Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రామోజీరావు టేస్టున్న మూవీస్ నిర్మిస్తున్న ఆ కాలంలో… ఓ ముత్యం..!!

July 25, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ...... రాజేంద్రప్రసాద్ సోలో హీరోగా నటించిన మొదటి సినిమా ఇదేనేమో ! కామెడీ కం రొమాంటిక్ ట్రాకుతో ఓ చక్కని సందేశాన్ని కూడా అందించిన వంశీ సినిమా ఈ ప్రేమించు పెళ్ళాడు .

అంతే కాదు ; గోదారి అందాలను , భానుప్రియ కళ్ళందాలనీ అద్భుతంగా చూపించిన సినిమా కూడా . ఇళయరాజా , వేటూరి , బాలసుబ్రమణ్యం జానకమ్మల మోస్ట్ మెలోడియస్ వాయిస్లను అందించిన సినిమా . అయినా బాగా ఆడలేదని , ఆత్మహత్య కూడా చేసుకుందామని అనిపించిందని ఓ ఫంక్షన్లో రాజేంద్రప్రసాదే చెప్పాడు .

Ads

ఆ ఆత్మహత్య ఏమో కానీ ఈ సినిమా లోని ఈ చైత్ర వీణ ఝంఝమ్మని పాట షూటింగులో బొంగులు మీదుగా నడుచుకుంటూ వచ్చి భానుప్రియకు పూలను ఇచ్చే సన్నవేశం షూటింగులో రాజేంద్రప్రసాద్ బేలన్స్ తప్పి గోదార్లో పడిపోయాడు . షూటింగ్ చూస్తున్న పడవ వాళ్ళు రక్షించారని వంశీయే చెప్పారు . ఆ రోజంతా
షాకులోనే ఉండిపోయాడట రాజేంద్రప్రసాద్ .

సాంప్రదాయాలు , ఆచారాల విషయంలో చాలా పట్టుదల కల కూర్మావతారం గారికి ఒక కొడుకు , ముగ్గురు కూతుళ్లు ఉంటారు . మూడో కూతురు ఒక క్రిస్టియన్ని ప్రేమించి , ఇంట్లో నుంచి గెంటివేయబడి , బయటకెళ్ళి పెళ్ళి చేసుకుంటుంది . ఆమె కూతురు తాత మనసుని మార్చి మేనబావని పెళ్ళి చేసుకునే ప్రయత్నంలో నర్సుగా ముసలాయన దగ్గరకు చేరుతుంది .

నర్సమ్మ మీద మనసు పారేసుకుంటాడు హీరో రాజేంద్రప్రసాద్ . హీరో గారికి , తాత గారికి నిజం చెప్పేస్తుంది హీరోయిన్ . ససేమిరా కాదంటాడు కూర్మావతారం గారు . మాటామాటా పెరుగుతుంది . సాంప్రదాయాల గురించి గొడవ అవుతుంది . ఆ క్రమంలో కూతుళ్ళ కాపురాలను చూడటానికి బయలుదేరుతాడు హీరోహీరోయిన్లతో కలిసి .

bhanupriya
ఇద్దరి కూతుళ్ళ కాపురాలు ఆధునిక నాగరికత , అలవాట్లు , బలహీనతల సుడిగుండంలో దర్శనమిస్తాయి . ఇప్పుడు కనుక ఈ సీన్లని యధాతధంగా చూపిస్తే థియేటర్ల ముందు ఆందోళనలు , నిరసనల వరద పారుతుంది . అసలు సెన్సార్ సర్టిఫికెట్ కూడా రాదేమో !

మళ్ళా సినిమాలోకి వద్దాం . ఇద్దరి పెద్ద కూతుళ్ళ కాపురాలు చూసాక తాతని తమ ఇంటికి కూడా తీసుకుని వెళుతుంది హీరోయిన్ . ప్రాంగణంలోకి వస్తూనే అక్కడి సాంప్రదాయ పధ్ధతులను చూసి ఫిదా అయిపోతాడు కూర్మావతారం . తండ్రి క్రిస్టియన్ అయినా తల్లి పిల్లలను పూర్తి హిందూ సాంప్రదాయాలతో , ఆచారాలతో పెంచుతుంది .

క్రిస్టియన్ భర్త ఎలాంటి అభ్యంతరం చెప్పడు తన పిల్లల్ని పూర్తి హిందూ పధ్ధతులలో పెంచుతున్నందుకు . ఇలాంటి జంటలు నిజ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి . నాకూ తెలుసు . కులాంతర జంటలే కాదు ; మతాంతర జంటలు కూడా చక్కగా కాపురాలు చేసుకోవటం నాకు తెలుసు .

bhanupriya
సాంప్రదాయాల కన్నా , ఆచారాల కన్నా , మతం కన్నా మానవత్వం , సదాలోచన గొప్పవి అనే వాయిస్ ఓవరుతో రాజేంద్రప్రసాద్ భానుప్రియ , శుభలేఖ సుధాకర్ తులసిల పెళ్ళిళ్ళతో సినిమా ముగుస్తుంది . 1985 లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ ఎలా ఉన్నా ఓ క్లాసిక్ అని చెపుతాను .

వంశీ సినిమా కాబట్టి అతని మార్క్ టేకింగే కనిపిస్తుంది . గోదావరి , రాజమండ్రి , చుట్టుపక్కల గ్రామాల అందాలను ఆస్వాదించవచ్చు .

ముఖ్యంగా చెప్పుకోవలసింది ఇళయరాజా సంగీత దర్శకత్వంలో శ్రావ్యమైన పాటలు . గోపెమ్మ చేతిలో గోరుముద్ద రాధమ్మ చేతిలో వెన్న ముద్ద పాట చిత్రీకరణ చాలా అందంగా ఉంటుంది . రాఘవేంద్రరావు ఫలపుష్పాలు , బిందెలను ఎగరేస్తే వంశీ కంచాలను ఎగరేస్తాడు ఈ పాటలో . ఎగరేస్తే ఎగరేసాడు చిత్రీకరణ బాగుంటుంది .

bhanupriya
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం , ఈ చైత్ర వీణ ఝంఝమ్మని , నిరంతరము వసంతములె పాటలు చాలా చాలా శ్రావ్యంగా ఉంటాయి . గొప్ప రస ప్రపంచం లోకి ఎత్తుకుపోతాయి . సంగీత ప్రియులకు పెద్ద ఫీస్టే ఈ పాటలు . ఈ పాటల్ని ఇంత గొప్పగా లెన్సులో బిగించిన యం వి రఘుని , అందంగా కంపోజ్ చేసిన నృత్య దర్శకుడు శేషునీ తప్పక అభినందించాలి . గణేష్ పాత్రో డైలాగులు పదునుగా ఉంటాయి .

కూర్మావతారంగా సత్యనారాయణ అద్భుతంగా నటించారు . సినిమాకు షీరో భానుప్రియే . శుభలేఖ సుధాకర్ హిలేరియస్ నటన బాగుంటుంది . అతని సైకిలూ ఓ పాత్రధారే ఈ సినిమాలో . అతనికి సరయిన జోడీగా తులసీ బాగా నటించింది .

వై విజయ ఉన్నా ఆమెది సాదాసీదా పాత్రే . ఆమె లెవెల్ పాత్ర కాదు . రాళ్ళపల్లి , సుత్తి వీరభద్రరావులవి మంచి పాత్రలు . ఇతర పాత్రల్లో కాకినాడ శ్యామల , డబ్బింగ్ జానకి , అనిత , రాధాకుమారి , భీమేశ్వరరావు , హేమసుందర్ , ప్రభృతులు నటించారు .

rajendra prasad
జొన్నలగడ్డ రామలక్ష్మి నవల తులసి తీర్ధం ఆధారంగా 22 లక్షల బడ్జెటుతో తీయబడింది . రాజమండ్రిలోని లూథరన్ హాస్పిటల్ , గోదారి వెంట వీధులు , ఇసుక తిన్నెలు , పడవలు చూడొచ్చు . సినిమా ఈటివి విన్లో ఉంది .

రస హృదయులకు నచ్చుతుంది . పాటల్ని మాత్రం ఎవరూ మిస్ కావద్దు . భానుప్రియ అభిమానులు తప్పక చూడాలి . రామోజీరావు గారి సినిమా కాబట్టి అప్పుడప్పుడు ఈటివిలో వస్తుంటుంది . నేను ఈటివిలో వచ్చినప్పుడే చూసా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions