర్వీకుల ఊరిలో గ్రామస్థులు పూజలు చేశారంటే… ఆమె మన బిడ్డ అనే ఓ ఎమోషన్ కారణం… తప్పుపట్టడానికి ఏమీ లేదు… ఆమె, ఆమె పార్టీ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు వాళ్లకు అక్కర్లేదు… తమ ప్రేమను వ్యక్తీకరించడం అది… అంతే…
కానీ ఢిల్లీలో ఒకాయన ట్రంపు గెలవాలని పూజలు, హోమాలు చేశాడు… ఆయన పేరు మహా మండలేశ్వర స్వామి వేదమూర్తీనంద సరస్వతి… ఆనంద, సరస్వతి అనే పదాలు పేరులో ఉన్నాయంటే ఏదో స్వయం నిర్మిత పీఠానికి స్వయం ప్రకటిత అధిపతి అనే అనుమానం సహజంగానే వస్తుంది…
Ads
మనకు చాలామంది ఆనంద సరస్వతులున్నారు కదా… ఇంతకీ ఆయన ట్రంపు గెలవాలని ఏం పూజలు చేస్తున్నాడు..? నో, నో, మీరు అనుకుంటున్నట్టు సోకాల్డ్ మన తెలుగు నాయకులు నమ్ముకునే రాజశ్యామల యాగం కాదు, వేణుస్వామి చేయించే దశమహావిద్యల బాపతు వామపూజలు కూడా అస్సలు కాదు…
ఆయన గారు చేయించే పూజల వివరాలు కూడా ఎవరికీ చెప్పడు… నేను చేశాను, మీరు చూశారు, అంతే… సరేగానీ, ట్రంపు ఎందుకు గెలవాలి..? ఈమధ్య హిందువుల రక్షణ కోసం, హక్కుల కోసం కొట్లాడతాను అన్నాడు కదా… దాంతో హఠాత్తుగా తను హిందూ మతమద్దతుదారు అయిపోయాడు…
ప్రత్యేకించి బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో… ఇండియాలోనే సోకాల్డ్ పెద్ద పెద్ద లీడర్లు, పార్టీలు కిక్కుమనని నేపథ్యంతో ఎక్కడో ఆ అమెరికాలో ఎన్నికల్లో పోటీచేస్తున్న ట్రంపు హిందూ రక్షణ అనేసరికి ఇదుగో ఇలాంటి పీఠాధిపతులకు ప్రీతిపాత్రుడయ్యాడు…
అప్పట్లో దాదాపు ఇవే కారణాలతో ట్రంపు గెలవాలని కూడా పూజలు జరిగాయి… తరువాత ఏం జరిగింది..? ఏమీ ఉండదు… ఆ దేశ విధానాలు వేరు, అవసరాలు వేరు… ఇదే ట్రంపు వలస ఉద్యోగుల మీద కన్నెర్ర చేశాడు… తద్వారా ఫస్ట్ నష్టపోయింది మన ఉద్యోగులు, మన విద్యార్థులే… ఇప్పుడు తను గెలిచినా జరగబోయేది అంతే… ఈ మాటల ట్రంపరికి ఇప్పుడు అమెరికాలోని హిందువుల వోట్లు కావాలి… అంతే…
కమలాహారిస్‌కు కూడా హిందువుల వోట్లు కావాలి… దానికి అధికారికంగా దీపావళి ఉత్సవాలు కూడా చేస్తారు బైడెన్, కమలా… అంతేకాదు, నా రూట్స్ భారతీయం అని చెప్పడానికి వాళ్ల అమ్మతో కలిసి దిగిన చిన్నప్పటి ఫోటోను ప్రచారంలోకి తీసుకొస్తుంది ఆమె… నా రూట్స్ ఆఫ్రికన్స్ అనీ చెప్పుకునే ప్రయత్నమూ చేస్తుంది…
విధానాలు మాత్రమే కాదు… ఏదో ఓ ఎమోషన్‌తో తమ ప్రచారానికి వాల్యూ యాడిషన్ తీసుకొచ్చే ప్రయత్నాలు ఇవి… పర్ సపోజ్, ఇదే ట్రంపు గెలిస్తే… ఖలిస్థానీ శక్తులకు మద్దతుదారుగా మారిన కెనడా ప్రభుత్వాన్ని నిలువరించగలడా..? హెచ్చరించగలడా..? ఈరోజు హిందూ గుడిపై, భక్తులపై జరిగిన దాడి మీద ఒక్క మాటైనా మాట్లాడాడా..? ట్రంపు, కమల అమెరికన్లు… అంతే… హఠాత్తుగా హిందూ బంధువులైపోరు..!!
Share this Article