ప్రభుత్వ ఉద్యోగం ముఖ్యంగా గ్రూప్ 2A వంటి ఉద్యోగాల్లో చేరే అధికారుల ఉద్యోగ జీవితం చాలా క్లిష్టమైనది. ఎందుకంటే, ఆ అధికారి పైన ప్రభుత్వ హయరార్కీలో అనేక మంది అధికారులు ఉంటారు.
ఉదాహరణకు, మా డిపార్టుమెంటులో ఏసీటీవో ఉద్యోగమే తీసుకుంటే, ఒక సర్కిల్లో ఏసీటీవో పైన డీసీటీవో, సీటీవో ఉంటారు. డివిజన్ స్థాయిలో డిప్యూటీ కమీషనర్ ఉంటారు. డీసీ ఆఫీసులో అనేక మంది అధికారులు పని చేస్తుంటారు.
కొత్తగా చేరిన ఏసీటీవో అదృష్టం కొద్దీ తన పై అధికారులు సహృదయులు అయితే, ఉద్యోగ జీవితం నల్లేరుపై నడకలా సాగుతుంది. లేకపోతే నిత్య నరకమే.
Ads
వాణిజ్య పన్నుల శాఖలో అనేక రకాల పన్నులు వసూలు చేయవలసి ఉంటుంది. అమ్మకపు పన్ను, వినోదపు పన్ను, వృత్తి పన్ను వీటిలో ముఖ్యమైనవి. అయితే పన్ను వసూలులో అనేక రకాల చట్టపరమైన, న్యాయపరమైన చిక్కులు కూడా ఉంటాయి. కాబట్టి అనేక పద్దులు మొండి బకాయలుగా మారుతాయి.
మన పై అధికారి మంచి వాడైతే ఫర్వాలేదు గానీ అతనికి మన మీద ఏ కారణం చేతనైనా కోపం వస్తే, ఇక మన బ్రతుకు రణరంగమే. యాభై ఏళ్ళ క్రింద బకాయి పడిన యాభై రూపాయలు ఎందుకు వసూలు చేయడం లేదని మెమో ఇస్తాడు. డీసీటీవో అంటే సీనియర్ అధికారి. ఆ అధికారి క్లర్కు స్థాయి నుండి ప్రమోషన్ల మీద రిటైర్మెంట్ సమయానికి డీసీటీవో స్థాయికి చేరుకుని ఉంటాడు. వాళ్ళల్లో చాలా మందికి, మిగిలిన సిబ్బందికి కూడా – ముప్ఫై ఏళ్ళ లోపే డైరెక్టుగా ఏసీటీవోగా వచ్చిన యువకులను చూస్తే అసూయ.
అదే సీటీవోగా డైరెక్టు రిక్రూట్మెంటులో వచ్చిన వారికి మాత్రం మస్కా కొడుతుంటారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు అయోమయంలో పడతారు. ఎవ్వరూ సరైన సలహా ఇవ్వరు. ఆ ఏసీటీవో సమస్యలతో నలిగిపోతుంటే, శునకానందం పొందుతుంటారు. నా ఉద్యోగ జీవితంలో నాకు నికృష్టులైన పై అధికారులు, ఉత్తములైన వారూ తగిలారు.
నేను కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటులో కేవలం 24 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం చేసాను. కానీ, 25 సార్లు బదిలీల బారిన పడ్డాను. సుమారు 20 సార్లు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో కేసులు వేసి , నా పై అధికారుల మీద డిప్యూటీ కమీషనర్, కమీషనర్ల మీద స్టే ఆర్డర్లు తీసుకొచ్చి నా హక్కులను సాధించుకున్నాను.
గొప్ప చెప్పుకోవడం కాదు గానీ, డిపార్టుమెంటులో నా జోలికి రావాలంటే, ఎంత పెద్ద అధికారైనా, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే. తప్పుడు పనులు చేయమంటే నేను ఒప్పుకునేవాణ్ణి కాదు. నాకు నచ్చకపోతే, ఏ పనైనా చేసే వాణ్ణి కాదు. అందుకే, నా ఉద్యోగ జీవితమంతా రణరంగమే. నన్ను 24 సంవత్సరాలలో మొత్తం రాష్ట్రం తిప్పారు. అయినా తొణకలేదు, బెణకలేదు. నాపైన నాలుగుసార్లు ఏసీబీ రెయిడ్ చేయించారు.
ఒకసారి, ఒక డిప్యూటీ కమీషనర్ ప్రోద్బలంతో, ఆదిలాబాద్ చెక్ పోస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఉద్యోగంలో చేరిన మరునాడే నా పైన ఏసీబీ రెయిడ్ చేయించారు. అది కూడా అర్థరాత్రి రెండు గంటలకు. రూల్స్ ప్రకారం నా డ్యూటీ ఉదయం పది నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే. ఆ అర్థరాత్రి సమయంలో నేను చెక్ పోస్టులో విధి నిర్వహణలో ఉండవలసిన అవసరం లేదు. కానీ, అక్కడ ఎవడి దగ్గరో వెయ్యి రూపాయలు దొరికాయని, నన్ను బాధ్యుణ్ణి చేసారు. నేను ట్రిబ్యునల్ కు వెళితే, న్యాయమూర్తి డిపార్టుమెంట్ కు నానా గడ్డి పెట్టారు. మనం కరెక్టుగా ఉంటే న్యాయం దక్కుతుంది. కానీ, ఆ పోరాటం చేస్తున్నంత సేపు మనోవేదన అధికంగా ఉంటుంది.
ఒక వింత సంఘటన చెపుతాను. ఒక రోజు అర్థరాత్రి రెండింటికి మా ఇంటికి ఫోన్ వచ్చింది. డీసీటీవో ఫోన్ చేసాడు. నేను గాఢనిద్రలో ఉండడంతో, నా భార్య ఫోన్ ఎత్తి, ‘నేను నిద్ర పోతున్నానని’ చెప్పడంతో, డీసీటీవో ‘నన్ను లేపమని’ చెప్పాడు. నా భార్య సున్నితంగానే, ‘ఇంత అర్థరాత్రి ఆయనను నిద్ర లేపలేను. తర్వాత నన్ను కోప్పడతారు.’ అని చెప్పింది.
దాంతో, మరునాడు ఉదయం ఆఫీసుకు వెళ్ళేసరికి, ‘నిన్న రాత్రి రెండు గంటలకు ఫోన్ చేస్తే నిద్రపోతున్నానని’ అభియోగం మోపుతూ, మెమో జారీ చేసారు. మన పై అధికారికి మనకూ పడడం లేదని తెలిసిన వెంటనే, ఆఫీసులో ఉన్న స్టాఫ్ అంతా మన పై అధికారి చుట్టూ ఈగల్లా మూగుతారు. లేనిపోని చాడీలు చెప్పి, అగ్గిని మరింత రాజేస్తారు.
నేను ఆ మెమో పైన ట్రిబ్యునల్ కు వెళ్ళాను. ట్రిబ్యునల్, ఆ అధికారి సంజాయిషీ తీసుకుని, సంతృప్తికరమైన సమాధానం రాకుంటే, అతనికి ఛార్జ్ షీట్ ఇవ్వమని చెప్పింది. ఆ కేసు తేలే వరకు, ఆ డీసీటీవోకు ప్రమోషన్ ఇవ్వకూడదని చెప్పింది. అలా, నాకు అన్యాయం జరిగినప్పుడల్లా, ట్రిబ్యునల్ నా పాలిట వజ్రాయుధంలా పని చేసింది…….. ( By డాక్టర్ ప్రభాకర్ జైనీ )
Share this Article