నారా రోహిత్ నటించిన ప్రతినిధి-2 సినిమా గురించి ఏదో రివ్యూ వంటి ఒపీనియన్ కూడా రాయాల్సి వస్తుందని అనుకోలేదు… దీనికి దర్శకుడిగా వ్యవహరించిన మూర్తి టిపికల్ టీవీ5 మార్క్ న్యూస్ ప్రజెంటర్… తన డిబేట్ల తీరు చూసినా, తనకు దీటుగాడు సాంబశివరావు తీరు చూసినా ఈ సినిమా గురించి పెద్ద భ్రమలేమీ ఉండనక్కర్లేదు… డిబేట్ ప్రజెంటర్ ఎలా ఉండకూడదో చెప్పడానికి మన తెలుగు చానెళ్లలో పలు కేరక్టర్లు సుప్రసిద్ధం…
వీళ్లు నిజానికి మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలోనే ఉన్నారా..? అసలు వీళ్లకు జర్నలిజం తాలూకు పరిమితులు, రియాలిటీ తెలియనంత భ్రమల్లో ఉంటున్నారా..? అనిపిస్తుంది… అవును, ఈ ప్రతినిధి-2 చూసినా అలాగే అనిపించింది… కాసేపు నవ్వొస్తుంది, కాసేపు జాలేస్తుంది… దీనికితోడు అప్పట్లో వరుసగా సినిమాలు చేసిన నారా రోహిత్ చాన్నాళ్ల తరువాత ఈ పాత్ర చేస్తున్నాడంటే ఒకింత ఇంట్రస్టింగు అనిపించింది… తన ఫిజిక్, తన నటన పెద్ద చెప్పుకోదగినవి కావు, ఇన్నేళ్లు ఏం చేశాడు, ఏమైపోయాడో తెలియదు గానీ… మళ్లీ తెర మీదకు వస్తూ ఈ కథను, ఈ పాత్రను ఎందుకు ఒప్పుకున్నాడో కూడా అర్థం కాదు…
జర్నలిస్టులంటే ఆకాశం నుంచి ఊడిపడరు, వాళ్లకు ప్రత్యేక శక్తులు, హక్కులేమీ ఉండవు… వాళ్లు తెలుగు సినిమా సూపర్ హీరోలు కాదు, కానీ తామేదో అన్నింటికీ అతీతం అనుకునే జర్నలిస్టులతోనే జర్నలిజానికి అసలు సమస్య… ఈ సినిమా కథలో ఓ జర్నలిస్టు ఎడాపెడా పరిశోధనాత్మక స్టోరీలతో హడల్ పుట్టిస్తుంటాడు… నేతిబీరలో నెయ్యి… అసలు జర్నలిజంలో పరిశోధన ఎక్కడుంది ఇప్పుడు..? అలాంటి స్టోరీలను ఎంటర్‌టెయిన్ చేసే మీడియా హౌజు ఉందా..? ఉంటుందా..? ఉండనిస్తారా..?
Ads
హీరో ఇంటర్వ్యూ వల్ల ఓ మంత్రి కొలువు కోల్పోతాడట… పార్టీ నుంచి సస్పెండ్ అవుతాడట… దీంతో ఉపఎన్నిక… అందులో పోటీ… ఇది పూర్తయ్యేసరికి సీఎంకు ప్రమాదం, మరణం… ఆయన కొడుకు సీఎం అయ్యే సమయానికి అబ్బే, సీఎం చనిపోలేదు అని తెలుస్తుందట… దాంతో అందరూ హాశ్చర్యపోతారు… దీని వెనుక అసలు కథను మన హీరో బయటపెట్టేస్తాడు… ఒక ఫిక్షన్ వరకూ వోకే… కానీ అదైనా సరిగ్గా ప్రజెంట్ చేశాడా మూర్తి..? లేదు, అచ్చం టీవీ5 డిబేట్ ప్రజెంటేషన్‌లాగే అడ్డదిడ్డం అయిపోయింది…
సినిమా దర్శకత్వం అంటే… స్టూడియోలో కూర్చుని ‘గెటౌట్ ఫ్రమ్ మై స్టూడియో’ అని అరవడం కాదు… పైగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా, అదీ పొలిటికల్ హీట్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఇలాంటి సాదాసీదా కంగాళీ సినిమాను ఊహిాంచలేం… మెయిన్ స్ట్రీమ్‌లో కనిపించే మూర్తికి ఒక ముఖ్యమంత్రి చుట్టూ ఉండే రక్షణ వలయం తెలియదా..? ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీసును బాంబు పెట్టి పేల్చేయడమా..? సరే, కథ కోసం ఏదో కల్పన అనుకుందాం… కానీ మరీ వేరే డెడ్ బాడీని పెట్టి, అంత్యక్రియలు జరిపించేసి, కొడుకు కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతుంటే… తూచ్, నేను బతికే ఉన్నానోచ్ అని పాత సీఎం బతికొస్తాడా..? ఫాఫం, సినిమా నిర్మాత.,.
మంత్రులైనా సరే జర్నలిస్టు అంటే వణికిపోతారా..? ఇదేమైనా బండ్ల గణేష్‌ను, శ్రీరెడ్డిని ఇంటర్వ్యూ చేయడమా..? మార్కెట్‌లో టమాటలు ఎక్కువ రేటుకు అమ్ముతుంటే మారువేషంలో వెళ్లి హీరో ఫైట్ చేస్తాడా..? ల్యాండ్ సెటిల్‌మెంట్ చేస్తున్న ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి తాటతీస్తాడా..? జర్నలిస్టు అంటే జనసేనాని అనుకున్నారా..? కానీ ఒక్క రిలీఫ్, మూర్తి సినిమా అనగానే ఓ పార్టీకి ప్రాపగాండా సినిమా అనుకుంటాం కదా, ఆ జోలికి పోలేదు…
హీరో, అందులోనూ తెలుగు సినిమా హీరో వోటు విలువ గురించి లెక్చర్లు దంచగానే 98 శాతం పోలింగ్… అంతేమరి… అందులో 90 శాతం నోటాకు పడిపోతాయట… అతికే అతితనం నేర్పించడం అంటారు దీన్ని… సినిమా చివరలో మరో ఏడో నెంబరు ప్రమాద హెచ్చరిక కూడా కనిపిస్తుంది… ప్రతినిధి-3 కూడా ఉంటుందట… ఇందులో కూడా ఓ హీరోయిన్ ఉంటుంది, ఎందుకు ఉందో కూడా అర్థం కాదు… సినిమా అన్న తరువాత హీరోయిన్ ఉండాల్సిందే అనే సూత్రం కోసం పాత్రను పెట్టారేమో… ప్చ్… సినిమా కనీసం టీవీ5లో డిబేట్ ప్రజెంటేషన్ తరహాలో సాగినా బాగుండునేమో… కాసేపు నవ్వుకోవడానికి లేదా జుత్తు పీక్కోవడానికి…!!
Share this Article