- దిశ… మా పేరు వాడుకుంటూ, ఫేక్ పోస్టుల్లో మా లోగో వాడుతూ మమ్మల్ని బదనాం చేస్తున్నారు… మా జనాదరణను దెబ్బతీసే కుట్ర…. మేం న్యూట్రల్… మేం సూపర్… మేం ప్యూర్… ప్యూరర్, ప్యూరెస్ట్ తెలుసా… ఇది ఒక ఫస్ట్ పేజీ బ్యానర్ వార్త…
- వెలుగు… మా ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్‌లో ఎవరో కుట్టుమిషన్లు గట్రా రవాణా చేసుకుంటుంటే, హుజూరాబాద్ ఓటర్ల కోసమేనని టీన్యూస్ బదనాం చేస్తోంది,.. కుట్ర… మా జనాదరణను దెబ్బతీసే కుట్ర… ఇది మరో ఫస్ట్ పేజీ బ్యానర్ వార్త… ఓ వివాదం…
- తొలివెలుగు రవిప్రకాష్ మీద ఎన్టీవీ ఏదో కుట్ర చేస్తోందని కేసు… మమ్మల్ని బదనాం చేస్తున్నారంటూ ఎన్టీవీ ఎడిటర్ ఉల్టా కేసు… మధ్యలో నా పేరెందుకు వాడుకున్నారురా అంటూ తెలుగుగేట్‌వే సైటు వాసిరెడ్డి శ్రీనివాస్ గగ్గోలు… ఇది మరో వివాదం… రెండుమూడు రోజులుగా ఫుల్ క్యాంపెయిన్లు…
………. తన్నుకుంటున్నారు… తిట్టుకుంటున్నారు… కేసులు పెట్టుకుంటున్నారు… సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు… అయితే ఇక్కడ ప్రతిచోటా కామన్ సెన్స్ లోపించినట్టు స్పష్టం… ఎవడో ఫేక్ పోస్టులు పెట్టి సొమ్ము చేసుకునేవాడు దిశ పేరు వాడుకుంటాడు… అంటే ఇక్కడ దిశను అన్ పాపులర్ చేయాలని కాదు కదా… ఆ పేరుతో జనం నమ్మాలని ఏవో ఫేక్ పోస్టులు… అంతే తప్ప, అక్కడ దిశ అనేది టార్గెట్ కాదు… అది దిశ వాడికి అర్థం కాదు… నీ పేరు వాడుకుంటున్నారు అంటే ఆ ఫేకర్లు నీకు సర్టిఫికెట్ ఇస్తున్నారురా బాబూ అన్నా అర్థం చేసుకునే స్థితిలో అది లేదు… కానీ ఈ ఫేక్ వార్తల్ని చూపించి, చూశారా, మాకు మస్తు క్రెడిబులిటీ ఉంది, మస్తు ఆదరణ ఉంది, అందుకే అందరూ కుట్రలు పన్నుతున్నారు అంటూ ఓ ప్రచారం… ఫాఫం…
సేమ్, వెలుగు… నీ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్స్‌లో ఎవరో కుట్టుమిషన్లు పంపించారు అని టీన్యూస్, నమస్తే ప్రచారం చేస్తే… అది వెలుగును దెబ్బతీసే కుట్ర కాదు, ఈటల రాజేందర్‌ను ఇరుకునపెట్టడం, బదనాం చేయడం, ఏదో జరిగిపోతోందని జనం కళ్లకు గంతలు కట్టడం… అంతే తప్ప, వెలుగును చీకటి చేసే ప్రయత్నమూ కాదు, ఆలోచనా కాదు… వెలుగును ఆర్పేస్తే హుజూరాబాదులో అకస్మాత్తుగా గెలుపు వరమాల వేస్తుందనీ కాదు… అదొక స్ట్రాటజీ… టీఆర్ఎస్ నియమించుకున్న సోషల్ మీడియా టీమ్స్ ప్రొఫెషనల్‌గా చేసే ఫేక్ క్యాంపెయిన్…
Ads
ఎక్కడో జుబ్లీహిల్స్ కోఆపరేటివ్ సొసైటీ అక్రమాలపై బోలెడన్ని ఆరోపణలు… టీవీ5, ఎన్టీవీ తన్నుకోవడానికి సిద్ధమై, ఎవరో పెద్దమనుషులు రాజీ కుదిర్చితే… అది కాస్తా మాజీ టీవీ9 రవిప్రకాష్, తొలివెలుగు మీదకు మళ్లింపా..? ఇవేకాదు… ఎవరైనా ఏమైనా సోషల్ మీడియాలో రాస్తే చాలు, ఆయా పార్టీల సోషల్ మీడియాలు బూతులతో, వ్యక్తిగత నిందలతో విరుచుకుపడే నీచ్ కమీన్ కార్యాచరణ… ఈ గ్రూపులకూ కోట్ల ఖర్చు… ఈనాడు మీద సాక్షి, సాక్షి మీద జ్యోతి, జ్యోతి మీద సాక్షి, తెలంగాణలో నమస్తే మీద జ్యోతి, జ్యోతి మీద నమస్తే, మధ్యలో వెలుగు… చాలారోజులుగా ఉన్నదే… ఏముందీ..? ఎప్పుడైతే మీడియా సంస్థలు పార్టీల అనుబంధ విభాగాలు అయిపోయాయో.., ఈ నీచమైన జర్నలిజం, కౌంటర్లు, ఎన్‌కౌంటర్లు చదవాల్సి వస్తోంది, చూడాల్సి వస్తోంది… ఇది ఆయా సంస్థల సిబ్బంది తప్పు కాదు, జర్నలిజం మరింతగా భ్రష్టుపట్టే క్షుద్రయజ్ఞంలో… తమ పొట్టతిప్పల కోసం పడే పాట్లు… ఒకప్పుడు పార్టీలు మీడియా కరుణ కోసం పాకులాడేవి… ఇప్పుడు జర్నలిజం పార్టీలు, నాయకుల పాదాల దగ్గర పడి దేకుతోంది… అంతే తేడా…
అసలు మీడియాకన్నా సోషల్ మీడియా మరీ ప్రమాదకరం ఇప్పుడు… వాట్సప్ గ్రూపులు, ఫేస్‌బుక్ పేజీలు… అన్నీ మెజారిటీ ఫేక్ ఖాతాలు… ఫేక్ పోస్టులు… భజనలు, బూతులు… ప్రజల మెదళ్లలోకి విషం వేగంగా ఎక్కించబడుతోంది… నిజమో, అబద్ధమో ఎవడు చూడొచ్చాడు..? బురద జల్లామా లేదా… జనంలోకి వెళ్లిందా లేదా..? కడుక్కోవడం బాధితుడి తల్నొప్పి… వాడు లబోదిబో… అనివార్యంగా ఈరోజు ప్రతి నాయకుడూ, ప్రతి పార్టీ సోషల్ టీమ్స్ ఏర్పాటు చేసుకుని, తామూ ఫేక్ కౌంటర్లకు, ఫేక్ ఎన్‌కౌంటర్లకు దిగడమే గతి… లేకపోతే కొట్టుకుపోతారు… మన మూర్ఖజనం ఉన్నారు కదా… వాట్సపులో వస్తే చాలు, నమ్మేయడమే, షేర్ కొట్టడమే… నిజాయితీగా ఓమాట చెప్పుకోవాలి… ఈ రుగ్మతకు చికిత్స కనిపెట్టకపోతే… అడ్డుకట్ట వేయకపోతే… అది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు… కేన్సర్ మూడో స్టేజీకో, నాలుగో స్టేజీకో వచ్చాక ఎవడూ చేసేదేమీ ఉండదు… బహుపరాక్…
విచక్షణ మరిచి ఆమధ్య న్యాయమూర్తుల మీద నీచమైన కామెంట్లు పెట్టినందుకు వైసీపీ క్యాంపు సీబీఐ కేసుల్ని ఎదుర్కొంటోంది… ఏదో జరుగుతుందని, ఉరితీస్తారని కాదు… దీనికి రెండు కోణాలు… ఒకటి సంయమనం లేని సోషల్ క్యాంపెయిన్స్… రెండు దీన్నెలా కంట్రోల్ చేయాలో అర్థం కాని రాజ్యాంగవ్యవస్థలు… అంతెందుకు..? ట్రంపు గెలిచినప్పుడూ, ట్రంపు ఓడినప్పుడూ సోషల్ మీడియా ప్రభావం, బాట్ పోస్టులు ఎంత పనిచేశాయో తెలుసు కదా… మనం కూడా ఆ ఊబిలోకి జారిపోతున్నామా..!! కాంగ్రెస్ ఖాతాల్ని ప్రస్తుతం ట్విట్టర్ బ్యాన్ చేసింది… అంతకుముందు ఇలాంటి చర్య మీదే బీజేపీ నేతలు ట్విట్టర్ మెడ మీద కత్తిపెట్టి బెదిరించారు… సో, ఒక రుగ్మతతో అందరూ ఆడుకుంటున్నారు తమ స్వార్థం కోసం… అంతే తప్ప, అది అందరినీ మింగేస్తుందనే తెలివి లేకుండా పోయింది… అదీ అసలైన విషాదం…!!
Share this Article