మనం చాన్నాళ్లుగా చెప్పుకుంటున్నదే… సుమ ప్రోగ్రామ్స్ టీవీల్లో మొనాటనీ వచ్చేశాయనీ, బోర్ కొడుతున్నాయనీ, తన రూట్ మార్చుకోకపోతే యాంకర్‌గా, హోస్ట్‌గా తన పాపులారిటీని కోల్పోక తప్పదనీ…! కానీ సుమ తన బలహీనత ఏమిటో తను గుర్తించడం లేదు… నో డౌట్, ఆమె స్పాంటేనిటీ, వాగ్ధాటిలో తనను కొట్టేవారు లేరు… కానీ ఒకే తరహా ఫార్మాట్‌లో, ఒకే తరహా విసుర్లతో సాటే తన ప్రోగ్రామ్స్‌ను ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడటం లేదిప్పుడు… మరోసారి నిరూపితమైంది…
దీనికి నిదర్శనం ఏమిటో తెలుసా..? మస్తు హైప్ క్రియేట్ చేసుకుని, ఏకంగా చిరంజీవి పాపులారిటీని, ఇమేజీని కూడా వాడుకున్న ‘సుమ అడ్డా’ ప్రోగ్రామ్ టీవీ రేటింగ్స్‌లో మళ్లీ ఢమాల్ అనేసింది… గత వారం బార్క్ రేటింగ్స్‌లో జస్ట్, 1.59 జీఆర్పీలు వచ్చినయ్… అత్యంత దయనీయం… ఓ నాసిరకం సినిమాను పన్నెండోసారి ప్రసారం చేసినా సరే, ఇంత దారుణమైన రేటింగ్స్ రావు… ఈ రేటింగ్ చూసి టీవీ బిజినెస్ సర్కిళ్లు విస్తుపోతున్నయ్…
ఈ ఏడాది జనవరిలోనే రెండు, రెండుంబావు రేటింగ్స్ వస్తుంటే ‘ముచ్చట’ ఓ స్టోరీ రాసింది… ఈ రెండు నెలల తరువాత అది కోలుకోకపోగా… మరీ దిగజారిపోయింది… ఓ భిన్నమైన షో డిజైన్ చేసుకోలేక, రకరకాల టీవీ ప్రోగ్రాములు, చివరకు కపిల్ శర్మ కామెడీ షో అనుకరణ కూడా కలిపేసి, ఓ కిచిడీ షోకు రూపకల్పన చేసుకోవడమే ఈ ఫ్లాప్‌కు కారణం… ఇంకా దాని గురించిన చర్చ వేస్ట్… ఆమె వేరే షోలు కూడా పెద్దగా చేస్తున్నట్టు లేదు…
Ads
కార్తీకదీపం తరువాత ఆ రేంజులో అదరగొట్టే సీరియళ్లు ఏమీ స్టార్ మాటీవీలో రావడం లేదు… నాలుగైదు సీరియళ్లు ఫస్ట్ ప్లేసు కోసం పోరాడుతున్నాయి… బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, కృష్ణా ముకుందా మురారి, ఇంటింటి గృహలక్ష్మి ఆ పోటీలో ఉన్నాయి… ఒకప్పుడు టాప్ 30 ప్రోగ్రాముల లిస్టు చూస్తే అన్నీ మాటీవీ ప్రోగ్రాములే కనిపించేవి… కానీ ఇప్పుడు జీతెలుగు ప్రవేశించింది… మంచి రేటింగ్స్‌తో త్రినయని ఈసారి టాప్ 30లో అయిదు స్లాట్స్ దక్కించుకుంది… గుడ్… ఈ సీరియల్ ప్రధాన పాత్రధారిణి ఆషికా పడుకోన్‌కు మరింత మంచి పాత్ర మాటీవీ సీరియల్‌లో గనుక దొరికితే ప్రేమీ విశ్వనాథ్ రేంజుకు వెళ్తుంది… కానీ జీతెలుగు ఆస్థాన నటి…
నానాటికీ తీసికట్టు అన్నట్టుగా జబర్దస్త్ తన ఫేమ్ కోల్పోతుందని మనం గతంలోనూ చెప్పుకున్నాంగా… మరీ ఘోరం ఏమిటంటే ఈసారి ఈటీవీ టాప్ 30 జాబితాలో కూడా లేకుండా పోయింది… ఎక్సట్రా జబర్దస్త్ 3.46, శ్రీదేవి డ్రామా కంపెనీ అదే 3.46 రేటింగ్స్‌తో నిరాశపరచగా… జబర్దస్త్ అయితే మరీ 3.25 రేటింగ్స్‌తో మరింత దిగువన ఉండిపోయింది… నాసిరకం స్కిట్లు, మొనాటనస్ ఫార్ములా ఈ ఫ్లాపులకు కారణం… ఒక్క రాఘవ మినహా దమ్మున్న స్కిట్లు చేసే కమెడియనే లేకుండా పోయాడు…
చివరగా చెప్పుకోవాల్సిన అంశం ఒకటుంది… తెలుగులో వినోద చానెళ్లు నాలుగు… మాటీవీ, జీటీవీ, ఈటీవీ, జెమిని టీవీ… మంచిగానే పోటీపడేవి… కానీ జెమిని టీవీని యాజమాన్యం వదిలేసింది… ఐరనీ ఏమిటంటే… సన్ టీవీ దేశంలోనే నంబర్ వన్… కానీ అదే గ్రూపులోని జెమిని మాత్రం కనీసం తెలుగులో టాప్ ఫైవ్‌లో కూడా లేకుండా ఎగిరిపోయింది… ఫాఫం… మూడో ప్లేసులో ఉన్న ఈటీవీయే మిణుక్కుమిణుక్కుమంటోంది కాస్త… జెమిని టీవీని దాటేసి జెమిని మూవీస్ నాలుగో ప్లేసులోకి రావడం నవ్వొచ్చే విషాదం… అయిదో ప్లేసులో మామూవీస్ ఉంది… రాబోయే రోజుల్లో ఇక జెమిని టీవీ గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదేమో..!!
Share this Article