.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం వీధి కుక్కల దెబ్బకు ఇప్పుడు రెండుగా చీలిపోయి ఉంది. ఢిల్లీలో వీధి కుక్కలు కరచి చిన్నారులు చనిపోయిన నేపథ్యంలో భారత సర్వోన్నత న్యాయస్థానం కలుగజేసుకుని ఢిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించాయా! ఖబడ్డార్! అని శునక నిర్ములన మహా యజ్ఞానికి ఆదేశాల హవిస్సులు ఇచ్చింది.
దాంతో రాహుల్ గాంధీ మొదలు అనేకమంది సెలెబ్రిటీలైన జంతు ప్రేమికులు సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలని కోరుతూ సరికొత్త ఉద్యమానికి ఊపిరులూదారు. సమీక్షిస్తామని సుప్రీం కోర్టు కూడా మెత్తబడింది.
Ads
# దేశవ్యాప్తంగా ప్రతి 11 సెకన్లకు ఒక కుక్కకాటు కేసు నమోదవుతోంది.
# 2022 లో దేశంలో కుక్కకాటు సంఘటనలు- 22 లక్షలు. 2024లో- 37 లక్షలు.
# 2024 లో కుక్కకాటు కేసులు ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో బాగా పెరిగాయి.
# దేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలున్నాయి.
# కుక్కల ద్వారా దాదాపు 60 రకాల వ్యాధులు మనుషులకు వచ్చే ప్రమాదముంది.
వాల్మీకి రామాయణం ఉత్తరకాండలో ఒక భిక్షువు- కుక్క సంవాదం సందర్భంలో రాజు శిక్షించడం వల్ల పాపం పోతుందని ఒక ధర్మసూక్ష్మ విశ్లేషణ ఉంటుంది. ఒక భిక్షువు వీధిలో తన మానాన తనున్న ఒక కుక్కను అకారణంగా కొడతాడు.
రక్తం కారుతూ ఆ కుక్క న్యాయం కోసం అయోధ్యలో రాముడి అంతః పురంలో ప్రజల వినతులు వినే చోటుకు వెళ్లి పంచాయితీ పెడుతుంది. అకారణంగా కొట్టిన మాట నిజమే అని భిక్షువు నేరాన్ని అంగీకరించినా… చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, సన్యాసులు చేసిన మొదటి తప్పును మన్నించాలని న్యాయపరిషత్- ఇప్పటి భాషలో కోర్టు ఫుల్ బెంచ్ అభిప్రాయపడింది.
చేసిన నేరాన్ని అంగీకరించావు, భిక్షువు కాబట్టి మొదటి తప్పుగా పరిగణించి వదిలేస్తున్నాం… జాగ్రత్త… ఇకపై సంయమనంతో ఉండు… పో… అంటాడు రాముడు. “రామ! రామ! నాకు శిక్ష వేయకపోతే నీమీద పాలనా దోషం పడుతుంది. పైగా నేను శిక్ష అనుభవించడం వల్ల… నా పాపం పోతుంది…” అని భిక్షువు ప్రాధేయపడతాడు.
ఏ శిక్ష వేద్దాం? అని రాముడు కుక్కనే అడిగాడు. అయోధ్యలో ఏదయినా గుడికి ధర్మకర్తగా వేయండి స్వామీ! అని కుక్క విన్నవించుకుంది. రాముడు అలాగే చేశాడు.
(గుడికి ధర్మకర్త అంటే గొప్ప వరం కదా? శిక్ష ఎలా అవుతుంది? అని అనుకుంటాం. అక్కడ కుక్కగా ఉన్నది గత జన్మలో ధర్మకర్త హోదాలో గుడి నిర్వహణ వెలగబెట్టిన మనిషే. ఆ విషయం ఆ కుక్కకు తెలుసు. రాముడికి తెలుసు. వాల్మీకికి తెలుసు. మనకు తెలియాలనే ఈ కథను అంత విస్తారంగా వాల్మీకి రికార్డ్ చేశాడు.)
ఇందులో ధర్మ సూక్ష్మం ఏమిటంటే ఏదయినా తప్పు చేస్తే… ఆ తప్పుకు శిక్ష అనుభవిస్తే ఆ అకౌంట్ సెటిలవుతుంది. పాపం మూట కట్టుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది.
సాధారణంగా రామాయణం ఏడు కాండల్లో ఉత్తరకాండ ఎవరూ పారాయణ చేయరు కాబట్టి ఈ త్రేతాయుగపు కుక్కగోలకు పెద్దగా ప్రచారం జరిగి ఉండదు. గత జన్మల్లో ఏ అధర్మకర్తృత్వం వల్ల ఇప్పుడున్న ఆరు కోట్ల కుక్కలు శునక జన్మ పొందాయో చెప్పగలిగినవారెవరు?
రామరాజ్యం పోయి ఇప్పుడు ప్రజారాజ్యం వచ్చింది. ఈ ప్రజారాజ్యంలో ఆరు కోట్ల కుక్కలు ధర్మగంట కొట్టి రాజు నుండి రక్షణ అడగడానికి ఏ అయోధ్యకు వెళ్ళాలి? వెళ్ళినా… అక్కడ ధర్మగంట ఎక్కడుంటుంది? ఉన్నా… ధర్మగంట కొట్టగానే ధర్మం చెప్పేవారెవరు?
కుక్కగాట్లకు మనుషులు చస్తుంటే… శునకప్రేమ ముఖ్యమా? అని మనిషి ప్రతినిధి అడుగుతున్నాడు. మనిషి మానవత్వం మరచి… కుక్కల అంతు చూస్తుంటే జీవకారుణ్యం అవసరం లేదా అని జంతు ప్రతినిధులు అడుగుతున్నారు. ఇందులో ఎవరి వాదన తప్పు? ఎవరి వాదన ఒప్పు? మి లార్డ్స్!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article