.
ఈటీవీ పాడుతా తీయగా రియాలిటీ షోలోని అవలక్షణాలు, రాగద్వేషాలు, తప్పుడు జడ్జిమెంట్లు- ఎలిమినేషన్ల తీరు మీద ప్రవస్తి విసిరిన అస్త్రాలు కలకలం రేపుతూనే ఉన్నాయి కదా…
వివాదంలోకి పలువురు గాయనీగాయకులు జొరబడి ఈ చర్చను మరింత రక్తికట్టిస్తున్నారు, తాజాగా కోటి ఎంటరై, ఏయ్ వాటీజ్ దిస్ అని ఏదేదో అంటున్నాడు… నిజానికి ఆమధ్య ముగిసిన జీసరిగమప షోలో తను కూడా బెటర్ సింగర్ మేఘనకు బదులు అభిజ్ఞను విజేతగా ప్రకటించడం తమరి నిర్ణయమే కదా మాస్టారూ… అందరూ అందరే…
Ads
సరే, ప్రవస్తి ఎపిసోడ్‌లో ప్రధానమైంది ఆమె పాడిన అంతా రామమయం పాట కదా… నిజానికి ఆ పాట తరువాత జడ్జిలుగా ఉన్న కీరవాణి, సునీత మాత్రమే కాదు, ఆస్కారుడు చంద్రబోస్ కూడా చిత్రమైన వ్యాఖ్యలు చేశాడు… ముగ్గురూ ముగ్గురే…
ఇవే చూస్తుంటే… మంచి స్వరజ్ఞానం కలిగిన మిత్రుడు కోదాటి సాంబశివ పోస్టు కనిపించింది… బాగుంది… ఓసారి చదవండి…
విద్యా వ్యవస్థ లో కోటీశ్వరులు చొరబడి…, విద్యను వ్యాపారం చేశారు.
వైద్య వ్యవస్థ లో కార్పొరేట్లు సోచ్చి…. వైద్యాన్ని బిజినెస్ చేశారు.
రాజకీయాల్లో రాబందులు వాలి… రాజకీయాల్ని కలుషితం చేశారు.
రియాలిటీ షోలలో ప్రొడక్షన్ హౌజులు వచ్చి…. పాటను పంకిలం చేశారు.
ఒక గాయకునికి లేదా గాయకురాలికి కావలసిన కనీస అర్హతలు ఏమిటి?
శృతి జ్ఞానము, లయ జ్ఞానము, రాగ జ్ఞానము, సాహిత్య ఉచ్చారణ దోషములు లేకుండా పాడడం, భావయుక్తంగా పాడగలగడం.
అంతేగానీ.., పాటకు తగ్గట్టుగా దుస్తులు వేసుకోవడం, పాట పాడుతున్నప్పుడు డాన్స్ చేయగలగడం, మధ్య మధ్యలో కుళ్ళు జోకులు వేయాల్సి రావడం ఇవన్నీ అవసరం లేవనుకుంటాను.
ఇక్కడ ప్రవస్తి పాడిన రెండు పాటలు ఇస్తున్నాను.
1. తన ఏడేళ్ల వయసులో సరిగమప లిటిల్ చాంప్స్ లో పాడిన పాట
2. తన పద్దెనిమిదవ ఏట పాడుతా తీయగా లో పాడిన పాట.
రెండవ పాట పరిశీలిద్దాం. ఈ పాట కీరవాణి గారు సంగీత దర్శకత్వం వహించిన భక్త రామదాసు సినిమాలో పాట “అంతా రామమయం ఈ జగమంతా రామ మయం” అనే పాట.
మంద్ర మధ్యమం నుండి తారా స్థాయి మధ్యమం వరకు సాధారణంగా గాయకులు పాడుతారు, కొంతమంది మహానుభావులు తారాస్థాయి పంచమం వరకు కూడా పాడగలరు.
స్త్రీల శృతికి పురుషుల శృతికి తేడా ఉంటుంది. ఈ పాట సినిమాలో పాడింది బాలు గారు ఆ పాటను ప్రవస్తే పాడడానికి స్వయంగా ఒప్పుకుందా లేక గత్యంతరం లేని స్థితిలో పాడిందా అనేది మనకు తెలియదు. ఎందుకంటే తన జడ్జిమెంట్ సమయంలో సునీత గారు ఈ పాట నీ చాయిసేనా అని స్పెషల్ గా అడిగింది.
ఇక ఈ పాట మీద ముగ్గురు జడ్జిల వ్యాఖ్యానాలు పరిశీలిద్దాం…
లెజెండరీ సింగర్ సునీత గారు…. ఈ సినిమాలో పాటలు పాడాను, స్నేహ గారికి గాత్రధారణ చేశాను, సినిమా ఆడియో ఈవెంట్లో యాంకర్ గా చేశాను, అందుకు కీరవాణి గారికి కృతజ్ఞతలు అని చెప్పింది…
పాటంతా బాగా పాడావు కానీ పైస్థాయి స్వరాలు వచ్చినప్పుడు ఫాల్స్ టోన్ లో పాడావు అయినా బాగానే కంట్రోల్ చేసుకున్నావు. నీకు కంఫర్ట్ జోన్ ఉన్న స్కేల్ లో ఉన్న పాట ఎంచుకుంటే బాగుండేది. అయినా అక్కడక్కడ బావుంది అక్కడక్కడ బాగులేదు.
బాగా పాడలేదని కాదు కానీ ఇంకా బాగా పాడగలవు అని నా అభిప్రాయం అని చెప్పింది. ఒక్క ముక్క అర్ధం అయితే ఒట్టు.
ఇక కీరవాణి గారి ఉవాచ…. సునీత గారి అభిప్రాయాలనే చిలుక పలుకుల్లా అప్పచెప్పారు. పైస్థాయి స్వరాలు పోయినప్పుడు నువ్వు ఫాల్స్ టోన్ లో చేశావు, అలా చేయడం చాలా కష్టం, అయినా నువ్వు బాగా చేశావు., ప్రవస్థి అవస్థ పడ్డా సఫలీకృతురాలవు అయ్యావు…
…. అని చెప్పి రామదాసు సినిమా రికార్డింగ్ అప్పుడు అప్పటికే లెజెండరీ గాయని అయిన సునీత గారు వచ్చి కోరస్ పాడారు అది ఆమె గొప్పదనం అని పొగిడారు…
ఇక మా వరంగల్ వజ్రం చంద్రబోస్ గారి జడ్జిమెంట్ చూద్దాం…. ప్రవస్థీ పాట బాగా పాడావు, ఆఖరిలో వచ్చిన సిరికిం చెప్పడు పద్యం రాగయుక్తంగా బాగానే పాడావు కానీ అందులో ఆర్తి వినబడలేదు అని చెప్పారు… సార్, సార్, ఆ పద్యం గజేంద్రుని రక్షించడానికి పోతున్న విష్ణువును వర్ణించిన పద్యం..,. యుద్ధానికి పోతున్న వారిలో ఆర్తి ఏమిటో… ఈ ఆస్కార్ గ్రహీతకే తెలియాలి. బాలు గారి ఒరిజినల్ పాట విన్నాను, అందులో కూడా ఆర్తి గానీ ఆర్తి అగర్వాల్ గానీ కనబడ లేదు.
కొసమెరుపుగా చరణ్ గారు కూడా ఆ సినిమాలో తనకు కూడా పాడడానికి అవకాశం ఇచ్చిన కీరవాణి గారిని సముచిత రీతిలో పొగిడారు.
ఇలా 10 నిమిషాల పాటలో 4 నిమిషాలు ఒకరికొకరు పొగుడుకోవడంలోనే సరిపోయింది కేవలం రెండు నిమిషాలు అసలు జడ్జిమెంట్ ఇచ్చారు… అదీ సంగతి …ఓం తత్ సత్.
Share this Article