.
Subramanyam Dogiparthi ……. అక్కినేనికి అచ్చిరాని రాఘవేంద్రరావు కాంబినేషన్ . రాఘవేంద్రరావు దర్శకత్వంలో ANR మొత్తం అయిదు సినిమాల్లో నటించారు . యన్టీఆర్ కాంబినేషన్లో ఒకటి , సుమంతుతో ఒకటి , నాగార్జునతో రెండు …
సోలో హీరోగా నటించింది ఈ ఒక్క ప్రేమకానుక సినిమాలోనే . ప్రేక్షకులకు మాత్రం నచ్చలేదు . ఆ నాలుగింటిలో రెండు ఏవరేజుగా ఆడితే సత్యం శివం , శ్రీరామదాసు హిట్లయ్యాయి .
Ads
అన్నపూర్ణ స్వంత బేనర్లో వచ్చింది ఈ ప్రేమకానుక సినిమా . ఎయన్నార్ , శ్రీదేవి , మధుమాలినిలు ముగ్గురూ చాలా అందంగా ఉంటారు . పాటల లొకేషన్లు చాలా బాగుంటాయి . పాటలన్నీ రాఘవేంద్రరావు మార్కులోనే చిత్రీకరించబడ్డాయి .
(హేమమాలిని ఫేస్ ఫీచర్లే ఉండే ఈ మధుమాలిని అసలు పేరు రుక్సానా… పలు హిందీ సినిమాల్లోనూ చేసింది… 33 ఏళ్ల వయస్సులో తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది… చివరకు కారణాలు ఏమీ తేల్చలేక కేసు మూసేశారు పోలీసులు…)
ఆత్రేయ సాహిత్యం కూడా చాలా బాగుంటుంది . కేవలం పీల కధ వలనే సినిమా జనానికి నచ్చలేదు . ఈ పుణ్యం గుహనాధన్‌దే . రాఘవేంద్రరావు అంతటి దర్శకుడు , ఎంతో అనుభవం ఉన్న ఎయన్నార్ స్వంత బేనర్ ఏవీ సినిమాను గట్టెక్కించలేకపోయాయి .
తన అక్కను మోసం చేసి , తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన జంతువుల జగన్నాధం మీద కక్ష తీర్చుకోవటానికి హీరో పోలీసు ఆఫీసరయి కక్ష తీర్చుకోవటమే కధాంశం . జగన్నాధం కూతురు శ్రీదేవి . మేనల్లుడు కం గంజాయి స్మగ్లర్ మోహన్ బాబు .
జంతువుల జగన్నాధంగా రావు గోపాలరావు పాత్రని బాగా డిజైన్ చేసారు . ఆయన డైలాగులన్నీ జంతువుల చుట్టూ తిరిగేలా వ్రాసారు సత్యానంద్ . అలాగే మోహన్ బాబు డైలాగులన్నీ గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో తెలుసా అంటూ తాను చెప్పదలచుకున్నవన్నీ చెపుతుంటాడు .
నలభై ఏళ్ల కింద కాబట్టి బతికిపోయింది సినిమా . ఇప్పుడయితే బండి సంజయ్ సినిమా హాళ్ళ ముందు ధర్నా చేయించేవారు . ఈ సినిమాలో తప్పకుండా మెచ్చుకోవలసింది చక్రవర్తి సంగీతంలో శ్రావ్యమైన పాటలు .
ఓ నవ మదనా రావా పాటలో ఆత్రేయ సాహిత్యం , శ్రీదేవి నృత్యం , చిత్రీకరణ చాలా గొప్పగా ఉంటుంది . తప్పక ఆస్వాదించవలసిందే . అలాగే అందంగా ఉంటాయి మిగిలిన అన్ని పాటలూ . అయ్యారే తుంటరోడు ఒయ్యారం సంతకాడ పాట ఎయన్నార్ , మధుమాలినిల మీద ఉంటుంది .
మనసుల ముడి పెదవుల తడి మధువుల జడి ఎద తడబడి , ఆ కొండ కోనల్లో నీరెండ ఛాయల్లో ఈ యెండ మబ్బుల్లో నీవే చాలా శ్రావ్యంగా ఉంటాయి . క్లైమాక్సులో గ్రూప్ డాన్స్ జంతర్ మంతర్ ఆటలాడాలి జమ్మా లకడి దుమ్ము రేగాలి కూడా బాగుంటుంది . ఎయన్నార్ , సుభాషిణి మీద ప్రధానంగా ఉంటుంది . సినిమాలో ఎయన్నార్ స్టెప్పులు , డాన్సులు ఎప్పటిలాగానే బాగుంటాయి .
ఇతర పాత్రల్లో సత్యనారాయణ , ప్రభాకరరెడ్డి , అల్లు రామలింగయ్య , చలపతిరావు , సంగీత దర్శకుడు చక్రవర్తి , మనోరమ , పుష్పలత , తదితరులు నటించారు . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . ఎయన్నార్ , శ్రీదేవి అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే ట్రై చేయవచ్చు .
కళాభిమానులు పాటల వీడియోలను చక్కగా ఆస్వాదించవచ్చు . శ్రీదేవి , మధుమాలినిలు ఇద్దరినీ చాలా అందంగా చూపారు రాఘవేంద్రరావు . ఎందుకనో ఫలపుష్పాలు , కుండలు , బిందెలు వాడలేదు !? #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article