.
రేవంత్ రెడ్డి అందరికీ అర్థం కాడు… తనను అంచనా వేయడం కేసీయార్‌కే సాధ్యం కావడం లేదు…
అప్పుడే కేసీయార్‌ను ఉరితీసినా తప్పు లేదు అంటాడు… వెంటనే అసెంబ్లీకి వచ్చిన కేసీయార్‌కు కరచాలనం చేసి, ఆరోగ్యం ఎలా ఉంది అని పలకరిస్తాడు…
Ads
అప్పుడే కేసీయార్‌ను కసబ్‌తో పోలుస్తాడు… వెంటనే కేసీయార్ తనకుతానే శిక్ష వేసుకున్నాడు, సొంత ఇల్లే బందిఖానా, ఇంకా శిక్షించేదేముంది..? దేవుడా శిక్షించాడు అని క్షమాభిక్ష ప్రకటించేస్తాడు…
అప్పుడే హాస్పిటల్‌కు వెళ్లి కేసీయార్‌ను పరామర్శిస్తాడు… తరువాత తనే కేసీయార్ తుంటి విరగడం దేవుడు వేసిన శిక్ష అంటాడు… (కేటీయార్ మీద లాగూలో తొండలు విడిచిపెట్టి కొట్టాలి అనే వ్యాఖ్యలు, దానికి బీఆర్ఎస్ మార్క్ స్పందన వేరే కథ…)
దేనిది దానికే… మర్యాద మర్యాదే, రాజకీయం రాజకీయమే అంటాడేమో… సరే… ఉరి వ్యాఖ్యలు డ్యామేజ్ చేశాయని భావించాడో ఏమో, నష్టనివారణకు ఓ ప్రయత్నం చేశాడు… తను మర్యాద రామన్న అని మైలేజ్ తెచ్చుకుని, ఉరి డ్యామేజీ కంట్రోల్ కోసం… ఇద్దరు మహిళా మంత్రుల్ని కేసీయార్ వద్దకు పంపించి… సమ్మక్క జాతరకు ఆహ్వాన పత్రిక అందింపజేశాడు…
చూశారా, కేసీయార్‌కు ఇవ్వాల్సిన మర్యాద, గౌరవాన్ని తప్పకుండా ఇస్తాను… రాజకీయంగా విభేదించినా సరే, నన్ను జైలుపాలు చేసి, బోలెడు కేసులు పెట్టి, ఎంత క్షోభపెట్టినా సరే కేసీయార్‌ను ఏమీ చేయడం లేదు అని చెప్పుకోవాలనుకున్నాడేమో… ప్లాన్ బాగుంది కానీ…
అక్కడ ఉన్నది కేసీయార్ కదా… పైగా రేవంత్ సోషల్ మీడియా ఖర్చుతో పోలిస్తే కేసీయార్ ఖర్చు ఓ ఇరవై, ముప్ఫై రెట్లు ఎక్కువ కదా… కేసీయార్ తన వద్దకు వచ్చిన మంత్రులను బాగున్నారా అని సాదరంగా పలకరించి, తిరిగి వెళ్లేటప్పుడు చీరె, బొట్టుతో ‘ఆడబిడ్డ’ మర్యాదలు చేశాడు, చూశారా ఇదీ మా బాస్ స్టయిల్ అని ఆ ఫోటోలతో కేసీయార్ సోషల్ మీడియా కాసేపు హల్‌చల్ చేసింది…

రేవంత్ రెడ్డి ప్లాన్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంది… ఇదే కేసీయార్, రేవంత్ రెడ్డిల సోషల్ బ్యాచులకు నడుమ ఉన్న తేడా… నిజానికి సమ్మక్క జాతరకు ఓ రాష్ట్రపతిని ఆహ్వానించారు అంటే అది వేరు… ఆమె ఈ దేశ ప్రథమ పౌరురాలు, సమ్మక్కను దేవతగా పూజించే ఆదివాసీలకు అత్యున్నత ప్రతినిధి… (ఆమె కూడా తన వద్దకు వచ్చిన మంత్రి, తోటి ఆదివాసీ సీతక్కకు చీరె పెట్టింది… అది ఆమె సంస్కారం, ఆదివాసీ ఆచారం కూడా…)
కేసీయార్ మాజీ సీఎం కావచ్చు, కానీ ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే… కాకపోతే ప్రతిపక్ష నేత… సమ్మక్క జాతరకు, లేదా ఏవైనా ఉత్సవాలకు గానీ ప్రత్యేకంగా ప్రతిపక్ష నేతకు స్వయంగా మంత్రులు వెళ్లి ఆహ్వానాలు ఇవ్వడం గుర్తులేదు… ఇస్తే తప్పులేదు కూడా…
కోట్ల మంది భక్తుల మనోభావాలను, మతభావాలను గౌరవించే దిశలో కేసీయార్ ప్రజాజీవితంలో ఉన్న ప్రధాన నేతగా జాతరకు వెళ్లాలి… అది ఆధ్యాత్మికం కాదు, అది బాధ్యత… దానికి ప్రత్యేక ఆహ్వానాలు అవసరం లేదు… తనే వెళ్లొచ్చు… కానీ రాజకీయాలు కదా… ఒకరిపైనొకరు అప్పర్ హ్యాండ్ ప్రచారం పొందడం కోసం ఈ ప్లాన్లు… విరుగుడు ఎత్తుగడలు..!!

ఈ మొత్తం ఎపిసోడ్‌లో విశేషంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే... ఇదుగో ఈ ఫోటో... మంత్రి సురేఖకు బొట్టు పెట్టి, చీరె పెడుతున్న కేసీయార్ సతీమణి... తన కొడుకు మీద చిల్లర, వెగటు వ్యాఖ్యలు చేసిన సురేఖకు నిర్వికారంగా బొట్టు పెట్టి ఆదరణ చూపడం...!!
Share this Article