Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీడియా జీవితాలను, కుటుంబాలను నిలబెట్టగలదు… ఇవి అవే స్టోరీస్…

November 28, 2025 by M S R

.

Bhavanarayana Thota  ……  2004 లోకి వెళ్దాం ఓసారి… అన్నీ కాకపోయినా, కొన్ని సమస్యలు మీడియా వల్ల పరిష్కారమవుతుంటాయి. ముఖ్యంగా విద్య, వైద్యం విషయాల్లో సాయం అవసరమైనప్పుడు వార్త ప్రసారమైతే స్పందించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు.

అయితే, అలా స్పందించి సాయం చేశాక ఆ ప్రయోజనం పొందిన వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించే తీరిక మీడియాకు ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త సంగతుల మీదనే దృష్టి. ఫాలో అప్ కథనాలు అవసరమని మీడియా పాఠాల్లో చెప్పినా పట్టించుకోవటం తక్కువే. ఏమైనా నాకు తటస్థపడిన రెండు సందర్భాల గురించి మాత్రం ఇప్పుడు చెబుదామనుకుంటున్నా.

Ads

*****
కరీంనగర్ జిల్లా, వేములవాడ దగ్గర జయవరం అనే పల్లెటూరు. అక్కడ ముప్పయ్యేళ్ల యువ రైతు రాములు అరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఆ జబ్బుతోనే భార్య సాయంతో ఆఖరి నిమిషం దాకా వ్యవసాయం చేయాలనే పట్టుదలతో శ్రమిస్తున్నాడు.

రాష్ట్రమంతా రైతుల ఆత్మహత్యల వార్తలతో అట్టుడుకుతున్న సమయమది. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదంటూ రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు తేజా టీవీ పదిరోజులపాటు ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది.

అది చూసి ఆత్మహత్య ఆలోచన మానుకుని మొండిగా వ్యవసాయం చేస్తున్నాడేగాని వళ్ళంతా నీరుపట్టి కదలటానికే ఇబ్బందిపడే పరిస్థితి ఆయనది. ఈ విషయం తెలుసుకున్న మా రిపోర్టర్ శ్రీనివాసరెడ్డి అతని దుస్థితిని కళ్ళకు కడుతూ వార్త పంపారు. తేజా టీవీలో ప్రసారం చేశాం.

అలా ఆ వార్త ప్రసారమైన కొద్ది గంటలకే పోసాని కృష్ణమురళి గారి నుంచి ఫోన్. తనను తాను పరిచయం చేసుకున్నారు. “బ్రదర్, మీ టీవీలో చూపించిన ఆ రైతును వెంటనే హైదరాబాద్ పిలిపించండి. ట్రీట్‍మెంట్ ఇప్పిద్దాం” అన్నారు నేరుగా.

ఆ తరువాత కాసేపటికే నటుడి ఏవీఎస్ తో కలిసి ఆఫీసుకు వచ్చారు. అప్పట్లో బంజారా హిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ప్రసిద్ధ కార్డియాలజిస్ట్ గోపీచంద్ (ఇప్పుడు స్టార్ ఆస్పత్రి నిర్వాహకుడు) గారితో మాట్లాడి, మరుసటి రోజే పేషెంట్ ని రప్పించమని చెప్పారు. అదే మాట మా రిపోర్టర్ కి చెప్పా.

రాములు, అతని భార్య, ఇద్దరు కూతుళ్ళు, బావమరిది నర్సింగ రావు మా రిపోర్టర్ వెంట నేరుగా కేర్ ఆస్పత్రికి వచ్చారు. పోసాని గారితోపాటు నటుడు ఏవీఎస్ గారు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ గోపీచంద్ గారికి పేషెంట్ ను చూపించి అన్ని టెస్టులూ చేయించారు. జబ్బు బాగా ముదిరిందని, మరుసటి రోజే సర్జరీకి ఏర్పాటు చేద్దామని గోపీచంద్ చెప్పారు.

మొత్తానికి సర్జరీ జరిగింది. చాలా క్లిష్టమైన సర్జరీ అని కూడా డాక్టర్ గోపీచంద్ చెప్పారు. ఆస్పత్రి ఛార్జీలు మాత్రమే ఇప్పించి తన ఫీజు తీసుకోకుండా ఆయన కూడా తనవంతు ఔదార్యం చూపారు. రాములు పూర్తిగా కోలుకునే వరకూ ఎప్పటికప్పుడు అతడి ఆరోగ్యం గురించి తెలుసుకోవటానికి పోసాని గారు కేర్ కి వచ్చేవారు.

అలా పదిరోజుల్లో రాములు మామూలు మనిషయ్యాక భార్యాపిల్లలతో సహా అందరికీ కొత్త బట్టలు కొనిచ్చి, దారిఖర్చులు కూడా ఇచ్చి మరీ సాగనంపారు పోసాని. ఖర్చు మొత్తం రెండు లక్షల దాకా అయింది. ఈ వార్త ప్రసారం చేయటానికి పోసాని ఒప్పుకోలేదు. స్ఫూర్తిమంతంగా ఉంటుందని, ఇంకొంతమంది ఇలాంటి సందర్భాలలో ముందుకొచ్చి సాయం చేస్తారని చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. ఆయన కోరిక మన్నించక తప్పలేదు నాకు.

ఇది జరిగి ఆరునెలలు గడిచాయనుకుంటా. నేను వేములవాడ వెళితే, ఆ విషయం తెలిసి వాళ్ళ బావమరిది నర్సింగరావు వచ్చి వాళ్ళింటికి తీసుకెళ్ళారు. రాముల్ని చూస్తే అసలు జబ్బున పడ్డ మనిషనిపించలేదు. హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. నేను చేసిందేమీ లేకపోయినా అందరూ నా వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ ఉంటే నాకే ఇబ్బందిగా అనిపించి దిక్కులు చూడటం మొదలెట్టా.

 

  • ఆ చిన్న ఇంట్లో నా దృష్టి నుంచి తప్పించుకోలేకపోయింది…. దేవుళ్ళ బొమ్మల సరసన ఉన్న పోసాని ఫొటో…. అవును మరి. ఆయన నిలబెట్టింది ఒక ప్రాణాన్నే కాదు.. ఒక కుటుంబాన్ని. రాములు కుటుంబానికి నిజంగానే దేవుడాయన.

*****



2004 లోనే జరిగిన మరో సంఘటన కూడా గుర్తుకొస్తోందిప్పుడు. అప్పటి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, బీచుపల్లిలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న ఒక విద్యార్థికి మెడిసిన్ లో సీట్ వచ్చినా, చదువుకు అవసరమైన డబ్బు లేక ఇంటిదగ్గరే ఉండిపోయాడని అప్పటి జెమినీ టీవీ రిపోర్టర్ వెంకటేష్ ఒక వార్త పంపారు.

ఆ విద్యార్థి పేరు చంద్రశేఖర్ ఆజాద్. వాళ్ళ నాన్న కృష్ణమూర్తి ఇటిక్యాల మండలం, ఎర్రవల్లి చౌరస్తా దగ్గర చెరుకు రసం బండి నడుపుతారు. ఆ రోజుల్లో ఎంట్రన్స్ లో పాసైన వాళ్ళకే రెసిడెన్షియల్ స్కూల్ లో అడ్మిషన్ దొరికేది. అలాంటి చోట సీట్ సంపాదించుకొని మెరిట్ స్టూడెంట్ గా ఎదిగిన ఆజాద్ కు ఇంటర్ లో ఒక కార్పొరేట్ కాలేజ్ ఉచితంగా సీటిచ్చింది.

ఆ తరువాత మెడికల్ ఎంట్రన్స్ లో మంచి రాంకు వచ్చింది. అందుకే రాంకర్ల మొదటి ఛాయిస్ అయిన ఉస్మానియాలో సీటు రెడీగా ఉంది. కానీ ఆ మాత్రం ఫీజు కూడా కట్టలేని పరిస్థితి ఆ కుటుంబానిది. తండ్రితోబాటు ఆదే సోడా కొట్టులో పనిచేయటం మినహా చేయగలిగేదేమీ లేదని ఆ రోజు ఆజాద్ చెప్పిన మాటలు తేజా టీవీ వార్తాకథనంలో ప్రసారమయ్యాయి.

ఆ వార్త ప్రసారమైన కొద్ది గంటలకే నాకొక మెయిల్ వచ్చింది. నిమ్మగడ్డ ఫౌండేషన్ ఆ విద్యార్థి చదువు ఖర్చు భరించటానికి సిద్ధంగా ఉన్నట్టు నిమ్మగడ్డ ప్రసాద్ పేరుతో ఉంది ఆ మెయిల్. పన్నెండేళ్ళు మద్రాసులో ఉండి, అప్పటికి కొద్ది నెలలకిందటే హైదరాబాద్ వచ్చిన నాకు ఆయనే మాట్రిక్స్ ప్రసాద్ గారని కూడా తెలియదు.

ఆయన స్పందనకు కృతజ్ఞతలు చెబుతూ, ఆ విద్యార్థి పూర్తి వివరాలు, అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ కూడా మా రిపోర్టర్ ను అడిగి తెలియజేశా. పనిలో పనిగా మా రిపోర్టర్ వెంకటేష్ నెంబర్ కూడా ఇచ్చా. కానీ మరుసటి రోజు ఉదయమే డైరెక్టర్ బి. గోపాల్ మా జెమినీ డైరెక్టర్ కిరణ్ గారితో ఉన్న పరిచయం కారణంగా మరింత వేగంగా స్పందించి, ఆ ఊరికి వెళ్ళి చంద్రశేఖర ఆజాద్ ను ఉస్మానియా మెడికల్ కాలేజ్ కి తీసుకెళ్ళి చేర్పించారు.

  • ఇదే విషయం నిమ్మగడ్డ ప్రసాద్ గారికి మెయిల్ చేసి చెప్పా. నెల్లూరు జిల్లా వాసి అయిన బి. గోపాల్ తీసుకున్న చొరవ ఫలితంగా ఒక చురుకైన విద్యార్థి మెడిసిన్ లో అద్భుతంగా రాణించారు. ఎంఎస్ జనరల్ సర్జరీలోనూ, ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీలోనూ గోల్డ్ మెడల్ సాధించారు ఆజాద్. ఇప్పుడాయన హైదరాబాద్ ఎంఎన్జె కాన్సర్ ఇన్ స్టిట్యూట్ లో ప్రొఫెసర్.

*****



ఒక మిత్రుడి ద్వారా నెంబర్ సంపాదించి ఫోన్ చేసి, నన్ను నేను పరిచయం చేసుకోగానే చాలా ఉద్విగ్నతకు, ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇద్దరం రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్ కావటం కూడా మా పరిచయాన్ని మరింత బలోపేతం చేసి చాలాసేపు మాట్లాడుకునేట్టు చేసింది.

ఆరోజు వార్త ప్రసారం కావటం తన జీవితంలో మరువలేనిదన్నారు. పదే పదే థాంక్స్ చెప్పటం ఆయన మంచితనానికి గుర్తు. తన మూలాలు మరచిపోకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్టు చెప్పారు. సాధారణంగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ప్రైవేటు హాస్పిటల్స్ లో పనిచేయటానికే ఎక్కువ మొగ్గు చూపుతారు గాని చంద్రశేఖర్ అజాద్ మాత్రం ప్రభుత్వ ఆస్పత్రికి ప్రాధాన్యం ఇవ్వటం ఆయన ఆలోచనాధోరణికి అద్దం పట్టింది.

అనుభవం పెరగటంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కన్సల్టెంట్ గా కొన్ని గంటలు సేవలందిస్తున్నారు. తాను ఎదుర్కున్న పరిస్థితులు తెలుసు కాబట్టి సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక పేద విద్యార్థినికి మొత్తం ఎంబీబీఎస్ చదువుకు, మరో పేద విద్యార్థికి బీటెక్ చదువుకు పూర్తి స్థాయిలో స్పాన్సర్ చేస్తున్న సంగతి మాటల సందర్భంలో చెప్పారు. ఆయన భార్య కూడా ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్. బి. గోపాల్ గారితో ఇప్పటికీ టచ్ లోనే ఉన్నానని కూడా చెప్పారు డాక్టర్ ఆజాద్.

*****
ఈ రెండూ 2004 లో తేజా టీవీలో వేసిన వార్తల ఫలితమే. ఇలాంటివి చాలా ఉంటాయి గాని ఫాలో అప్ చేయటం వల్ల తెలుస్తాయి. ఒక వార్త వల్ల ఎంత మేలు జరిగే అవకాశముందో చెప్పటానికి ఈ రెండు ఘటనలూ ఉదాహరణలు మాత్రమే. జర్నలిస్టులకు కాస్త కిక్కిచ్చేది ఇలాంటి సందర్భాలే. – తోట భావనారాయణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీడియా జీవితాలను, కుటుంబాలను నిలబెట్టగలదు… ఇవి అవే స్టోరీస్…
  • సర్‌ప్రయిజ్ అప్పియరెన్స్..! ఈ తెలంగాణ ‘బతుకమ్మ’ గుర్తుందా మీకు..?!
  • యాక్షన్ లేదు, ఆధార్ బ్లాకూ లేదు… ఈ వివాదం పూర్వపరాలు ఇవీ…
  • మిస్టర్ కీరవాణీ… ఈ వారణాసి లవ్ సాంగ్ వీడియో నువ్వైనా చూశావా..?
  • బాగా మగ్గిన అరటి పండు కేన్సర్‌ కణాల్ని చంపేస్తుందా..? నిజమేంటి..?
  • ఈ తెలంగాణ ద్వేషి అస్సలు మారడు… మళ్లీ అదే విద్వేష ప్రదర్శన..!!
  • బిగ్‌బాస్..! బహుశా ఫైనల్స్‌లో తనూజ, ఇమ్మూ, పడాల, భరణి, రీతూ..!!
  • వ్యక్తిపూజ- ఫ్యానిజం… ఆంధ్రా కింగ్ తాలూకా… కాదు, ఓ హీరో ఫ్యాన్ తాలూకా…
  • హనుమాన్ చాలీసా టాప్ రికార్డు… ఇవీ ఇండియాలో టాప్ 10 వీడియోలు..!
  • బురద… బూడిద..! ఆలు లేదు, చూలు లేదు… అప్పుడే వేల కోట్ల స్కాములట..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions