.
ఈరోజు నాకు బాగా నచ్చిన వార్త… ఫోటో… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంతూరికి వెళ్లిన వార్త… అక్కడ తనకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువుకు శాలువా కప్పి, వంగి, వినయంగా దండం పెడుతున్న ఫోటో…
ఎంత పాజిటివ్ వైబ్స్ సమజంలోకి పంపిస్తుందో ఈ వార్త ఒక్కసారి ఆలోచించండి… క్షుద్ర రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చే మన తెలుగు మీడియాకు సహజంగానే పట్టలేదు… (సాక్షిలో మాత్రం కనిపించింది ఈ వార్త…)
Ads
నిన్ననే కదా మనం చెప్పుకున్నది ఓచోట ఇద్దరు విద్యార్థులు గురువుపై దాడి చేస్తే, ఆ షాక్‌లో, ఆ అవమానం భరించలేక అక్కడే కన్నుమూశాడు ఆ గురువు… గురువులపై వెటకారాలు, దాడుల ఫుల్లు నెగెటివ్ వాతావరణంలో… ఒక రాష్ట్రపతి ఆ పల్లెటూరిలో ఆనాటి తన గురువుకు ప్రణమిల్లే ఫోటోకు నిజంగా ఎంత ప్రాధాన్యం దక్కాలి..? రాష్ట్రపతి అయితేనేం, ఓ గురువుకు శిష్యురాలే కదా…
(ఆమధ్య ఉపరాష్ట్రపతి ధనకర్ కేరళలోని ఓ ఊరికి తన టీచర్‌ను వెతుక్కుంటూ వెళ్లిన వార్త గుర్తొచ్చింది… వీలైతే లింక్ ఇక్కడే పెడతాను… https://muchata.com/vice-president-met-his-teacher-in-kerala-to-get-blessings/ )
ఆమెది ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా, ఉపర్‌బేడ గ్రామం… రాష్ట్రపతి అయ్యాక తొలిసారి వచ్చింది… ఆమె రాకను ఆ ఊరు తమ బిడ్డ పుట్టింటికి వచ్చినట్టుగా సంబురాలు చేసుకుంది… అన్ని ప్రోటోకాల్స్ పక్కన పెట్టి… పెద్దలకు నమస్కరించింది… డాన్సుల్లో కాలు కదిపింది… పిల్లలు ఏం చదువుతున్నారో కనుక్కుంది… ఊరికి ఏ సాయం కావాలన్నా చేస్తాను అని భరోసా ఇచ్చింది…
‘‘మూడో తరగతి చదువుతున్నప్పుడు పెన్ను లేదు, కొనివ్వమని నాన్నను అడిగాను… డబ్బుల్లేవు, ఎవరినైనా అడిగి ఇస్తానన్నాడు… అదేమో పాత పెన్ను… కక్కేది, సరిగ్గా రాసేది కాదు, ఫ్రాకు మీద సిరా పడేది… అయిదో తరగతికి వచ్చాక గురువు మదన్‌మోహన్ సార్ స్కాలర్ షిప్ టెస్టు రాయించాడు… గ్లాస్ పగిలిన లాంతరు వెలుగులోనే నా చదువు…
ఇది ఊరు కాదు, నా కుటుంబం, ఈ ఊరి బిడ్డనే… ఈ గడ్డ మీద అడుగుపెడితే ఓ ఆత్మీయ ఉద్వేగం’’ అని చెప్పుకొచ్చింది ఆమె… తన సోదరుడి కుటుంబం అక్కడే ఉంటుంది… ఈ ఇంటికి ఆమె వెళ్తుంటే తన సంతాలీ తెగ మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో స్వాగతాలు పలికారు…
ఆ ఊరికి ఆమె ఏం చేస్తుందనేది కాదు ఇక్కడ ప్రధానం… సొంతూరి పట్ల, గురువుల పట్ల ఆమె ప్రదర్శించిన అభిమానం, గౌరవం ముఖ్యం… ఆమె ప్రథమ పౌరురాలిగా ఎదిగినా సరే, వినమ్రత, అణకువ, సంస్కార ధోరణి పోలేదు… ఆమె తలవంచి నమస్కరిస్తున్నప్పుడు చిన్నప్పుడు ఆమెకు చదువు చెప్పిన ఆ గురువు మొహంలో ఎంత వెలుగు తళుక్కుమని ఉండాలి… దాన్ని అక్షరాల్లో కొలవగలమా..? 66 ఏళ్ల వయస్సులో ఆమె తన బాల్య జ్ఙాపకాల్ని స్పృశిస్తూ, నెమరేస్తూ, అమ్మ ఒడిలోకి చేరి ఆనందించడాన్ని ఏ రూపాయల్లో కొలవగలం..?
గుర్తుంది కదా… తనను రాష్ట్రపతి అభ్యర్థినిగా ఖరారు చేశారని తెలిశాక సింపుల్‌గా ఓ చీపురు పట్టుకెళ్లి సమీపంలోని గుడిని శుభ్రం చేసి, మనసారా మొక్కి వచ్చింది… అట్టహాసాలు, ఆడంబరాలు, వికటపోకడలు లేని డౌన్ టు ఎర్త్ వ్యక్తిత్వం… తన రూట్స్ మరిచిపోలేదు…
ఇదుగో ఇదే మీడియాలో ఫోకసయితే అది సొసైటీకి మంచిది… పాజిటివిటీ… పుష్పరాజులు రాజ్యాల్ని పాలిస్తూ, మనోవికారాల్ని పెంచుతున్న నెగెటివ్ వాతావరణంలో… ఇదొక డిపరెంట్, బలమైన ఎమోషన్… దాన్ని పట్టుకోవడం, సొసైటీకి చెప్పడంలో తెలుగు మీడియా ఎప్పటిలాగే ఫెయిల్…!! కీలకస్థానాల్లో ఉన్న వ్యక్తులు నీతులు, పాఠాలు చెప్పనక్కర్లేదు, తమ ప్రవర్తనతోనే మంచి సందేశాల్ని, సంకేతాల్ని ఇవ్వాలి… రాష్ట్రపతి వ్యవహారశైలికి ‘ముచ్చట’ హేట్సాఫ్..!
Share this Article