Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విశ్వనాథుడు కదా… జావళి పాటకీ జయమాలినితో డాన్స్ చేయించగలడు…

September 4, 2025 by M S R

ఈ సినిమాలో నాకు బాగా ఇష్టమయింది జయమాలిని జావళి . అద్భుతమైన సాహిత్యం , సంగీతం . వీటికి దీటుగా జయమాలిని నృత్యం . జయమాలిని చేత , మంజు భార్గవి చేత కళావర్షాన్ని కురిపించగల కళాతపస్వి కె విశ్వనాథ్ . ‘‘అంజలిదే గొనుమా ప్రియతమా మంజుల బృందా నికుంజ నిరంజనా’’ . తెలుగీకరించబడిన సంస్కృతం . Telugised Sanskrit . ఇంతటి అందమైన సంగీతాన్ని అందించిన కె వి మహదేవన్ని , పాడిన సుశీలమ్మని స్మరించుకోవాలి .

NTR ఆరాధన సినిమా పోటీలో ఈ విశ్వనాథ్ గారి ప్రేమబంధం సినిమా ఆడలేకపోయిందని చాలామంది చెపుతుంటారు . ఆ పోటీ లేకపోయినా కమర్షియల్ గా సక్సెస్ అయి ఉండేది కాదేమో !! నిస్సందేహంగా చక్కటి సినిమా . ఆరాధన పోటీ లేకపోతే ఇంకొంచెం బాగా ఆడి ఉండేదేమో ! తాసిల్దారి గారి అమ్మాయి , అడవిరాముడు వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన సూర్యనారాయణ , సత్యనారాయణలే 1976 లో వచ్చిన ఈ ప్రేమబంధం సినిమాకు కూడా నిర్మాతలు .

నటనాపరంగా అందరూ బాగా నటించారు . వాణిశ్రీ తన నటనను చూపించగల పాత్ర కాదని నా అభిప్రాయం . ఆమె పాత్రను ఆమె సమర్ధవంతంగానే నటించింది . శోభన్ బాబు చలాకీగా నటించారు . జయప్రద తనకొచ్చిన అవకాశాన్ని బాగానే ఉపయోగించుకుంది . ఈ సినిమాలో గుర్తుండిపోయే పాత్రలు సత్యనారాయణ- షావుకారు జానకిలదే . తాయారమ్మ- బంగారయ్యలు . ఇతర పాత్రల్లో దేవదాస్ కనకాల , సాక్షి రంగారావు , గిరిజ , రావు గోపాలరావు , మాడా ప్రభృతులు నటించారు . రావు గోపాలరావు సాఫ్ట్ విలనిజాన్ని ఈ సినిమాతోనే మొదలయిందేమో ! రివర్స్ విలనిజం . బాధితుల దగ్గర నుండే డబ్బులు వసూలు చేసే విలనిజం .

Ads

‘అంజలిదే గొనుమా’ పాట తర్వాత మెచ్చుకోవలసింది సి నారాయణరెడ్డి వ్రాసిన ‘ఎక్కడున్నాను నేనెక్కడున్నాను’ పాట . బాలసుబ్రమణ్యం , రామకృష్ణ , సుశీలమ్మలు పాడారు . ఈ పాటలో తాయారమ్మ బంగారయ్యలు గొప్పగా నటించారు . అమ్మమ్మా అల్లరి పిడుగమ్మా , ఏ జన్మకైనా ఇలాగే ఉందామా , పువ్వులా నవ్వితే మువ్వలా మోగితే పాటలు శ్రావ్యంగా ఉంటాయి . సాహిత్యపరంగా సి నారాయణరెడ్డి వ్రాసిన ‘పువ్వులా నవ్వితే’ పాట బాగుంటుంది .

ఇంకో పాట ‘చేరేదెటుకో తెలిసి చేరువకాలేమని తెలిసి’ అనే వేటూరి వారి పాట . అ అంటే అమలాపురం , ఆరేసుకోపోయి పారేసుకున్నాను హరీ వంటి శుధ్ధ జనం భాషలో వ్రాసిన వేటూరి వారేనా ఈ చేరువకాలేమని తెలిసి అనే పాటను వ్రాసిందని నాకు అనిపించింది . కవుల కత్తులకు రెండు వైపులా పదును ఉంటాయి . వాళ్ళ మూడుని బట్టి , ముడుపులను బట్టి సాహిత్యం కురుస్తుందేమో !

ఈ సినిమా కధా రచయిత్రి జయలక్ష్మి అని టైటిల్సులో వేసారు . మరి ఇది ఏదయినా నవలా లేక పెద్ద కధా అనేది నాకు తెలియదు . గొల్లపూడి డైలాగులను వ్రాసారు . సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . శోభన్ బాబు , వాణిశ్రీ , సత్యనారాయణ , షావుకారు జానకి అభిమానులు తప్పక చూడవచ్చు ఇంతకుముందు చూడనట్లయితే .

దురదృష్టం ఏమిటంటే జయమాలిని జావళి వీడియో లేదు . కేవలం ఆడియో మాత్రమే ఉంది . సినిమా రంగంతో సంబంధం ఉన్న వారు ఎవరయినా ఆ వీడియోని యూట్యూబులోకి ఎక్కిస్తే కళాభిమానులకు పసందుని కలగచేసినవారు అవుతారు . లేదా టివిలో వచ్చినప్పుడు ఆ జావళిని చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విజయవాడ నాయకులందరికీ నిజంగా ఒక అవమానం…
  • ఆ బిన్ లాడెన్ వారసుడు హమ్జా ఇంకా బతికే ఉన్నాడా ।?
  • మా ఓట్లు పోయినట్లేనా ‘సర్’?
  • AMR … ఈడీ భారీ దాడులపై తెలుగు మీడియా సైలెన్స్ దేనికి..?
  • కొన్ని పుస్తకాలు బయటికి రావు ! ఏ పార్టీ ప్రభుత్వమూ మినహాయింపు కాదు !!
  • AIలో ఫోటో అప్‌లోడ్ చేస్తే అకౌంట్‌లో డబ్బులు పోతాయా? నిజమేంటి?
  • ‘‘ఆ రీసెర్చ్ కోసం- బ్లడ్ క్యాన్సర్ సోకిన నీ కూతుర్ని ఇస్తావా?”
  • 40 స్క్రీన్లకు పడిపోయిన సినిమా… 2,500 స్క్రీన్లకు ఎలా వెళ్లింది?
  • పూలమ్మి పాలమ్మి వేల కోట్లు ఆర్జించిన మల్లారెడ్డి ఫిక్స్..?!
  • బహుశా ఇలాంటి ‘ఘనత’ ప్రపంచంలో కేవలం కేసీయార్ పార్టీకే సాధ్యం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions