సమాజానికి మంచి చేయాలంటే మంచి హృదయం ఉండాలి, మంచి సంకల్పం ఉండాలి… సమాజం ఆదరించడం వల్ల వందల కోట్లు సంపాదించినా సరే, సమాజానికి నిజంగా అవసరమున్నప్పుడు పైసా కూడా ఖర్చు చేయని మన ఇండస్ట్రీ బడా బాబులతో పోలిస్తే… చాలామంది చిన్న చిన్న నటులే చాలా చాలా నయం అనిపిస్తుంది… అందరూ సోనూసూద్‌లే కానక్కర్లేదు, అక్షయకుమార్లు, రాఘవ లారెన్స్లే కానక్కర్లేదు… తమ స్థోమతను బట్టి స్పందించడమే అసలైన ఔదార్యం, దాతృత్వం… అందులో హీరోయిన్ ప్రణిత సుభాష్ (@pranithasubhash) పేరు కూడా చెప్పాలి… ఆమధ్య కరోనా లాక్డౌన్ కాలంలో పెద్ద పెద్ద హీరోలు, తమ ఇళ్లల్లో బందీలైపోయి, పెసరట్లు వేస్తూ, బోళ్లు తోముతూ, ఇల్లు తుడుస్తూ భారీ సమాజసేవ చేస్తుంటే… ప్రణిత రోజూ కొన్ని వేల మందికి ఫుడ్ పాకెట్లు సప్లయ్ చేసింది… తన డబ్బుతో లాక్డౌన్ కష్టాల బాధితుల కడుపులు నింపింది… ఇప్పుడు మళ్లీ వార్తల తెర మీదకు వచ్చింది… ఈసారి కూడా ఓ మంచి కాజ్ కోసమే…
బెంగుళూరు, చామరాజుపేటలోని ఓ కన్నడ మీడియం మోడల్ హైస్కూల్ మూతపడింది… ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థుల ఎన్రోల్మెంట్ కూడా ఆగిపోయింది మూడేళ్ల క్రితం… అది అల్లాటప్పా స్కూలేమీ కాదు… 1870లో ఏర్పాటైన స్కూల్ అది… అప్పట్లో కన్నడ ప్రముఖ నటులు, నాయకులు, సెలబ్రిటీలు, క్రికెటర్లు చదువుకున్న స్కూల్… ఒక Heritage జ్ఞాపకంగా కాపాడుకోవాల్సింది పోయి సర్కారు దాన్ని మూసేసి, చేతులు దులుపుకుంది… ప్రణిత ఆల్ రెడీ సమాజ సేవ కోసం ఓ ఫౌండేషన్ స్టార్ట్ చేసింది… అంతకుముందే తన తండ్రి చదివిన ఓ సర్కారీ స్కూల్‌ను (హసన్ జిల్లా) పునరుద్ధరించింది…
Ads
ప్రభుత్వ పాఠశాలల్ని రక్షించుకుందాం అనే ఉద్యమంలో ప్రణిత యాక్టివ్ భాగస్వామి… 2019 ఎన్నికల్లో రాహుల్ ద్రవిడ్‌తో కలిసి వోటింగు పెంచే ప్రచార రాయబారిగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది… తన ఫౌండేషన్ తరఫున రకరకాల యాక్టివిటీస్ చేస్తుంటుంది… నూటాయాభై ఏళ్ల చరిత్ర ఉన్న ఓ సర్కారీ స్కూల్ మూతపడిందనీ, 150వ జన్మదినం జరుపుకోవడం లేదనీ ఓ వార్తను చదివి వెంటనే స్పందించింది ఆమె… దాన్ని ఓపెన్ చేసి, తిరిగి నడిపించడానికి ఏం కావాలో చెబితే తన ఫౌండేషన్ సమకూరుస్తుందని ముందుకొచ్చింది… ఓ ట్వీట్ పెట్టి కర్నాటక సీఎంను ట్యాగ్ చేసింది… ఇతర నటులు కూడా సపోర్ట్ చేశారు… ‘‘నేను నివాసం ఉంటున్న పరిసరాల్లో ఓ చరిత్రాత్మక స్కూల్ మూతపడిందంటే నాకు బాధగా ఉంది, దయచేసి దాన్ని పునరుద్ధరించండి, నా సాయం నేను చేస్తా’’ అనేది ఆమె రిక్వెస్టు… నేషనల్ మీడియా దీన్ని ప్రముఖంగా కవర్ చేసింది…
ప్రణిత గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే….. ఫలానా హీరో దగ్గాడు… ఫలానా హీరోయిన్ తుమ్మింది… ఫలానా వ్యాంప్ ఆర్టిస్టు అన్నీ చూపిస్తోంది… వంటి వార్తల నడుమ……. ఒక హీరోయిన్ ఓ హిస్టారిక్ సర్కారీ స్కూల్‌ను రక్షించడానికి ముందుకొచ్చింది అనే వార్త ఎంత స్పూర్తిదాయకంగా ఉందో కదా..! ఎస్, ఒక సోనూసూద్ ఓ పేదరైతుకు ట్రాక్టర్ కొనివ్వడం, ఒక లారెన్స్ రాఘవ పేదపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించడం, ఒక అక్షయకుమార్ కోట్ల నిధుల్ని కరోనా బాధితుల కోసం ఇచ్చాడు వంటి వార్తలు మనకు పెద్దగా వినిపించవు… కనిపించవు… ఎందుకంటే..? మనవాళ్లు కదలరు కాబట్టి..! ‘‘ఏం, వాళ్లు కష్టపడి సంపాదించుకున్నారు, ఎవరికైనా ఎందుకు సాయం చేయాలి..? చేయకపోతే ఎందుకు తప్పుపట్టాలి..? చేయకపోతే ఏమిటట..?’’ అనే వితండవాదం మాత్రం బాగా కనిపిస్తుంది… జయహో ప్రణిత సుభాష్… #pranitasubhash
Share this Article