Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డాళింగ్ పాన్ ఇండియా ప్రభాస్‌కు అభిమానంతో రాయునది ఏమనగా…

March 13, 2022 by M S R

….. By ……… Sridhar Bollepalli…….    డాళింగ్ ప్ర‌భాస్‌.. వివాదాల‌కి దూరంగా వుండే మంచి మ‌నిషి. అత‌ని గురించి ఎవ‌రూ నెగ‌టివ్‌గా మాట్లాడుకోవ‌డం మ‌నం విని వుండం. నిజానికి రాధేశ్యామ్ లాంటి డిజాస్ట‌ర్ యింకో హీరోకి వ‌చ్చివుంటే ట్రోలింగ్ నెక్స్ట్ లెవెల్లో వుండివుండేది. కానీ, ప్ర‌భాస్ మీద వున్న పాజిటివ్ యింప్రెష‌న్ వ‌ల్ల.. రాధేశ్యామ్ బాగోలేద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌డానికి చాలా సున్నిత‌మైన ప‌దాలు ఎంచుకుంటున్నారు జ‌నాలు. ఈ కోణంలో ప్ర‌భాస్ అదృష్ట‌వంతుడు.

కృష్ణంరాజుకి కొడుకు వ‌ర‌స‌వ్వ‌డం అన్న‌ది ఒక లాంచింగ్ ప్యాడ్‌గా బాగానే అక్క‌ర‌కొచ్చిందిలే కానీ, ఆ త‌ర్వాత పెద్దాయ‌న ప్ర‌భాస్‌కి భారంగా మారిపోయాడు. ఎన్టీయార్‌, ఏయ‌న్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు లాంటి ముందు త‌రం హీరోల‌కి వున్నంత సాలిడ్ ఫ్యాన్ బేస్ కృష్ణంరాజుకి ఎప్పుడూ లేదు. ఇక మ‌న ఫేస్ సినిమాల‌కి ప‌నికిరాదు అనే వాస్త‌వాన్ని ఆయ‌న అంగీక‌రించ‌లేక‌పోతున్నాడో లేక ప్ర‌భాసే మొహ‌మాట‌ప‌డుతున్నాడో కానీ.. కృష్ణంరాజుని తెర‌మీద చూడ‌డం ప‌నిష్మెంటుగా మారిపోతోంది. ప‌రుగు ఆప‌డం ఒక క‌ళ అనే పుస్త‌కం చ‌ద‌వాలి రాజుగారు.

2002 లో వ‌చ్చిన ఈశ్వ‌ర్ తో మొద‌లెట్టి 2022 లో రిలీజైన రాధేశ్యామ్ వ‌ర‌కూ ప్ర‌భాస్ చేసింది కేవ‌లం 20 సినిమాలు. అందులో ఈశ్వ‌ర్‌, వ‌ర్షం, ఛ‌త్ర‌ప‌తి, బుజ్జిగాడు, డాళింగ్, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబ‌లి – 1, బాహుబ‌లి – 2 మాత్ర‌మే చెప్పుకోద‌గ్గ సినిమాలు. బిల్లా కూడా సోది సినిమానే. 50% క‌న్నా త‌క్కువ స‌క్సెస్ రేట్‌తో కూడా ప్ర‌భాస్‌కి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే క‌ళ్లు బైర్లు క‌మ్ముతాయి. మ‌హేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి ఒక‌రిద్ద‌రికి మాత్ర‌మే ఇలాంటి అభిమాన‌గ‌ణం వున్నారు. దీన్ని కాపాడుకోవ‌డం ప్ర‌భాస్‌కి ముందుముందు క‌ష్టం కావొచ్చు.

Ads

సీన్ ఎంత చెత్త‌దైనా త‌న ప‌ర్స‌న‌ల్ ఛామ్‌తో, స్ట‌యిల్ తో యింప్రొవైజ్ చేయ‌గ‌లిగి వుండాలి పెద్ద హీరోలు. ఈ ప‌ని రామ్‌, ర‌వితేజ‌, అల్లు అర్జున్ చేయ‌గ‌ల‌రు. ఎంట‌ర్‌టెయిన్ చేయ‌డానికి సీన్లో స్పేస్ లేక‌పోయినా క్రియేట్ చేసుకోగ‌ల‌ర‌న్న‌మాట‌. రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీయార్ కూడా ఈ విష‌యంలో వీకే. ఇర‌గ‌దీయ‌డానికి స్కోప్ వున్న సంద‌ర్భాల్లో చెల‌రేగిపోతారు, సందేహ‌మే లేదు. కానీ రాసిన‌వాడు, తీసిన‌వాడు నీర‌సాన్ని, నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శించిన సంద‌ర్భాల్లో ఈ హీరోలు కూడా తేలిపోతారు. ద‌ర్శ‌కుడు కాస్త బుర్ర వాడిన సంద‌ర్భాల్లో ప్ర‌భాస్ ఎంత బాగా న‌చ్చుతాడో, మిగిలిన‌చోట్ల అంత చికాకు పెడ‌తాడు. ఆఫ్ ద స్క్రీన్‌, బీయింగ్ ఎ గుడ్ హోస్ట్ అన్న‌ది సినిమాల‌ని నిల‌బెట్ట‌లేదు.

ఎంత మంచి డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు, ర‌చ‌యిత‌లైనా త‌ప్పులు చేస్తారు. రాజ‌మౌళి, కొర‌టాల శివ త‌ప్ప దాదాపు అంద‌రూ ఫెయిల్యూర్స్ చూసిన‌వాళ్లే. ఎవ‌రి జ‌డ్జిమెంటూ 100% క‌రెక్ట్ అవుద్ద‌ని చెప్ప‌లేం. కానీ, కాస్త‌లో కాస్త క‌థ‌నీ, సినిమా ఫ‌లితాన్నీ అంచ‌నా వేయ‌గ‌లిగే ఒక టీమ్ అవ‌స‌రం వుంది ప్ర‌భాస్‌కి. రెండు మూడు కోట్ల సినిమాలు కావుగా త‌న‌వి. రెండు మూడొంద‌ల కోట్లు అనేది మినిమ‌మ్ బ‌డ్జెట్‌గా పెట్టుకున్న ఒక పాన్ ఇండియా మాచో మ్యాన్ పిచ్చి డెసిష‌న్స్ తీస్కుంటే చాలా జీవితాలు గ‌ల్లంతైపోతాయి.

ప్ర‌భాస్ మంచోడు. స్నేహ‌శీలి, వివాద‌ర‌హితుడు, అజాత‌శ‌త్రువు. కానీ, అదృష్టం వెతుక్కుంటూ వ‌చ్చి ఏ బుజ్జిగాడు రూపంలోనో, బాహుబ‌లి రూపంలోనో త‌లుపు త‌డితే త‌ప్ప‌.. త‌నంత‌ట తానుగా హిట్ సినిమా మెటీరియ‌ల్‌ని వెతికి ప‌ట్టుకోగ‌లిగే నైపుణ్యం వున్న‌వాడు కాదు. ఆ విష‌యం అర్థం చేస్కోని, ఎవ‌రి స‌హాయం తీసుకుంటే అవే త‌ప్పులు మ‌ళ్లీ మ‌ళ్లీ చేయ‌కుండా వుంటాడో ఆలోచించుకోవాలి.

ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే, ప్ర‌భాస్ మొహం రానురానూ చాలా ముదురుగా మారిపోతోంది. హాలీవుడ్ సూప‌ర్ హీరో సినిమాల్లో వుండే థార్ లాగా, హ‌ల్క్ లాగా క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం వున్న మేక‌ప్ అస్స‌లు సెట్ అవ్వ‌డం లేదు త‌న‌కి. ఇలా కాకుండా వేరేలా క‌నిపించ‌డం సాధ్యం కాని ప‌క్షంలో.. ఎలా క‌నిపిస్తున్నాడో దానికి త‌గ్గ పాత్ర‌లే ఎంచుకోవాలి. ప్ర‌భాస్ నుండీ ఇదే చివ‌రి కంప్లీట్ ల‌వ్ స్టోరీ అని ఆశిద్దాం.

ప్ర‌భాస్ డాళింగ్‌.. కాస్త జాగ్ర‌త్త‌గా వుండు. త‌లుపుకొట్టిన ప్ర‌తివాడూ రాజ‌మౌళి కావాల‌ని రూలేం లేదు. కొంత‌మంది రాంబాబులూ, ర‌వికుమార్లూ, రాధాకృష్ణ‌లూ కూడా అయ్యుండొచ్చు. తొంద‌ర‌ప‌డ‌మాక‌. నిజం చెప్పాలంటే సాలార్‌, ఆదిపురుష్ సినిమాలు త‌ల్చుకున్నా వ‌ణుకు పుడ‌తంది నాకు. ప‌ర్లేదంటావా?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions