.
స్టూవర్టుపురం నుంచి మొదలై… యూనివర్సిటీ వీసీగా ఎదిగారు
(The Journey of a Successful Women)
… గుంటూరు జిల్లా స్టూవర్టుపురం అంటే ఒకప్పుడు దొంగలకు పేరొందింది. దాన్ని చాలాకాలం ‘దొంగల స్టూవర్టుపురం’ అని పిలిచేవారు. సినిమాల్లో ఆ ఊరి పేరు మీద జోకులు వేసేవారు. సామాజికవేత్త లవణం, హేమలత తదితర ప్రముఖల కృషి కారణంగా అక్కడుండే చాలామంది మారిపోయి, చదువుకొని ఉద్యోగాలు పొంది, ఉన్నత స్థానాలకు చేరుకున్నారు.
అలాంటి ఊరి నుంచే వచ్చిన ఓ గిరిజన మహిళ తొలిసారి ఓ యూనివర్సిటీకి వీసీగా మారారు. ఆమే సాతుపాటి ప్రసన్నశ్రీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా నియమించారు. రాష్ట్రంలో వీసీగా నియమితురాలైన తొలి ఎరుకలి సామాజికవర్గ మహిళ ఆమే కావడం విశేషం…
Ads
స్టూవర్టుపురానికి చెందిన ఆమె తండ్రి ప్రసాదరావు రైల్వేలో వైద్యాధికారి. తల్లి వసుంధరాదేవి. సర్దార్ పటేల్ మహావిద్యాలయలో పీహెచ్‌డీ చేసిన ఆమె తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం మొదలుపెట్టారు.
విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. ‘రిజర్వేషన్ అభ్యర్థులకు ఏం ప్రతిభ ఉంటుంది?’ అనే విమర్శలకు దీటుగా సమాధానమిస్తూ గిరిజనుల జీవన స్థితిగతులు, భాషలపై చేసిన పరిశోధనలు చేసి 2021లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు.
19 గిరిజన భాషలకు అక్షరాలు రాసి అమెరికాలో ప్రతిష్ఠాత్మక ఎన్‌డేంజరెడ్ పురస్కారాన్ని అందుకున్నారు. 125 పరిశోధన వ్యాసాలు రాశారు. ఇప్పటికి 40కి పైగా అవార్డులు అందుకున్నారు.
ఆమెను యూనివర్సిటీ వీసీగా నియమించిన నిజంగా హర్షించాల్సిన విషయం. థ్యాంక్స్ టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
PS: ఇందులో ఏదో పైరవీలు జరిగి ఉంటాయనే విమర్శలు ఇప్పటికే మొదలయ్యాయి. అదేంటో, దళితులు, గిరిజనులకూ, అందులోనూ స్త్రీలకు ఏ పదవులు వచ్చినా అనుమానపూరితమైన ఆలోచనలే వస్తాయి. వాళ్లకు ప్రతిభ లేదన్న ఆలోచనా, లేదనుకునే వాళ్ల ఊహలకు విరుద్ధంగా విజయాలు సాధిస్తున్నారనా? – విశీ (వి.సాయవంశీ)
Share this Article