Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మళ్లీ మళ్లీ స్మరించుకునే ఆత్మత్యాగం… తెలుగువారి విముక్తి ప్రదాత…

November 1, 2024 by M S R

చాలా మంది సోషల్ మీడియా వాల్స్ మీద కనిపిస్తున్న సమాచారమే ఇది… ఒరిజినల్ రచయిత ఎవరో తెలియదు… (ఆ రచయితకు ధన్యవాదాలు…) ఇప్పటి తరానికి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం ఏమిటో తెలియాలి… తెలియాల్సిన అవసరం ఉందనిపిస్తోంది… ఒక ఆశయం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టడం అంటే ఏమిటో, రాజకీయాలు ఎలా ఉంటాయో కూడా తెలియాలి… అందుకే ఈ పోస్టును యథాతథంగా పంచుకోవడం…

potti sriramulu
***

పొట్టి శ్రీరాములు గారు చనిపోయేటప్పటికి నాకు ఐదు సంవత్సరాల వయస్సు. మా ఇంటి ముందు గోడమీద బొగ్గు తో “పొట్టి శ్రీరాములును పొట్టన పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలి” అని రాసేరు. ఆంధ్ర రాష్ట్రం వచ్చేవరకు అది ఎవ్వరూ చెరపలేదు… మనకు వీపు ఉందని మన వెనకవాడు చెపితేనే మనకు తెలిసేది.. ఇది పచ్చి నిజం… దీనికి ఉదాహరణ… ఇది..!

అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ శూరులు మాత్రమేనని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరాయి. మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీలు అనే పిలిచేవారు . స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు. మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

Ads

రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని మళ్ళీ హేళన చేసింది. దిగమింగుకోలేని ఈ అవమానానికి పొట్టి శ్రీరాములు గారు స్పందించారు. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు. ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్ళారా, వారి అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు.

యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని, తాను అణిచివేస్తానని రాజాజీ నెహ్రూ కు నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత…!!

ఈ సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగు నాయకులంతా ముఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ కలగలేదు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు పొట్టిశ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు.

పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపు తప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగులు నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా నోటినుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవడానికి 58 రోజులుపట్టింది.

ఎంత దారుణ మరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు. ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు.

చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళనైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని, ఆశయాన్ని చంపుకుని వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి, మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు.

శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పివచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు. ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు. వాంతులు చేసుకున్నారు.

తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని , చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులు బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడుతూ శవయాత్ర ప్రారంభించారు.

గుండెల్ని పిండే ఘంటసాల మాటలు, పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో కాలేజి కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండి వెంట అరుస్తూ యాత్రలో చేరారు. అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరికి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణశవ పరిస్థితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది.

బూతుపురాణంతో తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడక….రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి, ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధాపోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది.

సాధుసుబ్రహ్మణ్యంగారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు. ఆ త్యాగజీవి కీ. శే పొట్టి శ్రీరాములు గారి ఆ ప్రాణత్యాగం ఫలితంగా మద్రాసు నుంచి ఆంధ్రా ప్రజలకు విముక్తి కలిగింది..!! (మద్రాసు నుంచి విడిబడిన రోజు అక్టోబరు ఒకటి…) (ఏదో పిచ్చి సైటులో ఆయన వర్ధంతి వేడుకలు అనే హెడ్డింగ్ చదివితే నవ్వూ ఏడుపు ఒక్కసారిగా చుట్టు ముట్టి…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions