తెలుగులో ప్రతి అగ్ర హీరోకు అప్పట్లో సూపర్ హిట్లు, కెరీర్ బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చిన పెద్ద దర్శకుడు… లాజిక్ ఆలోచిస్తే మ్యాజిక్ పోతుందని నమ్మి, లాజిక్ రహితంగానూ సినిమాల్ని నిలబెట్టిన దిగ్దర్శకుడు… ఎనభయ్యేళ్ల వయస్సులో విశ్రాంతి తీసుకోకుండా ఇంకా ఏదో చేయాలని తాపత్రయం… కానీ కొత్త తరానికి కోవెలమూడి రాఘవేంద్రరావు తెలిస్తే కదా… అప్పటి ఆలోచనలు, ధోరణికి కొత్త తరం కనెక్ట్ అయితే కదా… అందుకే ఏ పని చేసినా ఇప్పుడు ఫెయిల్యూరే…
బొడ్డు దర్శకుడిగా పేరు గాంచిన రాఘవేంద్రరావు నిజానికి ప్రశాంత శేషజీవితం గడపాలి… ఒకరిని డిస్టర్బ్ చేయకూడదు… కానీ ఊరుకోదు కదా, సినిమా తనకు ఓ వ్యసనం… ఇప్పటి ట్రెండింగ్ అంటే వీడియోలు… యూట్యూబ్ వీడియోలు… పెద్ద పెద్ద కొత్త దర్శకులు సైతం సోషల్ మీడియా ద్వారా, ఇన్‌స్టా వీడియోల ద్వారా ప్రేక్షకులతో టచ్‌లో ఉంటారు… చాన్నాళ్లకు ఈ విషయం గుర్తించిన ఈ భీష్మాచార్యుడు తనూ ఓ యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేశాడు…
చిరంజీవి చేతుల మీదుగా వాలెంటైన్స్ డే రోజున స్టార్ట్ చేయిస్తాడట… భోళా శంకర్ సెట్‌లోకి రాఘవేంద్రరావు వెళ్లాడు అంటే ఏమో అనుకున్నాం, ఓహో, ఈ లాంచింగ్ చేయాలి రమ్మని చెప్పడం కోసమా..? అదేమిటి ఆచార్యా, మీరు చెబితే ఎంతటి చిరంజీవి అయితేనేం, కాదంటాడా.,.,? సరే, లాంచ్ అయిపోయింది… రాఘవేంద్రరావు తన సొంత ఫేస్ బుక్ పేజీలో, వాల్ మీద దీన్ని షేర్ చేసుకున్నాడు ఈరోజు మధ్యాహ్నం… ఓ ఫేస్‌బుక్ ఫ్రెండ్ చెబితే ఓపెన్ చేసి చూద్దును కదా… ఆ పోస్టు పెట్టిన రెండు గంటలకు కూడా ఒక్కటంటే ఒక్క లైక్ లేదు… షేర్ లేదు… చదివిన వాడు, దేకినవాడు లేడు… ఫాఫం అనిపించింది…
Ads
కృష్ణారామా అనుకునే వయస్సులో కొత్తనీటికి ఇంకా అడ్డంకిగా ఎందుకు మాస్టారూ, తప్పుకోవచ్చు కదా అనిపించింది… మళ్లీ కాసేపటికి చూస్తే అసలు కనిపించనే లేదు… ఆడియెన్స్‌లో కొందరు మాత్రమే చూసేలా సెట్టింగ్స్ మార్చినట్టున్నారు… ఇలాంటివి అందరూ చూడాలని కదా కోరుకుంటారు, మరి ఈయనేమిటి ఇలా అనుకుంటూ మళ్లీ కాసేపటికి ఆసక్తిగా ఓపెన్ చేస్తే సెట్టింగ్స్ మళ్లీ మార్చినట్టున్నారు… కనిపించింది…
లేదు, లేదు, కనిపించలేదు, ఇది మాయమైంది… మరో కొత్త పోస్టు ఉంది… ఇదే కంటెంట్, మార్పులు చేసి కొత్తగా పెట్టినట్టున్నారు… సరే, ఇప్పుడు కొందరు చూసినట్టు, లైకినట్టు కనిపిస్తోంది… ఇక్కడ ఓ చిన్న ప్రశ్న… అయ్యా, రాఘవేంద్రరావు గారూ, ఈ వయస్సులో ఇంకా శ్రమపడే ఎనర్జీని దేవుడు ఇచ్చాడు… సంతోషం… కానీ ఇప్పుడు కూడా ఈ వర్క్ అవసరమా..? నువ్వు కష్టపడి, ప్రయాసపడి, ఆయాసపడబోకు… అడిగినవాళ్లకు మార్గదర్శనం చేయాలి… సరిపోదా..?! లేదా ఏ సుమనో కూర్చోబెట్టి ఓ టాక్ షో చేయి, సరిపోదా..?!
Share this Article