మొన్నమొన్ననే కదా… ఏపీ పోలీసులకు రకరకాల అవార్డులొచ్చాయి అన్నారు, జగన్ ఆనందాతిరేకంతో ఉప్పొంగి పోయాడన్నారు… విశాఖ ముఖ్యమంత్రి విజయసాయి అయితే కాలర్ ఎగరేశాడు…. అప్పుడే ఇంత బదనాం ఏంది అసలు..? వాటీజ్ దిస్…? ఫాఫం, పోలీస్ ఇన్ఫార్మరట… ఆమాత్రం అధికారం లేదా..? స్వేచ్చ లేదా..? ఏదో తెలుగు సినిమాలు చూసీ చూసీ ఏదో ఉపాధి వెతుక్కున్నాడు… జస్ట్, గాలం వేసి కూర్చుంటాడు… ఎవత్తో వచ్చి తగుల్తుంది… వాడేసుకుంటాడు, అమ్మేసుకుంటాడు… అరె, గాలానికి తగిన చేపను ఎలా వండుకుని తినాలో స్వేచ్ఛ కూడా లేదా ఈ స్వతంత్ర భారతంలో…!! నాన్సెన్స్, ముందు ఈ పత్రికల వాళ్లను కుమ్మేయాలి… వీళ్లే సకల దరిద్రాలకూ మూలం… అరె, ఒక నిరుద్యోగి కడుపు కొడుతున్నాం అనే సోయి కూడా లేదు దుర్మార్గులకు..?
ఫాఫం, ఏమంత తప్పు చేశాడు తను…? ఏదో ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నాడు… పెద్ద పెద్ద లీడర్లు కమ్ హీరోలు చేసుకోవడం లేదా..? కాకపోతే, ఎంతకాలం పోషించాలి, అందుకని ఒక్కొక్కరినే వ్యభిచార గృహాలకు అమ్మేసుకోవడం, ఏదో నాలుగు రాళ్లు దొరికితే కడుపు నింపుకోవడం, అందులోనే కాసిన్ని పైసలు మిగిల్చి కొత్త పిట్టల కోసం వేటాడటం… ఇదొక బతుకు తెరువు, ఇదొక ఉపాధి మార్గం, ఇదొక వృత్తి… అరె, కనీసం ఇదైనా అర్థం చేసుకోకపోతే మీ జర్నలిజం ఎందుకురా భయ్… వోకే, స్నేహితుడు ఉన్నాడు ఒకడు… వాడి భార్య కూడా ఒక సరుకే కదా… స్నేహితుడు అంటేనే మనకు ఉపయోగపడేవాడు… వాడి భార్య కూడా అంతే కదా… చెరపట్టడం ఏమీ కాదు, మొరాయిస్తే కాస్త బలప్రయోగం చేసి, తత్వబోధ చేసి, తన బాటలోకి తెచ్చుకోవడం కూడా నేరమేనా..?
Ads
ఈమాత్రం దానికి బదనాం చేయాలా..? అరె, విశాఖ అంటేనే విశ్వనగరం… కాబోయే ఏపీ రాజధాని… అన్నిరకాలుగా డెవలప్ కావాలా లేదా..? మనుషులకు చాలా అవసరాలు ఉంటయ్… అందులో శృంగార అవసరాలు బోలెడు… అవి తీర్చడానికి, పనిలోపనిగా నాలుగు రాళ్లు సంపాదించి కడుపు నింపుకోవడానికి ప్రయాసపడితే నేరం అంటారా..? దీనికి పోలీస్ కమిషనర్ దాకా వెళ్లాలా..? ఏం, కమిషనర్లు అంటే వాళ్లకు బాధ్యతలు తెలియవా..? ఇన్ఫార్మర్లను కాపాడుకోవడం వాళ్ల బాధ్యత కాదా ఏం..?
తిరుగుతాడు… కత్తి పట్టుకునే తిరుగుతాడు… అర్థం చేసుకోలేని మూర్ఖుల నుంచి ఆత్మరక్షణకు తిరగబడటానికి ఓ కత్తి అవసరం… కత్తి ఏమైనా మారణాయుధమా..? ఆఫ్టరాల్, అవేమైనా ప్రాణాలు తీస్తాయా..? కాబోయే సీఎం మీద దాడి చేస్తేనే ఆమధ్య అంగుళం కూడా దిగలేదు… మరీ ఇంత బదనాం చేయడం దుర్మార్గమండీ… అసలు ఈ పదాలు ఏమిటి..? నరరూప రాక్షసుడు అట… రాక్షసరూప నరుడు అనొచ్చు కదా… ఛిఛీ, వీళ్లకు రాయడం చేతకాదు, ఒక మనిషి తన కడుపు నింపుకోవడం కోసం ఎంతగా ఆత్మక్షోభకు గురవుతూ, బాధపడుతూ, కన్నీళ్లు కారుస్తూ ఈ పనులు చేస్తున్నాడో వీళ్లకు అర్థం కాదు… కనిపించనీ, ఒక్క జర్నలిస్టు ఎవడైనా కనిపించనీ… అన్నీ అర్థమయ్యేలా చెబుతా… పొద్దున్నే కత్తికి పదును కూడా పెట్టించాను… కమాన్… కమాన్…
Share this Article