అసలు ఇక్కడ 24 గంటల్లో చైన్ స్నాచర్‌ను పట్టుకోవడం అనేది వార్త కానేకాదు… తను చోరీలు చేస్తాడు గానీ నీరవ్ మోడీ, విజయ్ మాల్యా టైపు కాదు… దేశం విడిచిపారిపోడు, వేల కోట్లు కొట్టేయడు… రాజకీయ నాయకుల్లాగా భూములు తినేయడు… ఉన్నతాధికారుల్లా కోట్లకుకోట్లు కుమ్మేయడు… బడా పారిశ్రామికవేత్తల్లాగా వేల కోట్ల బ్యాంకు రుణాలూ ఎగవేయడు… జస్ట్, ఓ సాదాసీదా దొంగ… కానీ ఓ పద్దతీ మర్యాద ఉన్న దొంగ… నియ్యత్ కలిగినవాడు… తన వృత్తిని గౌరవించేవాడు… వృత్తిధర్మంలోనూ నైతికతను పాటించేవాడు… అదీ అసలు వార్త… పీడీయాక్టులు పెట్టండి, ఇంకేమైనా చేయండి… తన బాటలో తను నిజాయితీగా వెళ్తాడు… దారితప్పడు… సమాజం కోసమో, పోలీసుల కోసమో, జైలు అధికారుల కోసమో తన దారి మార్చుకోడు… తన వృత్తికి ద్రోహం చేయడు… తన మీద కాస్త డొక్కశుద్ధితో ఎవరూ సరైన వార్త రాయకపోయినా సరే పట్టించుకోడు ఫాఫం…
హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన అస్లాం… ప్రొఫెషనల్ దొంగ… ఏదో చిన్న చిన్న చైన్లు, మోటార్ బైకులు గట్రా చోరీలు చేస్తుంటాడు… కానీ ఏమాటకామాట… దొరికిపోతాడు… నో, నేను దొంగను కాను అని బుకాయించడు… నీతిగా దొంగతనాన్ని అంగీకరిస్తాడు… కాలర్ ఎగరేసుకుని జైలుకు వెళ్తాడు… విడుదలయ్యాక మళ్లీ తన వృత్తిలో మునగిపోతాడు… వృత్తి పట్ల కమిట్మెంటే కాదు, భారతీయ చట్టాలు, కోర్టుల పట్ల ఎంతో గౌరవం తనకు… ఇప్పటికి 40 కేసులు, 40 సార్లు జైలుశిక్ష… అసలు తనకు జైలులో అందరూ పరిచయమే… వాళ్లను వదిలి ఉండలేడు… బయటికి వచ్చినా నాలుగు రోజులు కాలం గడిపి, మళ్లీ జైలుకు వెళ్లిపోతాడు… పోలీసులు పట్టుకోవడం, చార్జిషీటు, తీర్పు, శిక్ష అమలు చకచకా… ఓ పద్ధతి ప్రకారం జరిగిపోతూ ఉంటయ్… తనది ఒక చరిత్ర… అంతే తప్ప తనది దొంగబుద్ధి వంటి పరుషపదాలతో వార్తలు రాయడం అన్యాయం… దుర్మార్గం… పోలీసులు కూడా చీపుగా చూడొద్దు… ఈ పీడీయాక్టులు గట్రా వేస్ట్… తనే దొరికిపోతాడు, సర్, జైలుకు పంపించే పని కాస్త త్వరగా కానివ్వండి సార్ అని బతిమిలాడతాడు… దొంగల్లోనూ అస్లాంలు వేరయా అన్నట్టుగా తను డిఫరెంట్… మన మీడియాకు ఏమాత్రం బుర్ర ఉన్నా ఓ స్పెషల్ ఫీచర్ కొట్టాల్సిన కథ… అస్లాం, ఈసారి మన మీడియా ఎడిటర్ల జేబులపై కన్ను వేయి కాస్త… అప్పుడైనా సరైన గుర్తింపు లభిస్తుందేమో చూద్దాం… ఏమంటావ్..?!
Ads
Share this Article