.
“రైటర్ గారూ.. మీరు ఏ కాలానికి తగ్గ కథలు ఆ కాలంలో రాస్తారని ఫిలింనగర్లో టాకు విని మీ దగ్గరకు వచ్చాం.. మేమో సినిమా తీసి పడేద్దాం అనుకుంటున్నాం.. కథ చెప్పండి ”
“రండి మాష్టారూ రండి, సరైన చోటికే వచ్చారు.. కథ చెప్పేముందు మందు ఏం తీసుకుంటారు.. బ్రాందీ.. విస్కీ.. ఓడ్కా ”
“అబ్బే అవేం వద్దండి.. కథా..?”
“సరే.. పోనీ గుట్కా.. ఖైనీ.. పాన్ పరాగ్ ఏవన్నా?”
“అబ్బే అవేం వద్దండి.. కథా??”
“పోనీ LDS లాంటిదేవన్నా కొంచెం పుచ్చుకుంటారా ?”
“వద్దు మహాప్రభో.. ముందు కథ చెప్పండి”
Ads
“మాష్టారూ.. మీరు బొత్తిగా అప్ డేట్ అయినట్టులేరు.. ఈకాలంలో కథలన్నీ వీటితోనే మొదలుతున్నాయి కదా.. సరే కథ చెప్తా వినండి .. ఓపెనింగ్ సీన్ తోనే కనక వర్షం కురుస్తుంది ”
“చెప్పండి.. చెప్పండి”
“హీరో చిన్నతనంలోనే పనిమనిషిని పాడు చేసి ఇంట్లో నుంచి పారిపోతాడు”
“ఆగండాగండి.. మీరు పొరపడుతున్నారు.. విలన్ అనబోయి హీరో అన్నట్టున్నారు”
“లేదు మాష్టారూ.. నేను హీరో ఇంట్రడక్షన్ సీనే చెప్పాను”
“తర్వాత?”
“హీరో పారిపోయి అండమాన్ దీవుల్లోకి చేరుకుంటాడు ?”
“ఎందుకూ చేపలు పడతాడా?”
“కాదు.. స్మగ్లింగ్”
“అక్కడేం స్మగ్లింగ్ చేస్తాడూ నా తలకాయ్”
“మాష్టారూ మీరు కథ మొత్తం వినండి.. షాక్ అవుతారు”
“షాక్ ట్రీట్మెంట్లు వద్దు కానీ కథ చెప్పండి ”
“అక్కడ హీరోకి మంగమ్మ పరిచయం అవుతుంది”
“మంగమ్మ ఎవరూ?”
“హీరోయిన్ అన్నమాట ”
“అక్కడ మంగమ్మకేం పనీ?”
“బట్టలు ఉతుకుతుంది”
“ఓహో.. తర్వాత ”
“ఓ పాట ”
“అబ్బ మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం .. పాట అదే కదా ”
“సూపర్ మాష్టారూ మీరు కూడా కథలోకి వచ్చేస్తున్నారు.. ఆ.. మనం ఎక్కడున్నాం ?”
“అండమాన్ చాకి రేవులో ”
“ఎస్ పాట అయిపోతుండగా ఫహాద్ వస్తాడు”
“వీడెవడు?”
“ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్ ”
“ఓహో ”
“అలా హీరో కి డ్రగ్ మాఫియాకు డీల్ కుదిరి హీరో బిజినెస్ మొదలుపెడతాడు”
“అవునూ విలనేడీ?”
“ఉండండి మాష్టారూ ఇంకా హీరో ఎలివేషన్ అవలేదు.. మెల్లిగా హీరో ఫహాద్ ని యేసేస్తాడు”
“ఎందుకూ ?”
“డ్రగ్ మాఫియాకు హీరో డాన్ అవుతాడు.. ఇప్పుడు ఇంకో పాట”
“మంగమ్మతోనా ?”
“కాదు.. తమన్నాతో ”
“ఖర్చులు బొక్కేమో?”
“మాష్టారూ.. మీరింకా ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు లేదు.. ఖాళీగా ఉన్న సీనియర్ హీరోయిన్ కు రెండు కర్చీఫ్ లు ఇచ్చి శివమణితో డ్రమ్ములు బాదించి పిల్లను ఎగరేసామంటే మీరు ఏరుకోలేనంత పైసలే పైసలు”
“ఓహో ఇలా కూడా ఏరుకోవచ్చా.. బావుంది.. తర్వాత?”
“మెల్లిగా హీరో బిజినెస్ పుంజుకుని నేషనల్ కాస్తా ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎదుగుతుంది”
“ఆహా ”
“ఇప్పుడు రావు రమేష్ మంగమ్మని కిడ్నాప్ చేస్తాడు ”
“రావు రమేష్ ఎవరు ?”
“ఎస్పీ ”
“ఏంటీ ఎస్పీ హీరోయిన్ను కిడ్నాప్ చేస్తాడా? ఇదేదో తేడాగా ఉందేంటీ?”
“ఆగండి మాష్టారూ స్టోరీలో అసలు ట్విస్టు ఇక్కడే ఉంది ”
“ఏంటదీ?”
“ఆ.. ఆశ దోశ ఇప్పుడే చెప్పేస్తారేంటీ ? అదేంటో పార్ట్ 2 లో చెబ్దాం.. వింటున్నారా? మాష్టారూ.. మాష్టారూ.. ఏంటి వీడు పడిపోయాడు.. కొంపదీసి నిజంగా షాక్ అయ్యాడా పిచ్చవెధవ.. ఆయినా ఈ కాలంలో కూడా ఇంకా ఆ పాత తరం వాడిలా ఉంటే ఎలా?.. అప్ డేట్ అవ్వాలబ్బా.. మొదటిరోజు వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని చూసే వెర్రి పుష్పాలు ఉన్నంతకాలం మనకు కథలకు లోటేంట్రా బాబూ”….. పరేష్ తుర్లపాటి
Share this Article