మీకు ఏ వంటకం ఇష్టం అనడిగితే… బోలెడు వంటకాలు చకచకా మన బుర్రలో రీల్‌లా తిరుగుతాయి… ఒకటోరెండో సెలెక్ట్ చేసుకోవడం కష్టం… ఏ వంట అస్సలు ఇష్టం ఉండదు అనడిగినా సరే, అదే స్థితి… ఉప్మా ప్రియులకు నచ్చకపోవచ్చుగాక… ఉప్మాను చాలామందిని ఇష్టపడరు ఎందుకోగానీ… నిజానికి వండటంలో సౌలభ్యం, చౌక, టైమ్ తక్కువ ప్రాతిపదికల్లో అదే బెస్ట్ వంట… ఎట్‌లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో… అందుకే ఫంక్షన్లలో టిఫిన్ అనగానే, ఇంటికి బంధువులు రాగానే చటుక్కున ఉప్మాయే ఆదుకునేది…
అదీ సన్న రవ్వ, బొంబాయి రవ్వ ఏమో గానీ దొడ్డు రవ్వతో చేసే ఉప్మాను అస్సలు ఇష్టపడరు చాలామంది… అఫ్‌కోర్స్, అమితంగా ఇష్టపడేవాళ్లూ ఉంటారు… కూరల్లో జిగట కారణంగా బెండకాయ, చేదుతో కాకరను కొందరు ఇష్టపడరు… ఇష్టపడ్డవాళ్లు అదే స్వర్గం అని అడుగంటా నాకేస్తుంటారు… మరీ బోడ కాకర, అంటే ఆకాకర డిమాండ్ అంతా ఇంతా కాదు… వంకాయను చాలామంది ఇష్టపడతారు… ఆహా ఏమి రుచి, తినరా మైమరిచీ వంటి పాటలూ రాసుకుని లొట్టలేశాం కదా… వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామామణియున్… అంటూ నెత్తిన పెట్టుకున్నాం కదా…
అది ఏరకం వంకాయైనా సరే, తోడుగా మరో కూరగాయ ఏదున్నా సరే, వంకాయ అలా కలిసిపోయి, ఆత్మారాముడిని టెంప్ట్ చేస్తుంది… అసలు వంకాయ అంటే వంకాయే… దానికి పోటీ ఏముంది..? కానీ విచిత్రంగా ప్రపంచంలోకెల్లా చెత్తా వంటకాలేవి అనే పోటీలో వంకాయ కూడా చేరి విభ్రమను కలిగిస్తోంది… నిజానికి ఇది టేస్టీ డిషుల జాబితాలో కదా కనిపించాల్సింది… అసలు ఏమిటీ సర్వే..? అందులో ఈ ఆలూ బైంగన్ చేరడం ఏమిటి..?
Ads
ఆన్‌లైన్ ఫుడ్ పోర్టల్ ఒకటి ఉంది… పేరు ‘టేస్ట్ అట్లాస్’… ప్రతి ఏడాది ప్రపంచంలోని టాప్ 100 చెత్తా ఆహారాల జాబితా విడుదల చేస్తుంటుంది… అలాగే ఈసారి కూడా చేసింది… మన దేశం నుంచి తక్కువ రేటింగ్స్ పొంది ఆలూ భైంగన్ ఆ జాబితాలో చేరింది… 100 వంటకాల్లో దీని ప్లేస్ 60 అట… ఇది వంగ ప్రియులను కూర మాడిపోయినంత అసంతృప్తికి గురిచేస్తోంది…
బంగాళదుంప (ఆలూ), వంకాయ, కాసిన్ని ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్టు వేస్తారు… ఇది గ్రేవీ వంటకం… నిజానికి దక్షిణ భారతంలో ఈ కాంబినేషన్ వంట తక్కువే… మరీ బ్రహ్మచారులు గట్రా ఎక్కువగా ఆ కాంబినేషన్ మీద ఆధారపడుతుంటారు… కానీ నార్త్‌లో ఈ కూర విరివిగానే వండుతుంటారు… రొట్టెలకు, చపాతీలకు ఆధరువు… అంత పాపులర్ డిష్‌కు తక్కువ రేటింగ్స్ రావడం ఏమిటి..? ఎవరైనా వంకాయకు వ్యతిరేకంగా కుట్ర చేశారంటారా..?
లేకపోతే వంకాయకు రేటింగ్స్ ఏమిటండీ..? అది అన్నింటికీ అతీతమైన అతిరుచి, సారీ, అభి‘రుచి’ కదా… ఈ సర్వేలో అత్యంత తక్కువ రేటింగ్ పొందిన వంట హాకర్ల్… ఐస్‌లాండ్ డిష్… షార్క్ మాంసాన్ని రోజులకొద్దీ పులియబెట్టి వండుతారు… ఘాటు… తినేవాళ్లూ తక్కువే… లోకల్ పీపుల్ తప్ప వేరే ఎవరూ టేస్ట్ చేయలేరు… సేమ్, అమెరికాకు చెందిన రామన్ బర్గర్ సెకండ్ వరస్ట్ డిష్ అట… నూడిల్స్ డిష్ ఇది… పెద్ద టేస్టీ డిష్ ఏమీ కాదు, తక్కువ రేటింగ్స్ తప్పేమీ కాదు…
ఈ సర్వేలో అన్ని దేశాల ప్రజలూ పాల్గొంటారు… ఏ వంట నచ్చదో రేటింగ్ ఇవ్వాలి… దాన్ని బట్టి చెత్తా ఆహారాన్ని డిసైడ్ చేస్తారు… అఫ్‌కోర్స్, ‘ఆహా’రాలకు కూడా రేటింగ్స్ ఇస్తారు… చివరగా… హహహ… నెట్‌లో చెక్ చేస్తుంటే ఈ వార్త హిందుస్థాన్ టైమ్స్ తెలుగు పోర్టల్‌లో కూడా కనిపించింది… ప్రపంచంలోని చెత్త వంటకాల్లో చోటు, ఆలూ బైంగన్‌కు అవమానం అన్నట్టుగా ఏదో రాస్తూ పోయారు… ఫాఫం, ఇదే సైట్ గత నెలలో ఆలూ వంకాయ్ కూరకు సాటిలేదు అని వండే విధానంతోసహా ఓ స్టోరీ పబ్లిష్ చేసింది… జిహ్వకోరుచి కదరా సుమతీ…
Share this Article