.
ఏమో… ఎప్పుడు ఏ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారో చెప్పలేం… కొన్నిసార్లు స్టార్ కేస్టింగ్ లేకపోయినా సరే జనం థియేటర్లకు వరుసకడతారు… వసూళ్ల వర్షం కురుస్తుంది… సేమ్, ఒక భాషలో హిట్టయిన చిత్రం వేరే భాషలో సేమ్ విజయాన్ని నమోదు చేస్తుందనీ చెప్పలేం… కాకపోతే కంటెంటే సినిమాను నడిపించే అసలు ఆత్మ అనేది మాత్రం సత్యం…
తాజాగా కన్నడంలో ‘ప్రేమద ఊరల్లి’ అనే చిన్న సినిమా సంచలన విజయం నమోదు చేస్తోంది… సెప్టెంబర్ 25 న నానితో పాటే థియేటర్లలో అడుగు పెట్టింది… ట్విస్ట్ ఏంటంటే ఒకరోజు ప్యారడైజ్ 38 వేల టికెట్లు అమ్మితే ప్రేమద ఊరల్లి ఏకంగా 80 వేల టికెట్లు అమ్మిందని ఎక్కడో చదివా… దీన్ని బట్టే ఏ స్థాయి విజయమో అర్థం చేసుకోవచ్చు…
జస్ట్, తొలిరోజున 9 లక్షలే వసూళ్లు… కానీ ఎనిమిదోరోజున అది 3.48 కోట్లు… మౌత్ టాక్… ఆ సినిమా స్థాయికి ఇది విశేషమే… దీంతో ఈ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి ‘ప్రేమనే ఊరిలో’ టైటిల్ తో విడుదల చేశారు… ప్రమోషన్లు పెద్దగా లేవు, హైదరాబాద్ లోనూ పరిమిత షోలతో మాత్రమే రిలీజ్ చేశారు…
Ads
నిజానికి దర్శకుడు మనోజ్ కుమార్ ఎంచుకున్న స్టోరీలో ఎలాంటి కొత్తదనం లేకపోయినా… ఎమోషన్స్ ని ఆవిష్కరించిన విధానం, మనుషుల మధ్య సంబంధాలను చూపించిన తీరు, సునాద్ గౌతమ్ అందించిన చక్కని పాటలు, గ్రామీణ వాతావరణం, నటీనటుల పెర్ఫార్మన్స్ ఇవన్నీ ప్రేమద ఊరల్లిని మంచి కన్నడ మూవీగా మార్చేశాయని కన్నడ రివ్యూయర్లు రాసుకొచ్చారు… కానీ..?
ఓసారి కథేమిటో చెప్పుకుందాం… నాగన్న (రంగాయన రఘు) భార్య మరణాంతరం తన కొడుకు సంతోష్ (శ్రీరామ్)ను కంటికి రెప్పలా పెంచుతాడు. చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం చూసుకుంటాడు సంతోష్. మరోవైపు, అమెరికా నుండి వచ్చిన రుక్మిణి (తపస్విని పూనాచ) బ్రేక్ అప్ కారణంగా డిప్రెషన్లో ఉంటే, ఆమె మాటలకు ఆకర్షితుడైన సంతోష్ ఆమె కోసం ప్రయత్నిస్తుంటాడు…
ఇదిలా ఉంటే, బావ సంతోష్‌ను ప్రాణంగా ప్రేమించే మగరాయుడిలాంటి మరదలు వసంత (రమిక శివు) కథ మరో కోణం. ఊహించని పరిస్థితుల్లో నాగన్న తన కొడుకుకి ఓ ఊహించని బాధ్యత అప్పగిస్తాడు. తండ్రి కోరిక మేరకు సంతోష్ పెళ్లి పీటలు ఎక్కుతాడా? రుక్మిణి ప్రేమ ఏమైంది? నాగన్న దాచిన పాత రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా…
కన్నడ సీనియర్ నటుడు రంగాయన రఘు తన పాత్రకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటన ఫ్యామిలీ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. హీరో శ్రీరామ్, హీరోయిన్లు తపస్విని, రమిక శివు తమ పరిధి మేరకు బాగా నటించారు… అయితే ఈ సినిమా టాక్‌ను బట్టి టాలీవుడ్‌కు ఇది పెద్దగా ఎక్కలేదు అనిపిస్తోంది… ఎందుకంటే..?
సునాద్ గౌతమ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్. కానీ కన్నడంలో మాత్రమే… తెలుగులో కాదు… పచ్చని పల్లెటూరి వాతావరణం, గ్రామీణ లొకేషన్స్ కంటికింపుగా ఉంటాయి. కానీ దర్శకుడు ఎంచుకున్న ప్లాట్ చాలా పాతది. కొత్తదనం లేకపోవడం నేటి టాలీవుడ్ ప్రేక్షకులకు కాస్త బోర్…
ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సిల్లీ కామెడీ సీన్లు, సెకండ్ హాఫ్‌లో భార్యాభర్తల మధ్య వచ్చే సన్నివేశాలు కొంచెం సాగదీసినట్లు అనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ కొన్ని చోట్ల లిప్ సింక్ కాకపోవడం మరో మైనస్… కన్నడ ప్రేక్షకులకు ఆ నూతన వాతావరణం, నేటివిటీ బాగా నచ్చి ఉండవచ్చు. కానీ మన టేస్ట్ వేరు. ఇక్కడ యాక్షన్, కమర్షియల్ హంగులు లేకపోతే చిన్న సినిమాలను రిసీవ్ చేసుకోవడం కాస్త కష్టమే…
Share this Article