‘‘వీ ఫ్లాప్, టక్ జగదీష్ ఫ్లాప్… ఈ స్థితిలో నాని సినిమా రిలీజుకు ముందు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు… దీంతో బయ్యర్లు ఎవరూ రాలేదు… బిజినెస్ అనుకున్నట్టు జరగలేదు… దాంతో నిర్మాతే పలుచోట్ల సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు… నాని కూడా తన 8 కోట్ల రెమ్యునరేషన్‌లో 5 కోట్లు వాపస్ ఇచ్చాడు…’’ ఇదీ ఎక్కడో కనిపించిన వార్త… నిజానిజాలు పెరుమాళ్లకెరుక… కానీ నానికి తెలుగు చిత్రసీమ ఓ షాక్ ఇచ్చింది… నాలుకకు అదుపు అవసరం అనే నిజాన్ని గుర్తుచేసింది… ఇండస్ట్రీలో స్టాల్ వార్ట్సే ‘‘అన్నీ మూసుకుని’’ ‘‘జగన్ దయ- మన ప్రాప్తం’’ అన్నట్టుగా గుంభనంగా వ్యవహరిస్తుంటే నాని టికెట్ల ధరలపై నెగెటివ్ వ్యాఖ్యలకు దిగాడు…
కిరాణకొట్లకన్నా థియేటర్ల వసూళ్లు దిగజారిపోయాయ్ అని కిరాణకొట్లను తేలికచేసే ‘పిచ్చి వ్యాఖ్య’తోపాటు పవన్ కల్యాణ్ గొంతు విప్పినప్పుడే చిత్రసీమ తనతో కలిసి వస్తే బాగుండేది అన్నట్టుగా ఏవేవో వ్యాఖ్యలు చేశాడు… తన వ్యాఖ్యల్లో నిజముందా లేదా..? జగన్ నిర్ణయాల్లో రెండు కులాల సినిమా పెద్దలపై కక్ష ఉందా లేదా..? ఇవి కావు అసలు ప్రశ్నలు… సరిగ్గా తన సినిమా రిలీజుకు ముందు, నిర్మాతను నష్టపరిచే వ్యాఖ్యలకు ఎందుకు దిగినట్టు నాని..? పోనీ, వీటి వల్ల తన సినిమాకు ఏమైనా ఫాయిదా ఉందా..? తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నట్టుగా నాని వ్యాఖ్యలతో ప్రభుత్వ పెద్దలు మరింత పంతానికి పోతున్నారా..?
Ads
ఈ డౌటు తెలుగు సినిమా పెద్దలకు కూడా వచ్చింది… ఒరే, నాన్న, నీకెందుకురా అని తప్పుపట్టలేక… మాలాగే నువ్వూ మూస్కోవోయ్ అని చెప్పలేక… తెలివిగా చిత్రపరిశ్రమ ఇష్యూస్‌పై ఎవరేం మాట్లాడినా సరే, అవన్నీ వాళ్ల వ్యక్తిగతాలు మాత్రమే అంటోంది చలనచిత్ర నిర్మాతల మండలి… తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలుగు ఫిలిమ్ డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలుగు ఫిలిమ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, వాటి అనుబంధ సంఘాల అధ్యక్షులు లేదా కార్యదర్శలు మాట్లాడేవి మాత్రమే అధికారికమనీ… మిగతా ఎవరు మాట్లాడినా తూచ్ అన్నట్టేనని నిర్మాతల మండలి ఓ ప్రకటనలో చెప్పారు… ఒకరకంగా నాని వ్యాఖ్యల పట్ల అభిశంసనే ఇది… కాకపోతే కాస్త మర్యాదగా చెప్పారు… దిల్ రాజు కూడా దీనిపై ఎవరూ మాట్లాడవద్దని అల్టిమేటం జారీ చేశాడు… ఇంతకీ ఆయన ఏ హోదాలో మాట్లాడుతున్నట్టు..!?
అవునూ, టికెట్ ధరల వ్యవహారంలో పైన చెప్పబడిన ఏ సంఘమైన స్పందించిందా..? లేదు..! ప్రభుత్వంతో, అదీ జగన్‌తో ఏదీ అంత వీజీ కాదనే ఎరుక ఉంది కాబట్టే…!! పైగా ముల్లు తన మీద పడినా, ముల్లు మీద తను పడినా చిరిగేది ఆకేనని తెలుసు కాబట్టి…!! ప్రస్తుత యవ్వారం రాజకీయాలతో లింకై ఉందనే సోయి ఉంది కాబట్టి…!! థియేటర్ల మాఫియా సిండికేట్ కూడా కిక్కుమనడం లేదు కాబట్టి…!! అంతే అనుకోవాలా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శులూ… ఇలాంటి ప్రకటన పవన్‌కల్యాణ్ మాట్లాడినప్పుడు ఎందుకు రాలేదో మరి…!!!
Share this Article