.
పొట్టేల్… నిజానికి ఈ సినిమాకు కాస్తోకూస్తో హైప్ దొరికింది ఓ లేడీ రిపోర్టర్ అత్యంతాతి తెలివిగా అడిగిన కాస్టింగ్ కౌచ్ ప్రశ్నతో… దానికి అనన్య నాగళ్ల పరిణతిలో, బ్యాలెన్స్‌డ్‌గా ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో, మీడియాలో హైలైట్ అయ్యింది… బాగా వార్తల్లో నలిగింది సినిమా… అది స్క్రిప్టెడ్, ప్లాన్‌డ్ ప్రశ్నో కాదో తెలియదు గానీ అది సినిమా ప్రమోషన్‌కు మాత్రం బాగానే ఉపయోగపడింది…
ప్రమోషన్ వర్క్ కూడా బాగానే చేసుకున్నారు… జనంలోకి ఈ సినిమా గురించి… మీరు చూస్తూ ఉండండి, నన్ను ఇకపై ఈ సినిమాలో పాత్ర బుజ్జమ్మ పేరుతోనే పిలుస్తారు అంటూ అనన్య కూడా బాగానే హైప్ ఇచ్చింది… సరే, ప్రధాన కథానాయిక కదా, తప్పలేదేమో…
Ads
తీరా సినిమా చూస్తే… అంత సీన్ లేదనిపించింది… వోకే, అనన్య పాత్ర వరకూ కాస్త ఇంపార్టెన్స్ ఉంది, బాగానే చేసింది… కానీ అదేమీ గుర్తుంచుకోదగిన గొప్ప పాత్రేమీ కాదు… కాకపోతే సినిమా ఆరంభంలోనే కాస్త ఆసక్తి ఏర్పడుతుంది కథపై… ఎప్పటిదో ఎయిటీస్ కథ… పటేల్ పట్వారీ సిస్టమ్ తెలంగాణ ఊళ్లల్లో ఓ అరాచక వ్యవస్థగా ఉన్న రోజులవి…
మూఢ నమ్మకాలు, దోపిడీ, పెత్తనం, దౌర్జన్యం, వివక్ష అన్నీ ఉన్న ఊరిలో… ఆడపిల్లల చదువు ఇంపార్టెన్స్ తెలియజేస్తూ రాసుకున్న కథ వరకూ వోకే… సినిమా తీసిన విధానమూ వోకే… కాకపోతే గ్రిప్పింగ్ ప్రజెంటేషన్ లేదు… చూస్తుంటే బోర్ అనిపిస్తుంది… ఓసోస్, ఈ మాత్రం సినిమాకేనా ఇంత హైప్ అనిపించేలా ఉంది…
ఈ సినిమాకు సంబంధించి చెప్పుకోదగింది అజయ్ నటన… విలనీ బాగా చేశాడు… ఒక ప్రశ్నకు జవాబు దొరకదు మనకు… ఇలాంటి నటులు మనకు ఉండగా మురళీశర్మ వంటి వాళ్లు పెట్టే షరతులన్నీ ఒప్పుకుని, అధికంగా రెమ్యునరేషన్ ఇచ్చి, తన టీమ్‌ను మేపుతూ రాజీపడటంకన్నా మన నటుల్ని మనం వాడుకోలేకపోతున్నామా..?
అజయ్ విషయానికే వస్తే… యాటిట్యూడ్ ప్రాబ్లమా..? మరి మన నిర్మాతలకు ఎందుకు కనిపించడం లేదు తనకు..? తెలుగమ్మాయి అనన్యను తీసుకున్నట్టే వీళ్లు అజయ్‌నూ తీసుకున్నారు… ఆయా పాత్రలకు సరైన న్యాయం చేశారు వాళ్లు… నటీనటుల పరంగా ఈ సినిమాకూ ఏ అన్యాయమూ జరగలేదు… జరిగింది కథనం సరిగ్గా లేకపోవడం… పాపం, దానికి నటీనటులు ఏం చేయగలరు..? అక్కడక్కడా లాజిక్ రాహిత్యాలు కూడా పంటికింద రాళ్లుగా ఇబ్బంది పెడతాయి…
మూఢనమ్మకాల మీద విమర్శనాత్మక సినిమాలు బాగానే ఉంటాయి… సొసైటీకి అవసరమే… కానీ అవి సరైన పంచ్‌తో చిత్రీకరించబడాలి… అదే జరగలేదు… ఐతే రొటీన్ మూస సూపర్ హీరోయిక్ చెత్తా సినిమాలకన్నా ఈ సినిమా మేలు… చూడటానికి సందేహించనక్కర్లేదు… అయితే అది థియేటర్‌లోనా..? ఓటీటీలోనా అనేది ప్రేక్షకుడి ఇష్టం… పర్సులో జేబులుండి, బోలెడంత టైముంటే థియేటర్… లేదంటే జస్ట్ వెయిట్ ఫర్ ఓటీటీ రిలీజ్… త్వరగానే వస్తుంది..!
Share this Article