Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టి.కృష్ణ ఇంకొన్నాళ్లు బతికి ఉంటే… ఎన్ని ‘ప్రతిఘటన’లు పేలేవో..!!

July 23, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో, రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంలో … మరో మహాభారతం .. ఆరవ వేదం .. మానభంగ పర్వంలో మాతృ హృదయ నిర్వేదం . హేట్సాఫ్ టు వేటూరి .

విజయశాంతిని సూపర్ స్టార్ని చేసిన మొదటి సినిమా ఈ ప్రతిఘటనే కావచ్చు . ఈ సినిమాకు ముందు ఆమె చాలా సినిమాలలో నటించినా ఎక్కువగా అవన్నీ గ్లామర్ పాత్రలే . ఓ ఏంగ్రీ ఉమన్ గా పవర్ఫుల్ పాత్ర ఇదే . తర్వాత ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాలు చాలా ఉన్నాయనుకోండి .

Ads

కొందరు కొందరి కోసమే పుడతారేమో ! టి కృష్ణ తెలుగులో ఆరు సినిమాలకే దర్శకత్వం వహించారు . విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ని చేసింది మాత్రం అతనే . నిజ జీవితంలో లెక్చరర్ ఝాన్సీ పాత్ర మనకు తారసపడదు . కధల్లో , పురాణాల్లో కనిపించే ఎన్నో పాత్రలు మనకు యధాతథంగా నిజ జీవితంలో తారసపడవు . అవి ఆదర్శ పాత్రలు . ఇలా ఉంటే సమాజం బాగుంటుంది అని సందేశం ఇచ్చే పాత్రలు .

ప్రతిఘటన సినిమాలో లెక్చరర్ ఝాన్సీ పాత్ర కూడా అలాంటిదే . ప్రజలు భయంతో మౌనంగా ఉండటం వలనే కాళీ లాంటి తొండలు ఊసరవెల్లిలు అయి , ఆకు రౌడీలు గూండాలు అయి , సినిమా హాల్స్ వద్ద బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునే వాళ్ళు MLAలు అయి జన కంటకులు అవుతారనే సందేశాన్ని ఇచ్చిన సినిమా .

కాళీ లాంటి గూండాలు లేని పట్టణం ఎక్కడ ఉంది ! ఈ సినిమాలో ఎలక్షన్లలో నిలబడ్డ కాళీ క్యూలో ఉన్న ఓటర్లను మీ ఓట్లు మేమేసుకున్నాం , మీరింక వెళ్ళిపోవచ్చని చెపుతాడు . 1982 లో మా నరసరావుపేట మునిసిపల్ ఎన్నికల్లో ఇదే జరిగింది . బ్రాకెట్ ఆటను నడిపించే ఒక కాళీ ఓ వార్డులో నిలబడ్డాడు . పొద్దున్నే ఎనిమిది గంటలకు ఇంటింటికీ వచ్చి అతని అనుచరులు అమ్మా అయ్యా వచ్చి ఓట్లు వేయండని చెప్పారు .

మళ్ళా పదీ ప్రాంతంలో వచ్చి మీరెవరూ రానక్కరలేదు , మీ ఓట్లు మేం వేసేసుకున్నామని ప్రకటించేసారు .
ఈ సినిమాలో ఓ రౌడీకి MLA సీటా అని ఓ గాంధేయుడు గోల పెడితే ఆ గాంధేయుడిని రౌడీ గారు కొడతాడు . అలాంటివి నిజ జీవితంలో కూడా చూసాం , చూస్తున్నాం , చూస్తూనే ఉంటాం !!

రోజూ మన చుట్టూ జరిగే ఎన్నో సంఘటనల సమాహారమే ఈ ప్రతిఘటన సినిమా . ఓ సంచలనాత్మక , సందేశాత్మక సినిమా . ఈ సినిమా చూడనివారు అప్పుడూ ఇప్పుడూ ఎవరూ ఉండరేమో ! రామోజీరావు గారి సినిమా కాబట్టి తరచూ ఈటివిలో వస్తుంటుంది .

కధను , స్క్రీన్ ప్లేని , దర్శకత్వాన్ని అల్లల్లాడించారు టి కృష్ణ . ఆరవ వేదమయిన ఈ సినిమాలో పంచమ వేదంలో ఉన్నట్లు చాలా పవర్ఫుల్ పాత్రల్ని సృష్టించారు . విజయశాంతి పాత్ర తర్వాత అలాంటి పాత్ర వై విజయ , సుత్తి వేలులవి .లాయర్లు , జడ్జీలు , కండలు బలిసిన మల్లయోధులు నోరెత్తకుండా కాళీని భరిస్తున్న పట్టణంలో అతన్ని ధైర్యంగా ప్రతిఘటించే పాత్రలో వై విజయ నటన అద్భుతం .

తర్వాత సుత్తి వేలు పాత్రే . అద్భుతంగా నటించాడు . కాళీని ప్రతిఘటించే క్రమంలో భార్యను కోల్పోతాడు . పోలీసు అయి ఉండి పోలీస్ శాఖ నిస్సహాయ స్థితిలో ఉంటే తానొక్కడే ప్రతిఘటిస్తాడు . హెచ్చరికో హెచ్చరిక అంటూ జనాన్ని ఉత్తేజితులను చేస్తుంటాడు . దేశోధ్ధారకులు సినిమాలో పద్మనాభం పాత్ర , పాట గుర్తుకొస్తాయి . ఆకలయి అన్నమడిగితే పిచ్చోళ్ళన్నారు నాయాళ్ళు దొంగ నాయాళ్ళు పాట గుర్తుకొస్తుంది . హేట్సాఫ్ టు వై విజయ , సుత్తి వేలు .

తర్వాత చెప్పుకోవలసింది చరణ్ రాజ్ , కోట శ్రీనివాసరావు గురించి . తెలంగాణ యాసలో మినిస్టర్ కాశయ్యగా కోట తన నట జీవితాన్ని మలుపు తిప్పుకున్నాడు . అతని నటన , హావభావాలు , డైలాగ్ డెలివరీ వ్వాహ్ . కన్నడంలో హీరోగా వెలిగిపోతున్న చరణ్ రాజుని తెలుగుకి లాక్కొచ్చి గొప్ప విలన్ని చేసేసింది .

ఓ ఇంటర్వ్యూలో అతనే చెప్పాడు . బెంగూళూరులో ఒక థియేటర్లో సంవత్సరం ఆడిందట . 108 అడుగుల కటౌట్ పెట్టారట అతనిది . అంత క్రేజ్ వచ్చింది అతనికి ఈ సినిమా ద్వారా . ఇతర పాత్రల్లో డా రాజశేఖర్ , చంద్రమోహన్ , పి యల్ నారాయణ , కాకినాడ శ్యామల , రాళ్ళపల్లి , శ్రీలక్ష్మి , భీమరాజు , భీమేశ్వరరావు , నర్రా , ప్రభృతులు నటించారు . లాయర్ చంద్రమోహన్ పాత్ర నిజ సమాజానికి మచ్చుతునక .

డబ్బుల వర్షం , అవార్డుల వర్షం , ప్రశంసల వర్షం కురిసాయి ఈ సినిమాకు . జానకమ్మకు , విజయశాంతికి , రచయిత హరనాధరావుకు నంది అవార్డులు వచ్చాయి . చక్రవర్తి ఈ సినిమా ఐకానిక్ సాంగుకి అందించిన సంగీతానికి హేట్సాఫ్ .

తెలుగులో ఘనవిజయం సాధించిన ఈ సినిమా తమిళ , మళయాళ భాషల్లోకి డబ్ చేయబడింది . హిందీలోకి రీమేక్ చేయబడింది . హిందీలో సుజాత మెహతా , నానా పటెకర్ , రోహిణీ హట్టంగడి ప్రధాన పాత్రల్ని వేసారు . చరణ్ రాజ్ తన పాత్రను తానే వేసాడు .

సినిమా యూట్యూబులో లేదు . ఈటివి విన్లో ఏమయినా ఉందేమో నాకు తెలియదు . యూట్యూబులో కొన్ని సీన్లు , ఐకానిక్ సాంగ్ ఉన్నాయి . ఆసక్తి కలవారు వీక్షించవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెరపైకి హఠాత్తుగా బాబు, కేసీఆర్, పురంధేశ్వరి, రేవంత్‌రెడ్డి పేర్లు..!!
  • రేవంత్‌రెడ్డి ఫ్రీబస్సు బహుళ ప్రయోజనాల్ని ఇలా భిన్నంగా చూడాలి..!!
  • ఉపరాష్ట్రపతి ధన్కర్ రాజీనామా వెనుక ఇవీ అసలు కారణాలు..!!
  • గత సంబంధాలన్నీ గుండె పగిలిన అనుభవాలే… నేనిప్పుడు ఒంటరిని…’’
  • టి.కృష్ణ ఇంకొన్నాళ్లు బతికి ఉంటే… ఎన్ని ‘ప్రతిఘటన’లు పేలేవో..!!
  • తెలుగు డబ్బింగ్ వెర్షన్లకూ యథాతథంగా అవే తమిళ టైటిళ్లు..!
  • ‘‘పొలిటికల్ లాబీయింగుతోనే అమితాబ్‌కు ఆ జాతీయ అవార్డు’’
  • అందరూ నిర్దోషులే… సరే, మరి ఆ పేలుళ్లు, ఆ మరణాలకు బాధ్యులెవరు..?
  • రష్మి గౌతమ్..! డిజిటల్ డిటాక్స్ మాత్రమే కాదు… ఇంకేదో బాధ..!!
  • ధనాధన్‌ఖడ్ నిష్క్రమణ సరే… కొత్త ఉపరాష్ట్రపతి వీరిలో ఎవరబ్బా..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions