‘‘నిర్మాతగా మారాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా… పాప్ కార్న్‌తో మొదలుపెట్టా… సినిమా భలే వచ్చింది, హీరో సాయి రోనక్‌తో నా రెండో సినిమా… థ్రిల్లింగ్ సినిమా అంటే సీన్ ఫార్వర్డ్ చేయకుండా చూసేలా ఉండాలి… మా సినిమా అలాగే ఉంటుంది… అందుకే ఓటీటీకి కూడా ఇంకా ఇవ్వలేదు… ఇకపైనా చిత్రాలు నిర్మిస్తాను… సినిమాను నాగచైతన్య, అఖిల్, నాగార్జున మెచ్చుకున్నారు…’’ అని చెబుతూ పోయింది నటి అవికా గోర్…
ఫాఫం… ఏదో చెబుతోంది గానీ అసలు ఎందుకు ఈ సినిమాలో డబ్బు పెట్టుబడి పెట్టిందో అర్థం కాదు… హిట్టయితే నాలుగు డబ్బులొస్తాయి… లేదా చాలా చిన్న బడ్టెట్టే కాబట్టి థియేటర్, శాటిలైట్, ఓటీటీ డబ్బుతో గట్టెక్కొచ్చు అని లెక్కలేసుకున్నట్టుంది ఆమె… కానీ చేతులు కాలడం ఖాయం… థియేటర్ రిలీజ్‌కన్నా ముందే చిన్న బడ్జెట్ సినిమాల్ని ఓటీటీకి, శాటిలైట్ డిజిటల్ రైట్స్ అమ్ముకోవడం బెటర్… ఫ్లాప్ అనే ముద్రపడ్డాక ఇక రేటూ రాదు, కొన్నిసార్లు కొనేవాడు దొరకడమే కష్టం…
నిజానికి ఎందుకు ఈ సినిమా చూడాలి అనే ప్రశ్నకు జవాబు చాలా కష్టం… హీరో హీరోయిన్‌ను కొట్టడానికి చూస్తుంటాడు… అనుకోకుండా ఒక లిఫ్టులో ఇరుక్కుపోతారు రెండు గంటలు… సినిమాలో దాదాపు 90 శాతం లిఫ్టులోనే… ఒకే చోట ఒక జంటను చూడాల్సి రావడం ప్రేక్షకుడికి చాలా కష్టం… పైగా దాన్ని మెప్పించాలంటే పకడ్బందీగా చిత్రీకరించాలి… మొహాల్లో బాగా ఎమోషన్స్ పలికించగల నటులు కావాలి… వీటిల్లో ఏదీ లేదు… అవిక, సాయి జంటకు అంత సీన్ లేదు… అవిక ఓవర్‌గా ఎమోషన్స్ పలికించే అతితనం… సాయి అందంగా ఉన్నాడు తప్ప ఉద్వేగాలు ఏమీ పలికించలేని నాస్తితనం… డైలాగ్ డెలివరీలో గానీ, బాడీ లాంగ్వేజీలో గానీ…
Ads
పైగా దర్శకుడు గంధం మురళి ఏదో అలా అలా షూటింగ్ చేసేసి, వదిలాడు తప్ప… ఎక్కడా ఒక్క పెద్ద క్రియేటివ్ సీన్ కూడా కనిపించదు… అరె, భలే తీశారురా ఇది అనిపించుకునే ఒక్క ఎపిసోడ్ కూడా లేదు… పద్ధతిగా కనిపించే అవిక కూడా బరువు తగ్గి, కాస్త హాట్‌గా దర్శనమిచ్చినా సరే, అదేమీ ఉపయోగపడలేదు… అవునూ, సినిమాలో ఆమె పాత్ర పేరు సమీరణ… అంటే ఏమిటో..?!
పాప్ కార్న్ మక్కలు సరిగ్గా పేలాలి, వేడికి పువ్వులా విచ్చుకోవాలి… అప్పుడే అది తినబుల్… వేడి చేసినా సరిగ్గా విచ్చుకోకపోతే మక్కలుగా తినలేం, పాప్ కార్న్‌గా తినలేం… ఈ పాప్ కార్న్ తరీఖ అదే… సినిమాలో పలు సీన్స్ కనీసం తెలుగు టీవీ సీరియల్స్ తరహాలో కూడా లేవు… అంత నాసిరకం… ఆ పాటలు ఎందుకొచ్చి పోతున్నాయో తెలియదు… బీజీఎం వీక్… సినిమాటోగ్రాఫర్ ఒక్కడే ఈ సినిమాకు సంబంధించి కష్టపడిన వ్యక్తి… అంతే… ఇంకేమీ లేదు చెప్పడానికి…!! అవునూ, లోగోలో ఆర్ అక్షరాన్ని మాత్రం ఎర్రగా, జూమ్ చేసి చూపించడం వెనుక మర్మేమిటి సార్..?!
Share this Article