ప్రదీప్ నటనకు సంబంధించి చాలామందికి ముందే ఒక అంచనా ఉంది… కానీ శుభం పలకరా అంటే ఇంకేదో అన్నట్టుగా అమంగళం వద్దు అని ఎవరూ ఎక్స్‌ప్రెస్ చేయలేదు… చేయకూడదు కూడా… కాకపోతే ఎప్పుడో ఓసారి తప్పదుకదా… సినిమా విడుదల కాగానే, అసలు రంగు బయటపడక తప్పదు కదా… దాంతో ఆ బుడగ పేలిపోయింది… 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాకు ప్రదీప్ ప్లస్ కాదు, తనే పెద్ద మైనస్ అని తేలిపోయింది… ఇక్కడ రెండు మూడు విషయాలు… ప్రదీప్ యాంకర్‌గా ఉన్న ఏ షో చూసినా సరే మనకు కనిపించేది టైమ్లీ పంచులు, కాస్త కామెడీ టచ్… కమెడియన్‌కు తక్కువ, యాంకర్‌కు కాస్త ఎక్కువ… అలాంటోళ్లు హీరో కావద్దని ఏమీ లేదు, కానీ ఓ కొత్త మొహం హీరోగా తెర మీదకు రావడంకన్నా ప్రదీప్ వంటి కేరక్టర్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది… ఎందుకంటే..?
వాళ్ల మీద ఆల్రెడీ ఒక ముద్ర ఉంటుంది, ప్రేక్షకుడు వాళ్లను చూసే విధానం వేరు… అవి దాటేసి పర్ఫామ్ చేయగలగాలి… అప్పుడే వాళ్లు తమ మీద ఉన్న ముద్రల్ని బ్రేక్ చేయగలరు…. అదే కష్టం… ప్రదీప్ వంటి వాళ్లకు మరీ కష్టం ఎందుకంటే… ప్రదీప్ మొహంలో కరుణ, భయం, కోపం వంటి ఫీల్స్ అస్సలు పలకవు… కామెడీ అని మొహం మీద పడ్డ ముద్ర నుంచి బయటపడటం ఎంత కష్టమో ఒక హీరో సునీల్ వంటి ఆర్టిస్టులను అడిగితే తెలుస్తుంది… చివరకు మళ్లీ కేరక్టర్ ఆర్టిస్టుగా మారాల్సి వచ్చింది… అంతెందుకు..? అల్లరి నరేష్‌కు కరుణాత్మక సీన్లు ఉంటేనే ప్రేక్షకుడు పడీపడీ నవ్వుతాడు, నరేష్ అవస్థలు గమనిస్తూ..! ఇదే ప్రదీప్ ఫ్రెండ్ సుధీర్ ఉన్నాడు… బుల్లితెర మీద హీరో తను… డాన్సులు, యాక్షన్, కామెడీ ఏదయినా సరే కుమ్మేయగలడు… ఐతేనేం, వెండితెర మీదకు హీరోగా రాగానే తేలిపోయాడు… ఎస్, బుల్లితెరకూ వెండితెరకూ తేడా ఉంటుంది, సగటు హీరోకూ, కామెడీ నుంచి కన్వర్ట్ అయ్యే హీరోకూ తేడా ఉంటుంది…
Ads
త్రీమంకీస్, సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాలు చూసినప్పుడు ప్రేక్షకులు చేసుకున్న వాంతులతో ఇప్పటికీ ఆ థియేటర్ల కంపు వదల్లేదు… ఇక్కడ నటుల తప్పు లేకపోవచ్చు, దర్శకుల తలతిక్క పైత్యమే, కథారాహిత్యం, కథనదోషం గట్రా చాలా కారణాలుండొచ్చుగాక… కానీ ప్రధానంగా తెలుగు సినిమాను మోసే బాధ్యత హీరోదే… ప్రమోషన్, బిల్డప్, ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటయ్… అందుకే ఏం తేడా వచ్చినా ఇలాగే పేలిపోతయ్… సరే, ఈ సినిమాకు వస్తే… ఇది ప్రదీప్ స్థాయికి బరువైన సబ్జెక్టు… అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నట్టుగా… అసలు తనకు మామూలు నటనే రాదు, పలుచోట్ల యాంకరింగు చేస్తున్నట్టే కనిపిస్తాడు సినిమాలో కూడా… అలాంటిది ఇక సీనియర్ నటులే కష్టపడాల్సిన పాత్ర ఇక తనకు ఎలా సూట్ అవుతుంది..? మూగమనసులు, జానకిరాముడు, ప్రాణం, మగధీర వంటి పునర్జన్మ బాపతు సినిమాలు తెలుగులో బోలెడు వచ్చినయ్… దాన్ని రక్తికట్టించాలంటే మాంచి గ్రిప్‌తో కథను నడిపిస్తూ, కొత్తగా సీన్లు రాసుకుంటేనే సాధ్యం… అది లేదు సినిమాలో… పైగా ఈ సినిమా కథ ప్రాణం తరహాలో సాగుతున్నట్టు అనిపిస్తుంది…
ప్రదీప్కుతోడు ఆ హీరోయిన్ మరో మైనస్… ప్రత్యేకించి ఆమె పలువరుస బాగా ఇబ్బందికరం… ఆమె ఎంపికకు ఎవరు బాధ్యులో గానీ, ప్రదీప్‌ను కూడా ముంచేశారు… మిగతా కమెడియన్లు కొందరున్నారు గానీ అసలు ఓ సగటు జబర్దస్త్ స్కిట్లకన్నా తక్కువ స్థాయిలో ఉన్నయ్… కథలో ఎమోషన్ ఉంది కానీ ప్రజెంటేషన్‌లో అది లోపించింది… ఈ సినిమాలో ఉన్నది ‘నీలి నీలి ఆకాశం’ అనే ఓ మెలోడియస్ పాట ఒక్కటే.. విచిత్రం ఏమిటంటే..? అదీ బయట వింటుంటేనే బాగుంది… తెర మీద చూస్తుంటే చిరాకుగా అనిపించింది… బహుశా హీరోహీరోయిన్లే దీనికీ మైనస్ అయి ఉంటారు… (ఈ సినిమాకన్నా జీతెలుగులో వచ్చే మోస్ట్ సబ్‌స్టాండర్డ్ త్రినయని సీరియల్ చాలా బెటర్ అని ఓ మిత్రుడి వ్యాఖ్య…) మరీ అదేదో సినిమాలో పేరెంట్స్ పిల్లల్ని కొట్టే సీన్ యథాతథంగా దింపేయడం దర్శకుడి ప్రతిభాదరిద్రానికి ఓ ఉదాహరణ… ఇంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు..!! కరోనా కాలంలోనే ott కి అమ్మేసుకుంటే పోయేది… ఇప్పటిదాకా ఆగడం అతి పెద్ద మైనస్… ప్రదీప్ ఇమేజ్ కోసం ఆగి, మిత్తీలు మీదపడి, సినిమా దొబ్బేసి, నిర్మాతకి అన్నిరకాలుగా బొక్క..!!
Share this Article