నిజానికి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలో పెద్ద చూడటానికి ఏమీలేదు… రివ్యూ రాసుకునేంత సీన్ కూడా ఏమీలేదు… కాస్తోకూస్తో మాట్లాడుకోదలిస్తే అందులో మాళవిక నాయర్ ఉంది… అంతే… ఊహలు గుసగులాడె, జో అచ్యుతానంద తీసిన అవసరాల శ్రీనివాసేనా అన్నట్టు ఉంది… సున్నితమైన కామెడీ, కాస్త ఎమోషన్, అశ్లీల రహితంగా కథనం ఉండే అవసరాల మరీ ఇంత పేలవమైన సినిమాను మనమీదకు వదిలాడు ఏమిటి…?
హీరో నాగశౌర్య ఉన్నాడా అంటే ఉన్నాడు… ఉన్నంతలో పర్లేదు, కానీ బాగా ఉండటానికి ఆ పాత్ర పెద్ద స్కోపేమీ ఇవ్వలేదు… ఒక్క మాళవిక తప్ప మిగతా వాళ్లంతా సోసో… మాళవిక తన మొహంలో ఉద్వేగాల్ని సమర్థంగా ప్రదర్శించగలదు… కానీ నిజం చెప్పాలంటే ఆమె తననుతాను ప్రూవ్ చేసుకునే ఒక్క పాత్ర కూడా ఆమెకు రాలేదనే చెప్పాలి…
పదేళ్లుగా నటిస్తూనే ఉంది… 2017లో మినహా తన చేతిలో సినిమా లేని సంవత్సరమంటూ లేదు… ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి తరువాత కూడా రెండు సినిమాలున్నయ్… అందులో ఒకటి కల్యాణరాం తీయబోయే డెవిల్… సో, కెరీర్ ఉవ్వెత్తున లేచేదీ లేదు… పడుకున్నదీ లేదు… కాకపోతే ఎక్కడా అశ్లీలపు ఛాయలున్న పాత్రల జోలికి పోదు… ఎవరో మనకు తెలిసిన అమ్మాయి అన్నట్టుగానే కనిపిస్తుంది ప్రతి పాత్రలో…
Ads
ఈ సినిమా విషయానికి వస్తే అవసరాల శ్రీనివాస్ చాప్టర్లుగా విడదీసి మరీ కొట్టాడు ప్రేక్షకులను… కాకపోతే ఎక్కడా ద్వంద్వార్థాలు, బూతులు, వెకిలి సీన్ల జోలికి పోడు, అవసరాల శ్రీనివాస్‌తో అది పెద్ద రిలీఫ్… ఎంచక్కా ఫ్యామిలీతో వెళ్లిపోవచ్చు… పెద్ద పెద్ద హీరోల సినిమాల్లోనే వెగటుతనం మూసీలా ప్రవహిస్తుంటే ఇలాంటి చిన్న సినిమాల వాటి జోలికి పోకుండా పరిమితులు గీసుకోవడం బాగుంది…
చెప్పుకోదగింది ఏమిటంటే… సినిమా లేటైంది… అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితమే స్టార్టయింది… సినిమా సుదీర్ఘంగా సాగేకొద్దీ అందరికీ ఇంట్రస్టు పోతుంది… దాన్ని కాపాడాల్సిన బాధ్యత దర్శకుడిదే… కానీ అది జరగలేదు… అందుకే హీరోకు ఇంట్రస్టు పోయింది… సంగీతం సోసో అయిపోయింది… గతంలో అవసరాల, నాగశౌర్య సినిమాలు కాస్త ఆడాయి గనుక ఈమాత్రం థియేటర్లు దొరికాయి, లేకపోతే ఇంకా ఘోరంగా ఉండేది… పైగా సినిమాలో పెద్ద కనెక్టింగ్ సరుకేమీ లేదు… కేవలం మాళవిక మొహం చూస్తూ రెండు గంటలు గడపలేం కదా…
ఇలా ఈమధ్య సుదీర్ఘంగా జాప్యం జరుగుతున్న సినిమాలు శాకుంతలం, రంగమార్తాండ… ప్రసవవేదనలా రిలీజుకు నానాకష్టాలూ పడుతున్నారు నిర్మాతలు… ఇద్దరూ పేరుమోసిన దర్శకులే మరి… ఒకరు కృష్ణవంశీ, మరొకరు గుణశేఖర్… ఎట్టకేలకు రంగమార్తాండుడు వస్తున్నాడు, కానీ శాకుంతలం ఎప్పుడు రిలీజవుతుందో లీడ్ రోల్ చేసిన సమంతకే తెలియదు… సినిమాలు షూటింగ్ ప్రారంభమైన కొత్తలో ఉండే ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకుల్లో ఉండదు… అదీ మైనస్… ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి సినిమాకు కూడా అంతే…!!
Share this Article