‘‘బీజేపీదే హవా… బీజేపీకి క్రేజు… ఇంకొన్ని దశాబ్దాలు అధికారం దానిదే… బీజేపీని పారద్రోలడం అసాధ్యం… రాహుల్ గాంధీ ఏవో భ్రమల్లో ఉన్నాడు, కానీ తన అంచనాలు తప్పు… బీజేపీని ఎవరూ ఏమీ చేయలేరు…..’’
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ మాటలు అన్నట్టుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా రాస్తోంది… ఇక దానిమీద డిబేట్లు షురూ… ఎవడికి ఏది తోస్తే అది రాసేస్తున్నారు… అరె, బీజేపీ బద్ధ వ్యతిరేకి ఇలా మెచ్చుకోవడం ఏమిటి అనే డౌటనుమానాలు సరేసరి… కాంగ్రెస్‌తో కూడిన బలమైన ప్రతిపక్ష వేదికను నిర్మించే దిశలో నడిచే పీకేకూ కాంగ్రెస్‌కు చెడిపోయిందా..? ఇలాంటి అభిప్రాయలు కూడా మీడియాలో, సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నయ్… మొన్నమొన్నటివరకూ పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పీకే అధికారిక సలహాదారు తను… మరి అకస్మాత్తుగా ఎక్కడ బెడిసికొట్టింది..? ఈ వ్యాఖ్యలు తన భావి ‘బడా కంట్రాక్టు’ కోసం చేస్తున్నవేనా..? ఏదైనా భారీ ఎత్తుగడా..? అసలేమిటి తన వ్యాఖ్యల పరమార్థం..? నిజానికి తనేమన్నాడు..?
కొన్ని దశాబ్దాలపాటు బీజేపీ అధికారంలో ఉంటుందనీ, దాని క్రేజ్ కొనసాగుతుందనీ పీకే ఆ పార్టీకి ఏమీ సర్టిఫికెట్టు ఇవ్వడం లేదు… దాన్ని ఎవరూ ఏమీ చేయలేరు, రాహుల్ అనవసరంగా భ్రమల్లో ఉన్నాడని కాదు తను చెప్పింది… బీజేపీ బలాన్ని, మోడీ బలాల్ని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతోందనేది తన అభిప్రాయం, అదీ ఓ కాంటెక్స్ట్లో చెబుతూ వెళ్లాడు… తన వృత్తే రాజకీయ వ్యూహరచన… నిరంతరం దేశ రాజకీయ స్థితిగతుల్ని అధ్యయనం చేయడం, అంచనా వేయడమే తన పని… ఆ దిశలోనే కొన్ని కఠిన వాస్తవాల్ని చెప్పాడు తప్ప… బీజేపీకి క్రేజు, మోడీ అత్యంత పవర్ఫుల్, బీజేపీదే అధికారం అనే వ్యాఖ్యలు చేయలేదు… ఓసారి ఈ వీడియో చూడండి…
Ads
‘‘బీజేపీకి ఈ దేశంలో 30 శాతం దాకా వోట్లున్నయ్… గెలిచినా ఓడినా ఆ పార్టీ ఇంకొన్ని దశాబ్దాలపాటు రాజకీయాల్లో కీలకంగా ఉంటుంది… ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం పెరిగిందనీ, వెంటనే మోడీని దింపేస్తారనే రాహుల్ అంచనాలు సరికాదు…’’ ఇవీ పీకే మాటల సారాంశం… నిజమే… తనేమీ బీజేపీ మీద ప్రేమతో అలా అనలేదు, అవి బీజేపీ మీద ప్రశంసలేమీ కావు… ప్రజెంట్ సిట్యుయేషన్ చెబుతున్నాడు… ఒకప్పుడు బీజేపీ అంటే నాలుగైదు ఉత్తరాది రాష్ట్రాల్లో కాస్త బలమున్న పార్టీ, మత ఎమోషన్ల మీద ఆధారపడి రాజకీయాలు చేసే పార్టీ… కానీ అది తన పంథా మార్చుకుంది… విస్తరిస్తోంది… గతంలో ఈశాన్యం, అండమాన్ వంటి ప్రాంతాల్లో రాజకీయాలు అంటే కాంగ్రెస్ మాత్రమే… (త్రిపుర వంటి ఒకటీరెండు చిన్న రాష్ట్రాలు మినహా…) లేదంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు… అది ఆడిందే ఆట, చేసిందే రాజకీయం… కానీ ఇప్పుడు ఆ ప్లేస్‌ను బీజేపీ ఆక్రమించింది… తనకు తెలిసిన సామదానభేదదండోపాయాలన్నీ ప్రయోగిస్తోంది… వాడితో కలవాలి, వీడితో దూరం ఉండాలి అనే సైద్ధాంతిక పరిమితులేమీ లేవు తనకు…
ప్రతి రాష్ట్రంలో అయితే నెంబర్ వన్, లేదా నెంబర్ టూ… అదీ దాని లక్ష్యం… కానీ కీలకంగా ఉండాలనేదే టార్గెట్… ప్రజాస్వామిక దేశాల్లో అధికారాలు వస్తుంటయ్, పోతుంటయ్… కానీ ఏ పార్టీ ఎంత బలంగా, సంస్థాగతంగా విస్తరించి ఉందనేదే ఎప్పటికైనా కీలకం అవుతుంది… దేశవ్యాప్తంగా బలంగా విస్తరించిన ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ వంటి ఆర్గనైజేషన్లు దాని బలం… పెరుగుతున్న మత అసహనం దాని బలం… ఇతర పార్టీల సూడో సెక్యులర్ పోకడలు దాని బలం… పెరుగుతున్న జాతీయతావాదం దాని బలం… అన్నింటికీ మించి ఇదే పీకే చెబుతున్నట్టు… 30 శాతం వోట్లు బీజేపీ చేతిలో ఉంటే, మిగతావన్నీ రకరకాలుగా చీలిపోతున్నయ్… బలంగా నిలబడాల్సిన కాంగ్రెస్ క్షీణతావేగం బీజేపీకి మరో వరం… ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతోంది… వెరసి బీజేపీని జస్ట్, ఇలా ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారనేది భ్రమ… కాంగ్రెస్‌లాగా బీజేపీది వారసత్వ రాజకీయం కాదు, ఏక కుటుంబ కేంద్రిత రాజకీయం కాదు… మోడీ కాకపోతే మరొకరు, అసలు అద్వానీ కనుమరుగై, మోడీ ఈ స్థాయిలో నిలబడతాడని ఎవరూహించారు..? రేప్పొద్దున ఇంకెవరో…! బీజేపీ బలాల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా దాన్ని ఢీకొనడం, కూలదోయడం ఇప్పుడప్పుడే అసాధ్యం… మరి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల పరమార్థం కూడా ఇదే కదా…! (మీకు బీజేపీ పాలిటిక్స్, స్ట్రెంత్ సరిగ్గా అర్థం కావడం లేదు, అసలు సిట్యుయేషన్ ఇదీ అని చెప్పడం తనను, తన అవసరాన్ని, తన పనినీ ప్రమోట్ చేసుకోవడం కూడా…!!)
Share this Article