Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!

May 13, 2025 by M S R

.

మొన్నామధ్య మేఘసందేశం సినిమాలోని ‘ముందు తెలిసినా ప్రభూ’ అనే పాట గురించి ముచ్చటించుకున్నాం కదా… గొప్ప భావరచన కానీ అంతకుముందే వచ్చిన ఓ సినిమాలోని ‘రాకోయి అనుకోని అతిథి’ పాటలాగే ఉంటుంది అని ఓ మిత్రుడు గుర్తుచేశాడు…

జానర్ ఒకటే కావచ్చు, అంటే ఒకేతరహా… కాస్త ముందు చెప్పి రావయ్యా ప్రేమికా, కాస్త ఒళ్లూ ఇల్లూ చక్కదిద్దుకోవాలి అని ప్రేమికురాలు చెప్పుకోవడమే… కాకపోతే ఒక్కో గీత రచయిత ఒక్కో తరహాలో రాస్తాడు… కథలోని సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాడు…

Ads

మేఘసందేశంలోని పాట రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి… అసలే జగమెరిగిన భావకవి… ఏదో పాత పాటను స్పూర్తిగా తీసుకోవడం గానీ, కాపీ కొట్టడం గానీ ఊహించలేం కదా… రాకోయి అనుకోని అతిథీ అనే పాట శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ అనే సినిమాలోనిది… ఇది 1976లో వస్తే, మేఘసందేశం 1982లో వచ్చింది… అంటే ఆరేళ్ల క్రితం వచ్చిన ఒక పాటను దేవులపల్లి అనుకరించాడని అనుకోవాలా..? అనుకోలేం కదా…

jayaprada

నిజానికి ఈ అనుకోని అతిథీ అనే పాటను రాసింది పాలగుమ్మి పద్మరాజు… సంగీతమేమో పెండ్యాల నాగేశ్వరరావు… ముందు తెలిసినా ప్రభూ పాట రాసింది దేవులపల్లి కాగా, సంగీతం రమేష్ నాయుడు… రెండు పాటలు పాడింది సుశీలే…

రెండు పాటల్లోనూ నాయిక జయప్రదే… ఐతే చిత్రీకరణలో హస్తిమశకాంతరం ఉంటుంది… రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ తీసింది విజయ ప్రొడక్షన్స్, అంటే చక్రపాణి, నాగిరెడ్డి… పైగా బాపు దర్శకత్వం… ఇంకేముంది..? సూపర్ అనుకుంటాం కదా… కానీ, కాదు…

ఎక్కడో తేడా కొట్టింది, ఫ్లాప్ అయిపోయింది… నిజానికి ఆ సంవత్సరం జయప్రదకు బంగారు సంవత్సరం… అంతులేని కథ, సీతాకల్యాణం, మరుసటి ఏడాదే అడవిరాముడు… ఆ తరువాత ఆమె ఎక్కడికో వెళ్లిపోయింది…

కానీ మేఘసందేశంలో గొప్పగా అభినయించిన జయప్రదేనా… అంతులేని కథలో అదరగొట్టిన జయప్రదేనా ఈ ‘అనుకోని అతిథి’ పాటలో దేభ్యం మొహం వేసుకుని, ఇంత ఘోరంగా నటించింది అనే నిస్పృహ ఆవరిస్తుంది మనల్ని… అసలు బాపేనా దర్శకుడు అని కూడా అనిపిస్తుంది… విస్మయం కలుగుతుంది…

బాపుకన్నా మన దిక్కుమాలిన కార్తీకదీపం, బ్రహ్మముడి, జగద్ధాత్రి సీరియళ్ల దర్శకులు చాలా బెటరేమో అనిపించినా తప్పులేదు… ఒకసారి ఆ పాట చదవండి… చాలా బాగా రాశాడు పాలగుమ్మి… ఎటొచ్చీ నాయిక అభినయం, చిత్రీకరణ దారుణం… ఏ ఫీలూ లేదు, ఎంతమాత్రమూ కనెక్ట్ కాదు… దీనికన్నా మేఘసందేశంలోని ‘ముందు తెలిసినా ప్రభూ’ పాట చిత్రీకరణ వంద రెట్లు బెటర్…



రాకోయీ.. అనుకోని అతిధి

కాకి చేత కబురైనా పంపక
రాకోయీ.. అనుకొని అతిధి
వాకిటి తలుపులు తెరువనే లేదు..
ముంగిట ముగ్గులు తీర్చనే లేదు..
వేళ కాని వేళా..
ఈ వేళ కాని వేళా ఇంటికి రాకోయీ అనుకోని అతిధి
రాకోయీ…
సిగలో పువ్వులు ముడవాలంటే
విరిమల్లెలు వికసింపనే లేదు
కన్నుల కాటుక దిద్దాలంటే
నిద్దుర నీడలు వీడనే లేదు
పాలు వెన్నలు తేనే లేదు..
పంచ భక్ష్యమ్ములా సేయనే లేదు..
వేళ కాని వేళా..
ఈ వేళ కాని వేళా విందుకు రాకోయీ అనుకొని అతిధి
రాకోయీ…
ఊరక దారిని పోతూ పోతూ అలసి వచ్చితివో
ఒంటరిగా ఉన్నానని నే తెలిసే వచ్చితివో
రమ్మనుటకు సాహసం చాలదు
పొమ్మనుటా మరియాద కాదది
వేళ కాని వేళా..
ఈ వేళ కాని వేళా త్వరపడి రాకోయీ అనుకోని అతిధి
కాకి.. చేత కబురైనా పంపక
రాకోయీ.. అనుకోని అతిధి

రాకోయీ…



krishna

‘‘ఎప్పుడుపడితే అప్పుడు రాకయ్యా మహానుభావా… ముందు కాస్త సమాచారమివ్వు… ఇంత పొద్దుగాల వస్తే ఎట్లా దొరా..? ఇంకా వాకిలి ఊడ్వలేదు, సాన్పి చల్లలేదు, ముగ్గులు వేయలేదు… అసలు ఇంకా తలుపులే తీయలేదు…
సిగలో మల్లెలు ముడవాలంటే అప్పటికి అవి విచ్చుకోలేదు, కళ్లకు ఇంత కాటుక పెట్టుకోవాలంటే నిద్ర కళ్లు తెరుచుకోవడం లేదు… ఇంట్లో పాలు లేవు, వెన్న లేదు, సమయానికి తేనె లేదు… నీకేం మర్యాదలు చేయగలను… ఏం వండిపెట్టను..?
ఐనా ఎటో పనిమీద పోతూ పోతూ చటుక్కున నేను యాదికొచ్చి ఇంట్లోకి వచ్చినవా..? ఒక్కదాన్నే ఉన్నానని తెలిసే వచ్చినవా..? కానీ ఈ వేళలో నిన్ను రమ్మనలేను, పొమ్మంటే మర్యాద కాదు… అందుకని కాస్త ముందు చెప్పవోయీ…’’
ఇదీ ప్రేమికురాలి బాధ… అంటే పొద్దున్నే నిద్రలేస్తున్నవేళ వాతావరణమో, ప్రియురాలి తడబాట్లో అంచనా వేస్తాం కదా చిత్రీకరణలో… ఒకావిడ నాయికను అప్పటికే ముస్తాబు చేస్తుంది… నాయిక నగలు దిగేసుకుని, పట్టుచీర కట్టుకుని, మొదటి అంతస్థులో నిలబడి పాడుతూ ఉంటుంది…
పాటకు పూర్తి కంట్రాస్టు… ఇక కృష్ణ సరేసరి… అలా భుజాలు బిగబట్టి, అభావంగా చూస్తుంటాడు జయప్రద వైపు… ఈ పాట చూస్తుంటే అందుకే నవ్వొస్తుంది, చిరాకెత్తుతుంది… బాపును తలుచుకుంటే జాలేస్తుంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!
  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions