.
మూవీ ప్రమోషన్లకు ప్రిరిలీజు ఫంక్షన్లు చేస్తారు… టీవీ కార్యక్రమాల్లోకి గెస్టులుగా వెళ్లి ప్రమోట్ చేసుకుంటారు… పాపులర్ యూట్యూబ్ ప్రోగ్రాముల్లోనూ సందడి చేస్తారు… తప్పదు, జనంలోకి వెళ్లాలి కాబట్టి…
విష్వక్సేన్ వంటి నటులైతే నెగెటివ్ పబ్లిసిటీ ద్వారా కూడా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు… ఈమధ్య వెబ్ సీరీస్, ఓటీటీ ఒరిజినల్ కంటెంటు, కొత్త టీవీ సీరియళ్లకు కూడా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు,.. టీవీ కార్యక్రమాల్లోకి జొరబడి మరీ…
Ads
పెద్ద సినిమాలు ఓటీటీల్లోకి వస్తున్నప్పుడు కూడా కొందరు ప్రచారం చేసుకుంటున్నారు… పే పర్ వ్యూ ఒప్పందంతో స్ట్రీమయ్యే వాటికి ప్రచారం అవసరమే… ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే… ఈ ప్రమోషన్ వర్క్ ఇంకాస్త ముందుకు వెళ్లింది…
సినిమాల్ని టీవీల్లో ప్రీమియర్ ప్రసారం చేస్తున్నప్పుడు కూడా ప్రమోషన్ వర్క్ చేసుకోవడం… నిఝం… అప్పట్లో, అంటే ఆగస్టు చివరలో నాని నటించిన సరిపోదా శనివారం సినిమా వచ్చింది కదా… పాన్ ఇండియా… తనకన్నా విలన్ పాత్రధారికి మంచి స్వేచ్ఛ ఇచ్చాడు నాని అని మనం కూడా చెప్పుకున్నాం…
కానీ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు… 90-100 కోట్లు ఖర్చు పెడితే బొటాబొటిగా అంతే వసూళ్లు, అదీ పాన్ ఇండియా స్థాయిలో వచ్చినట్టు గుర్తు… నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకే కొనుగోలు చేసి ఆల్రెడీ సినిమా పెట్టేసింది ఓటీటీలో… దాని టీవీ రైట్స్ జీ టీవీ కొనుగోలు చేసింది కదా…
త్వరలో దాన్ని ప్రసారం చేయబోతున్నారు… ఇన్నాళ్లకు… అదుగో, దాని ప్రమోషన్ కోసం నాని జీతెలుగు సరిగమప ప్రోగ్రాంలోకి వచ్చాడు… హీరోయిన్‌తోపాటు… అదీ విచిత్రం అనిపించింది… నిజానికి టీవీల్లో సినిమాలు ఎవరూ పెద్దగా చూడటం లేదు ఇప్పుడు…
స్టార్ హీరోల సినిమాలకు వచ్చే రేటింగ్స్‌కన్నా టీవీ సీరియళ్ల రేటింగులు చాలా ఎక్కువ.., సరే, జీవాడు కొన్న సినిమా… ప్రీమియర్ ప్రసారానికి ఇలా ఓ తమ టీవీ ప్రోగ్రాములోనే ప్రమోషన్ ఖర్చు లేని పని కదా… ఓ ప్రయత్నం చేసినట్టున్నాడు…
కానీ అదసలే పిచ్చి షో… మ్యూజిక్ అనేది కనుమరుగై పక్కా ఎంటర్‌టెయిన్‌మెంట్ షోగా మారిపోయిందని… పిచ్చి గెంతులు, గ్రూప్ డాన్సులు, తిక్క ప్రయోగాలతో దాన్ని భ్రష్టుపట్టించేశారని గతంలోనూ చెప్పుకున్నాం కదా… పైగా హైపిచ్ కేకల శ్రీముఖి… పదే పదే సినిమాల ప్రమోషనల్ ఎపిసోడ్లు, గెస్టులు…
నిజానికి ఈసీజన్‌లో మానస, అభిజ్ఞ వంటి సింగర్స్ మొన్నటి తెలుగు ఇండియన్ ఐడల్‌లో పాల్గొన్నవాళ్లే… ఇంకొందరు జీ సరిగమప గత సీజన్‌లో పాల్గొన్నవారు… కొత్తవాళ్లు తక్కువే… సరే, ఏదో నడుస్తోంది షో… పెద్ద రేటింగ్స్ కూడా ఏమీ రావడం లేదు… జడ్జిలు, మెంటార్ల వరకూ వోకే.., ఎటొచ్చీ ప్రోగ్రాం స్క్రిప్టే బాగుండటం లేదు…
జీ టీవీ అనేక భాషల్లో ఈ సరిగమప రియాలిటీ షో రన్ చేస్తోంది… కానీ మరీ తెలుగులోనే ఈ పైత్యం పాళ్లు ఎక్కువున్నట్టున్నాయి… నాని ఉన్న కాసేపు ఎలాగోలా చూసి, ఇక వేరే చానెల్ వైపు వెళ్లిపోయా… భరించలేక..!!
Share this Article