బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుకు “కుట్ర” కారణం కాదనీ, కొన్ని పిల్లర్ల కింద ఇసుక కొట్టుకు పోవడం వల్ల (Under Tunnelling), ఆ పిల్లర్లు కుంగిపోయాయనీ, ఆ పిల్లర్ల వరకు, అంటే సుమారు 10 పిల్లర్లు, మళ్ళీ కడితే సరిపోతుందని మన ఇంజనీర్-ఇన్-చీఫ్ గారు సెలవిచ్చారు. కానీ ఇంజనీర్ గారు సెలవిచ్చినట్టు కింద నున్న ఇసుక కొట్టుకపోవడమే పిల్లర్ల కుంగుబాటుకు కారణమైతే మొత్తం బ్యారేజీని మళ్ళీ కొత్తగా కట్టాల్సి ఉంటుంది.
*********************
ఎందుకంటే…?
Ads
మామూలుగా బ్యారేజీ కట్టేటప్పుడు నది అడుగున రాయి ఎంత లోతులో ఉందో చూసి అక్కడ నుండీ బ్యారేజీ పునాదులు కడతారు. కానీ కాళేశ్వరంలో నదిలో రాయి చాలా లోతులో ఉంది, అక్కడ నుండీ కాంక్రీట్ కట్టడం కట్టాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పి, ఇసుక పైనే ఒక శ్లాబ్ ను నిర్మించారు. ఈ స్లాబ్ ను Raft అంటారు. ఆ శ్లాబ్ పై పిల్లర్లు (ఇంజనీరింగ్ భాషలో పియర్- pier) వేయడం జరిగింది. మొత్తం 85 పిల్లర్లు, 8 బ్లాకులుగా విభజించి (ఒక్కో బ్లాకులో 10 నుండి 11 పిల్లర్లు) వేశారు. మరి ఇసుకపై శ్లాబ్ వేస్తే, వరద వచ్చినప్పుడు కింద ఉన్న ఇసుక కొట్టుకు పోతే?
**********************
ఇసుక కొట్టుకు పోకుండా కట్-ఆఫ్-వాల్ (Cut-off-Wall) నిర్మాణం:
ఇలా పునాదుల కింద నుండి ఇసుక/మట్టి కొట్టుకు పోవడాన్ని స్కవరింగ్ (scouring) అంటారు. అందుకే ఇసుక కొట్టుకు పోకుండా శ్లాబ్ కు రెండు వైపులా, మొత్తం నది ఎంత వెడల్పు ఉందో అంత వరకూ అడ్డంగా, కొంత లోతు వరకూ నిట్టనిలువుగా కాంక్రీటు గోడ లాంటి నిర్మాణాన్ని చేపడుతారు. దీనిని కట్-ఆఫ్-వాల్ (cut-off-wall) అంటారు. ఈ కాంక్రీట్ గోడ, పైనుండి వచ్చే నీటిని శ్లాబ్ కింద నుండి వేగంగా ప్రవహించకుండా అడ్డుకుంటుంది. దీంతో శ్లాబ్ కింద ఉన్న ఇసుక కొట్టుకు పోదు.
*********************
ఇప్పుడు మేడిగడ్డ పిల్లర్లు కుంగాయి. అదీ కింద నుండి ఇసుక కొట్టుకు పోయి…! అంటే అడ్డుగా కట్టిన కాంక్రీటు గోడ నీటి వేగాన్ని నియంత్రించలేక పోయిందని అర్దం. ఒక చోట మొదటగా ఇసుక కొట్టుకు పోయింది… అంటే మరోచోట కూడా ఇసుక ఎప్పుడో ఒకప్పుడు కొట్టుకు పోవడం ఖాయం. అంటే అక్కడ కూడా పిల్లర్లు కుంగడం ఖాయం. ఎక్కడ పిల్లర్లు కుంగితే అక్కడ రిపేర్లు చేసుకుంటూ పోతే, ప్రతీ రెండేళ్ళకోసారి మనం ఈ “ కుంగడం, కూలడం, రిపేర్ల” తంతును చూడాల్సి వస్తుంది. కాబట్టి మొత్తం బ్యారేజీని సమగ్రంగా సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది.
**********************
కుంగడమే కాదు… మొత్తం నిట్ట నిలువునా క్రాకులు:
కేవలం పిల్లర్లు కుంగితే అది కిందనున్న ఇసుక కొట్టుకుపోవడం వల్ల అని అనుకోవచ్చు. కానీ రెండవ మరో పెద్ద సమస్య- మొత్తం పిల్లరుకే నిట్టనిలువునా క్రాకులు వచ్చాయని చెబుతున్నారు. అంటే ఇసుక కొట్టుకుపోవడంతో పాటు నిర్మాణంలో డిజైన్ లోపం, నాణ్యతా లోపం కూడా ఉండడం దీనికి కారణం. కేవలం ఆ పిల్లర్ వరకే నాణ్యత లోపించే అవకాశం ఉంది కదా? అని అనవచ్చు.
*******************
ఇప్పుడు తూతూ మంత్రంగా రిపేర్లు చేసి పని కానిస్తే, ఈ కుంగడాలు, విరగడాలు, రిపేర్లు మన జీవిత కాలం మనల్ని వెంటాడక మానవు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై సమగ్ర అధ్యయనం జరగాలి: కాబట్టి కేవలం 10 పిల్లర్లే కాకుండా, మొత్తం బ్యారేజీ పటిష్టతపై సమగ్ర అధ్యయనం జరగాలి. లోపం డిజైన్లలోనా? భూ పరీక్షల్లోనా? నిర్మాణంలోనా? మరే ఇతర కారణమా? అన్న విషయాలు నిగ్గుతేల్చాలి.కేవలం మేడిగడ్డ బ్యారేజీనే కాకుండా, కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నీ బ్యారేజీలు, ఇతర నిర్మాణాలపై నిపుణులతో కూడిన కమిటీని తక్షణం వేసి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. లేకుంటే తెలంగాణ సమాజం భారీ మూల్యం చెల్లించక తప్పదు….. — తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (TJAC)
Share this Article