సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హనుమాన్ సినిమా విశేషాలు చదువుతూ ఉంటే… ఈ సక్సెస్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతోంది దర్శకుడు ప్రశాంత్ వర్మకే అనే విషయం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది… తన పాత సినిమాలు అ గానీ జాంబిరెడ్డి గానీ వేరు… హనుమాన్ కంప్లీటుగా వేరు… తను ఆకాశానికి ఎత్తేసింది… ప్రతిభ మాటెలా ఉన్నా అదృష్టమాల మెడలో పడింది…
మరి వాట్ నెక్స్ట్ అన్నప్పుడు చాలా విషయాలు చెబుతున్నాడు… తను వెళ్లాల్సింది చాలా బృహత్ మార్గం… ఏదో సినిమాటిక్ యూనివర్శిటీ పేరుతో హనుమాన్‌లాగే 12 సూపర్ హీరోల సినిమాలు తీస్తానని అంటున్నాడు… ఆరు సినిమాలకు ఆల్ రెడీ రైటింగ్ వర్క్ సాగుతోందట… ఒక సినిమా షూటింగులో ఉందట… హనుమాన్ సీక్వెల్ కూడా రెడీ అయిపోతోంది… వాటిల్లో ఒక ఫిమేల్ సెంట్రిక్ సూపర్ హీరోయిన్ సినిమా కూడా ఉందని చెబుతున్నాడు…
అంటే ఆ డజను కేరక్టర్లలో ఈ ఫిమేల్ కేరక్టర్ కూడా ఒకటా..? ఇది వేరా అనేది తనే చెప్పాలి… అలాగే ఏ పురాణపాత్రను తన ఫిమేల్ సెంట్రిక్ సూపర్ హీరోయిన్ సినిమాకు తీసుకుంటాడనేది కూడా ఇంట్రస్టింగే… చరిత్రలో సత్యభామ మొదలుకుని చాలా సూపర్ ఫిమేల్ కేరక్టర్లున్నయ్… కాకపోతే దైవత్వం కూడా ఉన్న కేరక్టర్లయితే దుర్గ, కాళి, ఆదిశక్తి వంటి పాత్రలు ఎంచుకోవాలి…
Ads
సరే, ఈ సినిమాలు వర్కవుట్ కావడానికి చాలా సమీకరణాలు దోహదపడాలి… అంత వీజీ అయితే కాదు… వరుసగా సక్సెస్‌లు పలకరిస్తే గానీ తరువాత సినిమాలు లైన్‌లో ఉండవు, మధ్యలో ఒక్క బ్రేక్ పడినా సరే, మొత్తం ఓ వరుసే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది… సరే, మంచే ఆశిద్దాం… ఎందుకంటే, తను ఆదిపురుష్ వంటి చిల్లర, నాసిరకం సినిమాలతో హిందూ దేవుళ్లను అవమానించడు కాబట్టి… ఆ విషయం ధైర్యంగా తనే చెప్పాడు కాబట్టి… పైగా నిర్మాణ వ్యయంలో ప్రతి పైసాకు న్యాయం చేస్తాడు, తక్కువ ఖర్చులో ఎక్కువ ఔట్ పుట్ తీసుకొస్తాడు కాబట్టి…
సరే, కానీ ఆ బలమైన సూపర్ హీరోయిన్ పాత్రకు సరిపోయే నటి ఎవరున్నారు..? ఇదీ ప్రశ్న… ఏదో ఒక ఇమేజీ బందిఖానాలో ఉండే పాపులర్ హీరోయిన్లు ఎవరూ ప్రశాంత్ వర్మ చెప్పినట్టుగా ఆ పాత్రలోకి ఒదిగిపోకపోవచ్చు… సాయిపల్లవి వంటి ప్రయోగాల్ని ఇష్టపడే హీరోయిన్ అయితే బాగానే ఉంటుంది కానీ ఆమె పాన్ ఇండియా సీత పాత్రలో ఓ రెండేళ్లు బిజీ… కానీ హఠాత్తుగా ఒక పేరు తెర మీదకు వచ్చింది… ఆమె పేరు కాండ్రేగుల జ్ఞానేశ్వరి…
ఎవరీమె అని ఆలోచిస్తుంటే అప్పట్లో యాంకర్ ప్రదీప్, సుమలు హోస్ట్ చేసిన పెళ్లిచూపులు అనే టీవీ షో గుర్తొచ్చింది… డిజాస్టర్ షో… కాకపోతే అందులో ఈ జ్ఞానేశ్వరి మెరిసింది… విశాఖపట్నం అమ్మాయే… కాకపోతే ఆమె పేరున్న హీరోయిన్ కాదు… పలు సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్ట్… చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా ఏమైనా చేసిందేమో తెలియదు… పలు సీరిస్ కూడా చేస్తోంది… మంత్ ఆఫ్ మధు, నీ జతగా, మాయలో, మిస్టర్ అండ్ మిస్ అనే సినిమాలు ఆమె ఫిల్మోగ్రఫీ జాబితాలో కనిపిస్తున్నాయి… లీడ్ రోల్స్ కాదు…
అక్కడక్కడా కొన్ని బోల్డ్ పాత్రలు కూడా చేసినట్టుంది… అవన్నీ సరే, ప్రశాంత్ వర్మ కలల్లోని సూపర్ హీరోయిన్ పాత్రకు ఈమె సరిపోతుందా..? ఏమో… తను ఎక్కడా ఈమె గురించి రివీల్ చేయడం లేదు గానీ, ఏదో ఇంటర్వ్యూలో ఆ పిల్లే ఈ సంగతి చెప్పుకుంది… ఈమె సరిపోతుందా అనే ప్రశ్నకు మరో ప్రశ్నే జవాబు… హనుమాన్ పాత్రకు తేజ సరిపోలేదా..? సరిగ్గా కేరక్టరైజ్ చేసి చూపించగలిగే దర్శకుడి దమ్మే ప్రధానం… ప్రశాంత్ వర్మకు ఆ దమ్ము ఉందనే నమ్ముతున్నాం కదా… గుడ్… కాకపోతే ఇదీ ఓ సాహసమే..!
Share this Article