.
Thummeti Raghothama Reddy ……… తెలుగు పట్టణాలలో నిన్న, చత్రపతి శివాజి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆ ఉత్సవాల నిర్వాహకులు, బిజెపి కార్యకర్తలు.
శివాజీ మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తన జీవితాంతం వరకు పోరాడాడు.అందులో సందేహం లేదు. అతని జయంతి వర్ధంతి జరపడానికి అర్హుడు. ఎక్కడ? మహారాష్ట్ర వ్యాప్తంగా! శివాజీ జయంతిని తెలుగు పట్టణాలలో జరపడం ఏమిటి?
Ads
మహారాష్ట్ర వ్యాప్తంగా జరపాలి, కానీ గత దశాబ్ద కాలంగా, అంటే కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత, క్రమంగా మహారాష్ట్ర నుండి శివాజీని మన తెలుగు ప్రాంతాలకు పట్టుకుని రావడం ప్రారంభం అయింది. ఇప్పటికే కొన్ని తెలుగు పట్టణాలలో, ముఖ్యంగా తెలంగాణ పట్టణాలలో శివాజీ విగ్రహాలు కూడా పెట్టారు. మన ‘రాణీ’ రుద్రమదేవి విగ్రహాలను మహారాష్ట్రలో పెట్టారా? లేదు కదా!
బిజెపి అవగాహన ప్రకారం హిందూ మత పరిరక్షణకు ముస్లిం సుల్తానులకు వ్యతిరేకంగా పోరాడిన రాజులను, ఆ పోరాటాలలో మరణించిన రాజులను ‘హిందూ సామ్రాజ్య దివస్’ గా స్మరించుకోవడం కదా? అయితే ఎక్కడికక్కడ స్ధానిక హిందూ రాజులను స్మరించాలి కదా?
స్ధానిక ప్రజల అభిమానాన్ని చూరగొనాలంటే, రాజకీయ పార్టీలు స్ధానిక వీరులను స్మరించాలి. మన ప్రధాన రాజకీయ పార్టీలు రెండూ , కాంగ్రెస్, బిజెపిలు ఉత్తరాది బేస్డ్ పార్టీలుగానే కొనసాగుతున్నాయి. వాటి భాష కూడా అదే ఉత్తరాది భాష. తెలుగు పదాలు లేవా?
ఆ పార్టీల ప్రధాన భావజాలాన్ని, దక్షిణ భారత దేశం మీద రుద్దుతున్నాయి .దక్షిణ భారతదేశంలో ఎక్కడికక్కడ రాజ వీరులు లేరా? ‘హిందూ సామ్రాజ్య దివస్’ సందర్భంగా, బిజెపి తెలుగు ప్రాంతాలలో చెయ్యవలసిన పని ఏమిటి?
చత్రపతి శివాజీ కంటే దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితమే, ఇప్పటి ఉభయ తెలుగు రాష్ట్రాలను పాలించిన కాకతీయ సామ్రాజ్య చివరి పాలకుడు ప్రతాపరుద్రుడిని స్మరించాలి (క్రీ.శ.1289- 1323)
ప్రతాపరుద్రున్ని ఎందుకు స్మరించాలి?
నిజానికి మొట్టమొదటిసారిగా ఢిల్లీ సుల్తానుల దండయాత్రలను ఎదుర్కొన్నవాడు ప్రతాపరుద్రుడు. అప్పుడు ఢిల్లీ సుల్తాను మహమ్మదు బిన్ తుగ్లక్. అతని సేనాని ఉలూగ్ ఖాన్ నాయకత్వంలో మొట్టమొదటి సారిగా దక్షిణ భారత దేశం మీద దండయాత్రలు జరిగాయి. అప్పటికి దక్షిణ భారత దేశంలో ముస్లిం పాలకులే లేరు. తుగ్లక్ దండయాత్రల తరువాత దక్షిణాన బహమనీ సామ్రాజ్యం ఏర్పడింది.
మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యం మొదట మహారాష్ట్ర దేవగిరి యాదవ రాజు హరపాల దేవున్ని ఓడించి, ప్రాణంతో ఉండగా అతని చర్మాన్ని ఒలిచి, అతని తల నరికి , దేవగిరి కోట బురుజుకు వ్రేలాడ దీసారు.
ఆ దేవగిరి యాదవ రాజుల ఓటమి తర్వాత, తుగ్లక్ సైన్యం ఓరుగల్లు మీద దండయాత్ర చేసింది. అలా మూడుసార్లు దండయాత్రలు చేసి, వరంగల్ కోట నుండి ఎంతెంత సంపద దోచుకున్నారో, తుగ్లక్ సైన్యంలో ఒక సర్దారుగా వచ్చిన కవి అమీర్ ఖుస్రో వివరంగా వర్ణించాడు.
ఆ దేవగిరి యాదవ రాజుల ఇంటి ఆడపడుచు ఒకరిని, ఈ కాకతీయ ప్రతాపరుద్రుడి తాత గణపతి దేవ చక్రవర్తి వివాహం చేసుకున్నాడు. గణపతి దేవుడి మరో భార్య కూతురు రుద్రమదేవి. ఆ రుద్రమదేవి కూతురు కొడుకే ప్రతాపరుద్రుడు.
తదనంతర కాలపు ఇదే దేవగిరి యాదవ రాజుల ఇంటి ఆడపడుచు, అటు చత్రపతి శివాజి తల్లి జిజియా బాయి. తుగ్లక్ సైన్యాలు ఓరుగల్లు కోట మీద మూడవ సారి చేసిన దండయాత్రలో , కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఓటమి పాలయ్యాడు. అతన్ని బందీ చేసి, ఢిల్లీ సుల్తాన్ దగ్గరకు పంపుతుంటే, మార్గ మధ్యంలో నర్మదా నది ఒడ్డున మరణించాడు అని చరిత్రలో ఉంది.
ఆ దండయాత్ర వివరాలను రాస్తూ, తుగ్లక్ సైన్యం వెంట వచ్చిన ఆస్థాన కవి ఫాంసీ సిరాజ్ అనే అతను ప్రతాపరుద్రుడు ఎలా మరణించాడో రాయలేదు. ఫాంసీ సిరాజ్ రాయలేదు కానీ, ప్రతాపరుద్రుని తరువాత, అదే కాకతీయ సామ్రాజ్య సామాంత రాజు ముసునూరు ప్రోలయ (క్రీ.శ. 1330) అలాగే , రెడ్డిరాణి కలవచేరు తామ్ర శాసనములో ( క్రీ.శ.1423 ) ప్రతాపరుద్రుడు సహజ మరణం చెందలేదని, స్వచ్ఛంద మరణం చెందాడని ఉంది. అంటే ఆత్మహత్య చేసుకున్నాడు.
తుగ్లకు ముందు ఆత్మాభిమానం చంపుకోలేక, తనను తాను చంపుకున్నాడు ప్రతాప రుద్రుడు. ప్రతాప రుద్రుడు పోరాడి ఓడాడు, ఆత్మహత్యతో తిరిగి గెలిచాడు. ఆత్మహత్య, తీవ్ర నిరసన!
ఒకవేళ తెలుగు ప్రాంతాలలో బిజెపి ‘హిందూ సామ్రాజ్య దివస్’ లు జరిపితే, ప్రతాప రుద్రుడిని స్మరిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే దేశంలోని మిగిలిన ప్రాంతాలలో కూడా అక్కడ , సుల్తానులకు వ్యతిరేకంగా పోరాడిన స్ధానిక హిందూ రాజ వీరులను స్మరిస్తూ ఉత్సవాలు జరుపాలి.
తెలుగు ప్రజల మనసుల్ని బిజెపి ఓట్ల రూపంలో గెలవాలంటే, సుల్తానుకు వ్యతిరేకంగా పోరాడిన ప్రతాపరుద్రుని స్మరించాలి. తెలుగు రాష్ట్రాల బిజెపి నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు ,తమ ‘ హిందూ సామ్రాజ్య దివస్’ కార్యక్రమం గురించి పునరాలోచన చెయ్యాలి….
Share this Article