ప్రశాంత్ నీల్… తను దర్శకత్వం వహించిన కేజీఎప్-2 ఎంతటి సంచలనమో తెలిసిందే కదా… 100 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ సినిమా దాదాపు 1200 కోట్లు కలెక్ట్ చేసింది… శాండల్‌వుడ్ నుంచి ఈ రేంజ్ చిత్రం గతంలో ఎప్పుడూ లేదు… ఇంతకీ ఎవరు ఈ ప్రశాంత్ నీల్..? అంతకుముందు ఎవరికీ తెలియదు పెద్దగా, కేజీఎఫ్-2 తరువాత తెలిసింది అందరికీ… ఆయన ఎవరో కాదు, మన తెలుగువాడే అని…
మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్న సుభాష్‌రెడ్డి కొడుకే ప్రశాంత్… తన ఇంటిపేరు, తను పుట్టిన ఊరిపేరు ఒకటే… నీలకంఠాపురం… తన పేరులోని నీల్ అదే… పాత అనంతపురం జిల్లా, మడకశిర మండలంలో ఉంటుంది ఈ ఊరు… సుభాష్‌రెడ్డి భార్య భారతి… ఇద్దరూ చాన్నాళ్ల క్రితమే బెంగుళూరుకు వెళ్లిపోయి స్థిరపడ్డారు… హాయ్‌లాండ్, మోతీమహల్ ఆయనవే… ఎక్కువగా సినిమా షూటింగులు జరుగుతుంటాయి… ప్రశాంత్ ఎంబీఏ అయ్యాక ఫిలిమ్ మేకింగ్ చదువుకుని దర్శకుడయ్యాడు…
తన మొదటి సినిమా ఉగ్రమ్… అదీ హిట్… అందులో హీరో ఎవరో తెలుసా..? శ్రీమురళి… తను ఎవరో కాదు, ప్రశాంత్‌కు బావే… ప్రశాంత్ చెల్లెలు విద్యను పెళ్లిచేసుకున్నాడు మురళి… సో, తన మొదటి సినిమా హీరో తన బావే… తరువాత కేజీఎఫ్, కేజీఎఫ్-2… వాటి గురించి తెలిసిందే కదా… ఇప్పుడు ప్రభాస్‌తో సాలార్ ప్రాజెక్టు చేస్తున్నాడు, జూనియర్ ఎన్టీయార్ సినిమా కూడా ప్రతిపాదనల్లో ఉంది… అన్నట్టు… ఈ శ్రీమురళి కన్నడ రాజకుమార్ కుటుంబానికి బంధువు… అలా ప్రశాంత్ కుటుంబం కన్నడ సినిమా ఇండస్ట్రీతో అల్లుకుపోయింది…
Ads
అప్పుడే అయిపోలేదు… ప్రశాంత్ పెళ్లి చేసుకున్నది లిఖితారెడ్డిని… (నిజానికి రఘువీరారెడ్డి, సుభాష్‌రెడ్డిల పేర్లలో రెడ్డి అనే పదమున్నా వాళ్ల కులం రెడ్డి కాదు… యాదవ..!) లిఖితారెడ్డి ద్వారా ప్రశాంత్‌కు హీరో ఆదర్శ్ బాలకృష్ణ కూడా బంధువే… బిగ్‌బాస్ ద్వారా ఆదర్శ్ తెలుగువాళ్లకు పరిచయమే కదా… ఇదీ ప్రశాంత్ నేపథ్యం… ఇదంతా సరే, ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నట్టు..?
ఎందుకంటే… ప్రశాంత్ తన రూట్స్ మరిచిపోడు కాబట్టి… ఆయన తండ్రి సుభాష్ కోరిక ఏమిటంటే… తను మరణించాక తనను సొంత గ్రామం నీలకంఠాపురంలోనే సమాధి చేయాలని… అలాగే చేశారు… పైన కనిపిస్తున్న సమాధి ఆయనదే… ప్రశాంత్ ఏటా సొంత ఊరికి వస్తాడు… తండ్రి పుట్టినరోజు పంద్రాగస్టు… వీలయితే అదేరోజు వస్తాడు, తండ్రి సమాధి దగ్గర నివాళ్లు అర్పిస్తాడు… తన బంధుగణాన్ని కలుస్తాడు… వెళ్లిపోతాడు…
రఘువీరారెడ్డి రాజకీయాల నుంచి రిటైరై ఊళ్లోనే ఉంటున్నాడు… ఓ ఆలయాన్ని డెవలప్ చేశాడు… ఆ ఊళ్లోనే ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్ కడుతున్నారు… ప్రశాంత్ తన తండ్రి సుభాష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ హాస్పిటల్ కోసం 50 లక్షల డొనేషన్ అందించాడు… తనకు 50 లక్షల విరాళం పెద్ద విషయం కాకపోవచ్చు… కానీ తండ్రి పుట్టిన ఊరితో బంధాన్ని అలాగే పదిలంగా ఉంచుకోవడం అభినందనీయం… ప్రశాంత్ కుటుంబంతోసహా వచ్చిన ఆలయాన్ని సందర్శించిన వీడియో లింక్ దిగువన… (ఎన్ని కోట్లు సంపాదించినా, పిల్లికి బిచ్చం వేయని ఎంతోమందితో పోలిస్తే ప్రశాంత్ చాలా చాలా రెట్లు బెటర్ కదా)…
Share this Article