మొన్నామధ్య మనం ఓ కథనాన్ని ముచ్చటించుకున్నాం… ఒడిశా ప్రభుత్వంలో కీలకమైన ఓ ఐఏఎస్ అధికారి, పేరు పాండ్యన్ వీఆర్ఎస్ తీసుకున్నాడు అని… దానికి నేపథ్యాన్ని కూడా చెప్పుకున్నాం… ఒకసారి ఈ పాత కథనాన్ని చదవండి, తరువాత తాజా సమాచారంలోకి వెళ్దాం…
వి.కార్తికేయన్ పాండ్యన్… ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు చర్చకు వస్తోంది… ఎందుకంటే..? ఆయన ఇప్పుడు ఒడిశాకు యాక్టింగ్ సీఎం… అబ్బే, నవీన్ పట్నాయక్ ఎవరికీ అంత అవకాశం ఇవ్వడు అంటారా..? కాదు, ఇస్తున్నాడు, ఇచ్చాడు…
ఇంతకీ ఎవరు ఈ పాండ్యన్..? ఈయన తమిళనాడుకు చెందినవాడు… 2000 ఐఏఎస్ బ్యాచ్… ఒడిశా కేడర్… 2007లో గంజాం కలెక్టర్… అప్పట్నుంచే పట్నాయక్ దృష్టిలో పడి, క్రమేపీ దగ్గరయ్యాడు… అక్కడో ఇక్కడో ఎందుకులే అనుకుని పట్నాయక్ తనను తన పీఎస్‌గా పెట్టేసుకున్నాడు… సీఎంకు పీఎస్ అంటే తెలుసుగా… పవర్ సెంటర్…
Ads
పాండ్యన్‌ను పట్నాయక్ బాగా నమ్ముతాడు… విశ్వసనీయ కోటరీ… 2011 నుంచి పట్నాయక్ పర్సనల్ సెక్రెటరీగా ఉన్న ఈయన మొన్న వీఆర్ఎస్ తీసుకున్నాడు సర్వీస్ నుంచి… అప్పుడే బీజేడీ వర్గాలు చెప్పాయి, పట్నాయక్ తనకు కీలకమైన బాధ్యతలు ఇస్తాడని… అదే జరిగింది… పట్నాయక్ తనను హైప్రొఫైల్ బాధ్యతలోకి తీసుకున్నాడు… పట్నాయక్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 5టీ ప్రోగ్రామ్ అమలుకు ఈ కేబినెట్ మంత్రి హోదా ఉన్న 5టీ ఛైర్మన్ పాండ్యన్ బాధ్యత…
తను నేరుగా సీఎంకు అటాచ్‌డ్… ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకీ రాడు… అంటే సీఎం మాత్రమే తనకు మార్కులేసేది… తను చెప్పినట్టు మాత్రమే పాండ్యన్ నడుచుకుంటే సరి… అసలు ఏమిటి ఈ టీ5 ప్రోగ్రామ్… టీమ్ వర్క్, టెక్నాలజీ, టైమ్, ట్రాన్స్‌ఫార్మేషన్, ట్రాన్స్‌పరెన్సీ… నిజానికి ఈ ఆలోచన కూడా పాండ్యన్‌దే… అమ ఒడిశా, నబీన్ ఒడిశా పేరిట (మన ఒడిశా, నవీన ఒడిశా) ఈ 5టీ అమలు చేస్తున్నారు…
చాలా నిధుల్ని ఈ కార్యక్రమం కిందే ఖర్చు చేస్తున్నారు… కొంతకాలంగా ఏపీలో జరుగుతున్నట్టుగానే అన్ని స్కూళ్ల రూపురేఖలు మార్చేస్తున్నారు… (నిజానికి ఇవి కేంద్ర నిధులే… కానీ చెప్పుకునే దిక్కులేదు బీజేపీలో…) దాదాపు 4 వేల హైస్కూళ్లను తొలి దశలో ఆధునీకరించారు… క్లాస్ రూమ్స్, లేబ్స్, ప్లే గ్రౌండ్స్… స్కూల్స్ మొత్తం మారిపోతున్నయ్… ఒక్కో పంచాయతీకి 50 లక్షలు ఇచ్చి, వాళ్లే డెవలప్ చేసుకునే మరో స్కీం అమలు చేస్తున్నారు… దానికీ పాండ్యనే ఇన్‌చార్జి… (ఏపీ, తెలంగాణల్లో కూడా ఈ ప్రోగ్రామ్ వేరే పేర్లతో అమలవుతోంది…)
తను ఏకంగా బీజేడీలో చేరి రాబోయే ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నాడట… ఎవరో కాదు, బీజేడీ వర్గాలే చెబుతున్నయ్… పట్నాయక్ మళ్లీ అధికారంలోకి వస్తే పాండ్యన్ పెత్తనం, అధికారం, ప్రభావం ఇంకా పెరగబోతున్నట్టే… ఈమధ్య 5టీ చైర్మన్‌గా పలు జిల్లాలకు ఒక్కడే సర్కారీ హెలికాప్టర్‌లో వెళ్లివచ్చాడు పాండ్యన్… ఇదేం సమాంతర అధికారం అంటూ బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు చేశాయి గానీ పట్నాయక్ అవేమీ పట్టించుకునేవాడు కదా… పాండ్యన్ గోఎహెడ్ అన్నాడు…
అన్నట్టు, పట్నాయక్‌కు కుటుంబ రాజకీయ వారసులు ఎవరూ లేరు, ఇది గుర్తుపెట్టుకొండి…!! సేమ్, మోడీ తన విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్‌ను ఏకంగా విదేశాంగ మంత్రిని చేయలేదా..? మాజీ ఐఏఎస్ అధికారి అశ్విన్ వైష్ణవ్‌ను ఏకంగా రైల్వే మంత్రిని చేయలేదా..? ఇదీ అంతే… మాజీ బ్యూరోక్రాట్లను నేరుగా కీలక పొజిషన్లలోకి తీసుకుని, కీలక బాధ్యతలు అప్పగించడం అనేది ప్రజెంట్ ట్రెండ్… పట్నాయక్ పాటిస్తున్నదీ అదే…!!
ఎస్… చదివారు కదా… అంతా అనుకున్నట్టే ఆయన బీజేడీ పార్టీలో అధికారికంగా చేరాడు సోమవారం… చేరిన వెంటనే పార్టీ సీనియర్లతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి, అక్కడ నవీన్ పట్నాయక్ కాళ్లు మొక్కి ఆశీస్సులు తీసుకున్నాడు… పార్టీ ఆంతరంగిక సమాచారం ఏమిటంటే..? ఆయన ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్ టూ… అంతేకాదు, ఆయనే పట్నాయక్ రాజకీయ వారసుడు… గత ఆరు నెలల్లో 147 నియోజకవర్గాల్లో పర్యటించాడు ఆయన… వయస్సు కూడా పెద్దదేమీ కాదు… 1974 జనన సంవత్సరం… అంటే యాభై ఏళ్లలోపే…
పాండ్యన్ భార్య పేరు సుజాత రౌట్ పాండ్యన్… ఆమె నేటివ్ స్టేట్ ఒడిశాయే… తను కూడా 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి… అర్థమైంది కదా… ట్రెయినింగ్ దగ్గరే పరిచయం, తరువాత ప్రణయం… పరిణయం… ఆమెకు కూడా నవీన్ పట్నాయక్ బాగా ప్రయారిటీ ఇచ్చాడు… తను ప్రిస్టేజియస్‌గా భావించే ‘మిషన్ శక్తి’ ప్రోగ్రామ్‌కు హెడ్ ఆమే… ఆమె కూడా పార్టీలోకి వస్తుందా, ప్రభుత్వంలోనే ఉంటుందా అనే విషయంలో క్లారిటీ లేదు…
అసలు విషయం ఏమిటంటే..? బీహార్ సీఎం నితిశ్‌కు కూడా రాజకీయ వారసులు ఎవరూ లేరు… ఆమధ్య ఐప్యాక్ ప్రశాంత్ కిషోర్‌ను తన వారసుడిగా గుర్తించి ఎనలేని ప్రయారిటీ ఇచ్చాడు… కానీ పీకే దాన్ని చెడగొట్టుకున్నాడు… బీహార్ సీఎం పదవిని మించిన యాంబిషన్స్, యాస్పిరేషన్స్ ఏవో ఉన్నట్టున్నయ్… ప్రస్తుతం నితిశ్ పీకేను పది ఆమడల దూరం పెట్టాడు… ప్రశాంత్ కిషోర్ అలా… పాండ్యన్ ఇలా… అదీ కంట్రాస్ట్…!!
Share this Article