- పాత్రికేయ మిత్రుడు శివప్రసాద్ వ్యంగ్యంగా ఇలా అన్నాడు… ‘‘తమిళ బ్రామ్మల పెళ్ళిలో తంగేడుపూల తలంబ్రాలు… భరతనాట్యం బ్యాక్ గ్రౌండ్ లో బతుకమ్మ పాటలు…’’
- మరో సీనియర్ జర్నలిస్టు మిత్రుడు, తెలంగాణ సంస్కృతికి వీరప్రేమికుడు అయితే బాగా తల్లడిల్లిపోయి… ‘‘దయచేసి, ఈ పాట విని … కిందికి మీదికి కాకండి… జీవితంపైన విరక్తి కలుగుతది..’’ అన్నాడు బాధతో…
- మరో పెద్దమనిషి ‘‘సారీ కవితక్కా, పూర్ టేస్ట్, బతుకమ్మ అంటే నేనే అన్నంతగా మస్తు హడావుడి చేస్తుంటవ్, ఇలా నువ్వే మకిలి పట్టిస్తే ఎట్లా’’ అంటాడు కోపంగా…
- ఓర్నాయనో, ఏఆర్ రెహమానూ… నువ్వు సినిమా సంగీతాన్ని ఉద్దరించింది చాలు గానీ, మా కల్చర్ జోలికి రాకు, మమ్మల్నిలా వదిలేసి, నీ దిక్కుమాలిన అతి తెలివి ప్రయోగాలు, తెలివి లేని ప్రయత్నాలు తమిళంలో చేసుకోపో…. అని కుపితుడయ్యాడు సోషల్ మీడియా యాక్టివిస్టు ఒకాయన…
- శంకరభరణం శంకరశాస్త్రి గనుక బతికొస్తే… ‘‘గౌతమ్ మేనన్… శుద్ధ వ్యవహారిక గేయసంస్కృతిలోకి ఈ శాస్త్రీయ గతులు, సంగతులెట్లా వచ్చినయ్రా’’ అని కస్సుమనేవాడు… అసలు ఆ భరతనాట్యాలేమిటి..? ఆ శాస్త్రీయ స్వరజతులేమిటి..? ప్రపంచంలో ఎవరికైనా ఆ సాహిత్యమేమిటో సమజయ్యేనా..? తెలంగాణతనం లేని, తెలంగాణ పదం లేని తెలంగాణ బతుకమ్మ పాటతో ఈ వికట ప్రయోగాలు దేనికిప్పుడు..? అంటూ మరికొందరు కొక్కిరించారు…
తెలంగాణ జాగృతి సమర్పణ, ఏఆర్ రెహమాన్ నిర్మాణం, సంగీత దర్శకత్వంలో, గౌతమ్ మేనన్ దర్శకించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల’ గురించే ఇదంతా..! బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు, యూట్యూబ్ కోసం చాలామంది బతుకమ్మ పాటల్ని ప్రత్యేకంగా రాయించి, తీయించి, విడుదల చేస్తుంటారు… మొదట్లో కాస్త చూడబుల్‌గా అనిపించినా సరే, తరువాత పిచ్చి ప్రయోగాలతో వాటినీ చెడగొట్టారు… ఆ చెడగొట్టినవారి జాబితాలోకి రెహమాన్, గౌతమ్ మేనన్, కవిత చేరిపోవడమే తాజా విషాదం… ఈ పాట మొత్తం పూర్తయ్యాక కవిత చూసిందా ఒక్కసారైనా..? రిలీజుకు ఎలా అనుమతించినట్టు..? అసలు ఎందుకు ఇది..? ఎవరైనా పరాయి రాష్ట్రాలవాళ్లు చూస్తే, ఇదే నిజమైన బతుకమ్మ కావచ్చు అని భ్రమపడితే, భావిస్తే అది తరతరాల మన ఘన బతుకమ్మకు ఎంత నామర్దా..? ఎంత నామోషీ..?
అసలు బతుకమ్మ పాటకు ఈ రెహమానుడు దేనికి..? నడుమ ఈ గౌతముడెవరు..? అసలు ఆ పాటేమిటి..? బతుకమ్మ ఎదుట ఆ గెంతులేమిటి..? బతుకమ్మ ఆడే విధానమేనా అది..? అసలు ఆ రచయిత ఎవరో..? గునుగుపూలు తెలుసు, తంగేడుపూలు తెలుసు, బంతులు తెలుసు, చామంతులు తెలుసు, సకల వర్ణాల్నీ అందంగా అద్దుకునే గడ్డిపూలు తెలుసు… ఈ అల్లిపూలు ఏమిటో..?! ఈ తమిళ, మళయాళ దర్శకులిద్దరూ కలిసి ఈ పిచ్చి పాటతో తెలంగాణ కల్చర్ మీద దాడి చేయడం ఏమిటో..? ఈ గడ్డ మీద పుట్టి, ఈ కల్చర్‌ను ప్రాణాధికంగా ప్రేమించి, అద్భుతంగా పాట కట్టేవాళ్లు లేరా..? పాడేవాళ్లు లేరా..? అచ్చమైన బతుకమ్మను కళ్లముందుకు తీసుకొచ్చేవాళ్లు లేరా..? అసలు బతుకమ్మ ప్రశస్తిని ఇలా యూట్యూబ్ చెరువులో నిమజ్జనం చేసే ఘోరానికి తెలంగాణ జాగృతి పాల్పడటమేమిటి..? అయినా అరిటాకులో బతుకమ్మ ఏమిట్రా బడుద్దాయ్…?! పైగా ఉయ్యాలో అని కూడా సరిగ్గా పాడలేని ఆ అద్భుత గాయకురాలికి నాలుగు ఆస్కార్ అవార్డుల నామినేషన్లకు ఆస్కారం ఏమైనా ఉండునా రెహమానుడా..? ఇప్పటిదాాకా తెలంగాణ పాట మీద, ఆట మీద, పండుగ మీద, భాష మీద, కట్టు మీద, బొట్టు మీద, ఆహారం మీద, ఆహార్యం మీద, మొత్తం సంస్కృతి మీద ఆంధ్రా ఎగతాళిని మాత్రమే చూశారేమో, ఇక తమిళ-మళయాళ దాడినీ చూడాలా..? వచ్చే ఏడాది కన్నడ దాడి ఉండే చాన్సుందా మేడమ్… ఏమో, మీ దయ — బతుకమ్మ ప్రాప్తం… ఫాఫం…!! హవ్వ… దీనికి ఖర్చు 3 కోట్లట…!!!!
Ads
Share this Article