.
Subramanyam Dogiparthi....
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ , ఏయన్నార్ గారితో ఎన్నో హిట్ సినిమాలను నిర్మించిన సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బేనరుపై నిర్మించబడిన సినిమా 1987 మే మాసంలో వచ్చిన ప్రెసిడెంట్ గారి అబ్బాయి .
బాలకృష్ణ జైత్రయాత్రలో మరో హిట్ సినిమా ఇది . ఈ సంస్థ అధినేత ఏ వి సుబ్బారావు యన్టీఆర్ హీరోగా ఒక్క సినిమా కూడా తీయలేదు . ఆయన వారసుడు బాలకృష్ణతో ఈ సినిమాను తీసారు .
Ads
పూనాదిపాడు అనే గ్రామంలో రెండు మోతుబరి కుటుంబాలు . ఒక కుటుంబ పెద్ద సత్యనారాయణ , మరో కుటుంబ పెద్ద జగ్గయ్య . బంధువులు కూడా . సత్యనారాయణ పెద్ద కూతురు జగ్గయ్య రెండో కోడలు . మరో కూతురు హీరోయిన్ సుహాసిని . పొగరుబోతు . జగ్గయ్య చిన్న కొడుకు బాలకృష్ణకు జోడీ . ముందు ఒకరినొకరు చీదరించుకున్నా తర్వాత గాఢ ప్రేమికులు అయిపోతారు .
రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు , ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి . ఆ గొడవల్లో హీరో మీద పోలీస్ కేసు పడటం , హీరోయిన్ కోర్టుకొచ్చి తండ్రి , అన్నలకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడంతో హీరో బయటపడతాడు .
చెల్లెలి కాపురాన్ని నిలబెడతానికి పందెం కట్టి గెలుస్తాడు హీరో . అన్న కొడుకుని చంపటంతో రెచ్చిపోయిన హీరో విలన్లనందరినీ వాయించేసి పోలీసులకు అప్పచెప్పటంతో శుభం కార్డు పడుతుంది .
బాలకృష్ణ పాత్ర చాలా హుషారుగా ఉంటుంది . పందేలరాయుడిగా పేరు సంపాదించుకుంటాడు . అతనికి పోటాపోటీగా సుహాసిని కూడా చాలా హుషారుగా నటించింది . బాలకృష్ణ సుహాసిని జోడీ కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది .
గ్రామీణ నేపధ్యం , రెండు పెద్ద కుటుంబాలు కావటం వలన భారీ తారాగణం ఉంది సినిమాలో . జగ్గయ్య , అన్నపూర్ణ , ఈశ్వరరావు , సుధాకర్ , వై విజయ , పరుచూరి వెంకటేశ్వరరావు , రాజ్యలక్ష్మి , నిర్మలమ్మ , రాజ్ వర్మ , నూతన్ ప్రసాద్ , సాక్షి రంగారావు , రమణారెడ్డి , రాజేష్ , రాంజీ , వంకాయల , కాకినాడ శ్యామల , కుయిలీ , వరలక్ష్మి , మాస్టర్ రాజేష్ , తదితరులు నటించారు .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో బాగుంటాయి . బాలకృష్ణ సుహాసిని డ్యూయెట్లు ఎనర్జిటిగ్గా ఉంటాయి . చెక్కం చెక్కం చెక్కా , సిత్రాంగి పిలిచింది సారంగుడో , ముద్దు పెట్టమంటే డ్యూయెట్లు బాగుంటాయి .
జగ్గయ్య ఎన్నికల్లో గెలిచాక వచ్చే గ్రూప్ డాన్స్ పాట ఎగిరింది ఎగిరింది తెలుగు జెండా బాగా చిత్రీకరించబడింది . కుయిలీ ఐటమ్ డాన్స్ యాడ నుండి వస్తే నీకెందుకు హాటుగా ఉంటుంది . పాటలన్నీ వేటూరే వ్రాసారు . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ వాటిని వినిపించారు .
పరుచూరి బ్రదర్స్ బాలకృష్ణ కోసమే నేసిన కధ . డైలాగులు కూడా బాలకృష్ణ మార్కే . సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు దర్శకత్వం వహించారు . ఫక్తు కమర్షియల్ , రొమాంటిక్ , ఫీల్ గుడ్ ఎంటర్టయినర్ . బాలకృష్ణ అభిమానులకు బాగా నచ్చుతుంది . చూసి ఉండకపోతే వాచ్ లిస్టులో పెట్టుకోండి . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
(కుయిలి అప్పట్లో ఐటమ్ సాంగ్స్ చేసేది… ఆమె పేరు వినగానే సముద్రం మీద, వెన్నెల్లో నాయకుడు సినిమాలో చలాకీ చిన్నది ఉంది అనే ఐటమ్ సాంగ్ గుర్తొస్తుంది… ఆరేడేళ్లు ఇలా సినిమాల్లో క్లబ్ డాన్సులు గట్రా చేసి, తరువాత టీవీకి షిఫ్టయింది… సిల్క్, డిస్కో, జయమాలిని, జ్యోతిలక్ష్మి వంటి ఐటమ్ గరల్స్‌తో పోలిస్తే కుయిలి పెద్దగా వాటిల్లోనూ క్లిక్ కానట్టే లెక్క..)
Share this Article