.
శుభం పలకరా పెళ్ళికొడకా! అంటే ఆ పెళ్ళికొడుకు అనకూడని మాట అనడంతో జరగకూడని అనర్థం జరిగిందని అనాదిగా సామెత చెబుతూనే ఉంది.
భారతదేశంలో అత్యంత సంపన్నుల ఇళ్ళల్లో పెళ్ళి నిశ్చయమైనప్పుడే… ఒకవేళ విడాకులు తీసుకుంటే పంపకాలకు సంబంధించి కూడా ఒక మాట అనుకుని… ఆ ఒప్పందాన్ని రిజిస్టర్ చేయిస్తున్నారు.
Ads
పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలున్న కుటుంబాల్లో సంసారం సజావుగా సాగితే పరవాలేదు కానీ… మనస్పర్ధలొచ్చి భార్యాభర్తలు విడిపోతే కంపెనీ ఆస్తులను కూడా విభజించాల్సి వస్తోంది. దాంతో దశాబ్దాల కంపెనీలు రోడ్డున పడుతున్నాయి.
బ్రాండ్ విలువ పోతోంది. పెట్టుబడిదారుల్లో నమ్మకం పోతోంది. చివరకు కంపెనీ మనుగడే ప్రశ్నార్థకమవుతోంది. దాంతో సంపన్న పారిశ్రామికవేత్తలు నిశ్చితార్థమప్పుడే శుభ ప్లస్ అశుభం కలిపి సవర్ణదీర్ఘసంధిగా శుభాశుభాలు రెండూ ఓపెన్ గా, స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు.
# ఈ పెళ్ళి పెటాకులైతే భరణంగా నీకు దక్కేది ఇంతే అని కాగితం మీద లెక్కలు రాసి చూపిస్తున్నారు. అంతకుమించి అడగను అని అమ్మాయి/అబ్బాయి చేత ముందే ఒప్పందపత్రాలమీద సంతకాలు చేయించుకుని వాటిని స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్టర్ కూడా చేయిస్తున్నారు. (ఇంట్లో, కంపెనీ బోర్డు మీటింగుల్లో బోర్డులుగా కూడా పటం కట్టి వేలాడదీస్తున్నారేమో!) (వీటి చట్టబద్ధత, చెల్లుబాటు డిబేటబుల్)
# ఈ పెళ్ళి జరిగి… పిల్లలు పుట్టి… విడిపోతే… పిల్లల పోషణ, వారికి ఆస్తిలో వాటాల లెక్కలు కూడా నిశ్చితార్థం రౌండ్ టేబుల్ మీదే సుహృద్భావ వాతావరణంలో ఇరుపక్షాలవారు నీళ్ళునమలకుండా మాట్లాడుకుని… అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు.
# విడిపోతే సొంత ఆస్తుల్లో తప్ప కంపెనీల ఆస్తుల్లో వాటా అడగను అని మరికొంతమంది ఉదారంగా వ్యవహరిస్తున్నారు.
# ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్లలా ఆఫ్టర్ డైవోర్స్ సెటిల్మెంట్ అడ్వైజర్ల కొత్త వృత్తి పుట్టుకొచ్చింది. చేతులు కాలాక విడాకులు పట్టుకుని ప్రయోజనం లేదన్న ఎరుకతో… చేయి చేయి కలవక ముందే… కొంగూ కొంగూ ముడివేయక ముందే… అగ్నిసాక్షిగా ఏడడుగులు నడవకముందే… సంసారంలో అగ్గి రాజుకుని… ఒక్కడుగు కూడా కలిసి నడవలేని సందర్భాన్ని ముందే అంచనా వేసి అన్ని ఏర్పాట్లు, రాతకోతలు చేసుకుంటున్నారు.
# సంపన్నులు, పారిశ్రామికవేత్తల కుటుంబాల్లోనే కాదు. మొత్తం భారతీయ సమాజంలోనే విడాకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంకా పెరుగుతుంది. దానికి కారణాల చర్చ ఇక్కడ అనవసరం…
# మనసులు కలవనప్పుడు విడిపోతేనే నయమన్న వాదనకు అంగీకారం, ఆమోదం దొరుకుతోంది. విడిపోతే ఏమిటి? ఎలా? అన్నవి నిశ్చితార్థమప్పుడే మాట్లాడుకోవడం కూడా ఒక ఆచారంగా, లీగల్ ప్రొసీజర్ గా మారిన రోజుల్లో ఉన్నాం!
బ్రేకప్ పార్టీలు ధూమ్ ధామ్ సెలెబ్రేషన్స్ గా జరుగుతున్నప్పుడు… ఎంగేజ్మెంట్ వేళ… పెళ్ళి పెటాకులైతే అన్న ముందు జాగ్రత్తతో చేసుకునే విడాకుల ఒప్పందాల కార్యక్రమాన్ని కూడా ధూమ్ ధామ్ గా, అధికారికంగా, లీగల్ గా, శాస్త్రీయంగా నిర్వహించుకోవడాన్ని ఎలా తప్పుపట్టగలం?
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article